Take a fresh look at your lifestyle.

ఉనికిని కనుక్కునే అన్వేషణ…

మనషుల హృదయాల్లో ఎడారులూ, కీకారణ్యాలు రహస్యంగా ఉంటాయని అవి పెట్టే  హింసలను యుద్ధఖైదీలా అనుభవించే అనివార్యతను ఎరుక చేసి హెచ్చరిక జెండాను ఎగరేసిన కవి రామాచంద్రమౌళి. తపస్సు  పేరిట తెలుగు ఇంగ్లీష్‌ ‌ద్విభాషా కవిత్వ సంపుటిని ఇటీవల ఆయన వెలువరించారు. రామాచంద్రమౌళి రాసిన తెలుగు కవితలను ఆత్రేయశర్మ, ఇందిరా బబ్బిల్లపాటి, పద్మనాభరావు అనంత, ప్రసాద్‌ ఎం‌విఎస్‌, ‌పురుషోత్తంరావు రావెల, వెంకటశేషసత్యనారాయణ  మైదవోలు ఆంగ్లంలోకి అనువదించగా కె పురుషోత్తం సంపాదకత్వంలో తపస్సు వెలువడింది.

ఆంతరిక జ్వలనమే కవిత్వమన్న నిరూపనలు ఎన్నో ఉన్న కవిత్వమిది. వర్తమాన సంక్లిష్ట జీవన సందర్భాలు ఎన్నెన్నో కవితల్లో  వ్యక్తావ్యక్తమయ్యాయి. తెగి అతుకుతూ మళ్ళీ మళ్ళీ విచ్ఛిన్నమవుతున్న జీవితం మనిషిని గాఢాశ్చర్యంలోకి నెట్టి  తనను తానే వెతుక్కునే దుస్థితికి ఈ కవిత్వం ఎన్నో రుజువుల్ని ముందు పెట్టింది. విచ్ఛిన్నకాలంలో అవిచ్ఛిన్నంగా సాగుతూ విలువల పతనం, సంపూర్ణ నైతిక విలువల భ్రష్టతలను  భరిస్తూ ఆత్మరక్షణ కోసం నడిచే మనిషి సంధించిన గొంతుకలలోని ధ్వని విస్ఫోటనానికి రామాచంద్రమౌళి కవితా చిత్రిక పట్టారు. గర్జించి ఆకాశ పర్జన్యమయ్యే ఒక మానవ సమూహ ఆవిర్భావం కోసం  సాగిన ఆంతరిక జ్వలనాన్ని ప్రతి కవిత్వ వాక్యం  వెదజల్లింది. పారవశోన్మత్తతను కోల్పోయిన మనిషిలో చివరకు మిగిలిన ఏమీ లేనితనంపై అకస్మాత్తుగా తాదాత్మ్యవీచిక  ప్రత్యక్షమై తన చల్లని స్పర్శతో తడిమి ధైర్యపు పాదముద్రలను వారసత్వంగా  ఇచ్చి వెళ్లిన  అనుభూతి దక్కుతుంది.

సాంస్కృతిక నాయకత్వంలో నైతిక విలువలను తిరిగి నిర్మించి మానవ సంబంధాలను పునఃస్థాపన చేయడం కోసం మౌనం వీడి ధైర్యంగా మాట్లాడే మానవ సమూహం  కోసం ఆకాశమంత విస్తరణతో కవి ఆహ్వానం పలికారు. హింస చెరను  దాటి బయటపడి ఆమె వర్షంలో తడుస్తున్న భూమిలా పులకించి పోయిందన్నారు. కొన్నిసార్లు బతకడం కంటే బతక్కపోవడమే  ఉత్తమమన్న మనిషి మానసిక  ధైన్యాన్ని  చెప్పిన రామచంద్రమౌళి కవితా వాక్యాలకు sometimes not living is better than living  అన్న ఆంగ్లానువాదాన్ని అనువాదకులు ఇందిర బబ్బిల్ల పాటి సందర్భావగాహనతో సమగ్రంగా అందించారు. తామ్రచంద్రునితో ఒక రాత్రి కవిత భాషే అవసరంలేని నిశ్శబ్ద సంవాదాన్ని  ఆవిష్కరించి  చూపింది. రహస్యాలు, జ్ఞానమూ బోధపడుతున్న వేళ కాంతి పుంజం లాంటి  దృష్టి కోణమై విస్తరించాలని అప్పుడే పయనం లోయాల్లోకా, శిఖరం పైకా అన్నది. తేలిపోతుందని స్పష్టం చేశారు. జీవితమంతా ఆత్మరక్షణేనని  ఆఖరిమెట్టుపై నిలబడి చెప్పారు. ఆకాశం తగలబడి పోతోందన్న కవి  ఆవేదనకుThe skys set ablaze అన్న అనువాద కవితా  వాక్యాలు సమర్థనగా మారి ఆ తీవ్రతను ఎత్తి చూపాయి. మనిషి పర్యటనలన్నీ సిసలైన  అధ్యయన యాత్రలైతే జీవితంలో దుఃఖపు తడి తగ్గిపోతుందన్నారు. అన్వేషణ అంటే ఉనికిని  కనుక్కోవడమేనని తెలిపారు.

ఆత్మ దేహంలో రవ్వంత అగ్ని ఉండి తపస్సు రగులుకుంటే చాలు బతుకు దీపం మట్టి దిగుట్లో కూడా దేదీప్యమై ప్రకాశిస్తుందంటారు.డిజిటల్‌ ‌జీవనంలో కరుణ, ప్రేమలకు తావుండదని, కన్నీళ్లుండని ఒట్టి కళ్ళే మిగిలుంటాయని చెప్పారు. చూపులన్నీ లక్ష్యాలపైనే ఉన్నప్పుడు/  ఒక వ్యూహాలే పన్నాగా లౌతాయి అన్న కవితా పంక్తులకు When all our looks get  tagged to the destined goals/ all our stratagies turn out as conspiring plotsఅన్న పురుషోత్తమరావు రావెల చేసిన అనువాద వాక్యాలు పరమపద సోపానంపై తడబడుతూ, పాముల చేత మింగబడ్తూ, నిచ్చెనలపై మిడుకుతూ జారిపడి తిరిగి లేస్తూ పడుతున్న మనిషిని చూపించాయి. బాల్యాన్ని  కవి చిక్కుపడ్తున్న దారపు ఉండతో పోల్చి చూపారు. ఎవరిదో ఒక చేయి కోసం వెదుకులాట తప్పని ప్రతి మనిషి తన బాల్యం నుండే జీవన మజిలీలలో రక్తాలోడుతూ తన సూదీ, తన దారంతో గాయపడ్డ ప్రతిసారీ తనను తాను కుట్టుకుంటున్నాడని వేదన చెందారు.Will these be dawn morrow% అన్న మైదవోలు వెంకటేశ్‌ ‌సత్యనారాయణ అనువాద వాక్యాలు ఈ క్రమంలో లోతుగా ఆలోచింపజేస్తాయి.

ఒక నాగరికతై, ఒక చరిత్రై ఒక సందిగ్థ  సమయమై వర్థిల్లుతూ వస్తున్న మనిషిని చూశాక ఇంతకూ యుగయుగాల పర్యంత ఈ పురామానవుడు ఎవరు? అన్న ప్రశ్నను కవి వేసుకొని అన్వేషణకు తెరతీశారు. సంధిసమయపు  సందిగ్థ సంధ్యలో ముందూ వెనకల బేరీజులో జీవితం రైలు పట్టాలపై నడకైందన్నారు. సంకోచించగల ప్రతిదీ వ్యాకోచిస్తుందనీ/  మౌనమే మహా సంభాషణమౌతుందనీ, చీకటి వ్యాకోచించి వెలుగు విస్తరించిన చివర్లో మిగిలే  మనిషి జాడను సంతకంలో చూడాలని అప్పుడే అస్సలు  పరిణామం అర్థమౌతుందని చెప్పారు. మట్టి భూమిని మనిషి చిరునామాగా చూపారు. ప్రాణం పోయాక అంతా శూన్యమార్మికతే అన్నారు. బంధాలనే సంకెళ్ళు తెగినాకే పక్షికి స్వేచ్ఛ  దక్కుతుందని చెప్పారు. సజీవ దృశ్యజ్వలనం ఒక స్ఫురణంగా మిగిలిపోతుందన్నారు. ప్రతిఘటనల్లోంచి చిరుగులన్నీ గాయాలేనా అని ప్రశ్నించారు. జీవితం ఒక  యుద్ధం/  గెలవాలంటే ఒక చేదోడు కావాలి/  ఏదీ ఒక సహహస్తం అన్న రామాచంద్రమౌళి కవితా వాక్యాలను Support is needed, no one is available in the street• అని ఆర్‌ అనంత పద్మనాభరావు అనువదించారు. పారిశుధ్య దేవతలు, రేడియో యూనిఫారాలు, చీపుళ్ళ శబ్దలయ, సన్నని సరిహద్దు రేఖ వంటి సరికొత్త పద ప్రయోగాలను రామాచంద్రమౌళి చేశారు.

అంతరాలు తొలగాలంటే గోడలను కాదు వంతెనలను నిర్మించమన్నారు కవి. ఆమె అతనూ ఇద్దరూ పరిమళాలే అయినప్పుడు భిన్నత ఒక ద్విధృవ విచికిత్స అని చెప్పారు. The Third Fragrance పేరిట ఇందిర బబిల్లపాటి ఆంగ్ల కవిత్వానువాదం ఈ కోణంలో ఆలోచనాత్మకంగా సాగింది. తెరవని పాప పిడికిలిలో నిశ్శేషమే ఉందో, ఆత్మ పరిభ్రమణమే నిక్షిప్తమై ఉందోనని సందేహిస్తారు. పుస్తక కాగితం దహనమైతే అక్షరాలు అగ్ని పునీతమవుతాయా అని ప్రశ్నిస్తారు. ఈ తరానికి  అగ్ని చికిత్స  అత్యవసరం అని చెప్పారు. పుట్టమట్టిగోడ వంటి మనిషి శరీరం ఒక బీడు నేలగా మారిందన్నారు. భారత్‌ ఒక విశ్వవిజేత / ఒక అగ్రదేశం అన్న కవి వాక్యాలను ఎంవిఎస్‌ ‌ప్రసాద్‌A Victory of the world, a developed nation అని ఆంగ్లీకరించారు. బొక్కెనకు జీవన సారూప్యతను అద్దారు. నిశ్శబ్దం దుఃఖమని, ఎగిరే తెల్ల పావురం విముక్తత అన్నారు. అంతిమంగా  జీవితం నీరు మాదిరిగా  చెరువై, సరస్సై, నదై భాసించే నిత్య జలాగ్ని అని చెప్పారు. మట్టిని వెదురుపూల పరిమళంగా శ్వాసించి నుదుటిపై తిలకంగా దిద్దుకునే మనిషే వీరుడని తెలిపారు. మనిషి ప్రశాంతంగా జీవించడానికి ప్రకృతి కావాలంటారు. నాలోపలంతా విద్యుతరి/ పచ్చగా వెలుగు స్వర్ణకాంతి అన్న కవి వాక్యాలను I could see a golden glow form inside the cave/ driven by the descending dark nightఅంటూ ఎంవిఎస్‌ ‌ప్రసాద్‌ ఆం‌గ్లంలోకి అనువదించారు. బయటాలోపలా మనిషిది జీవన్మరణ పోరాటమేనని, అసలు  బ్రతకడమెలా అన్నదే నిత్యయుద్ధమని తెలిపారు.

నిన్నునువ్వు  ప్రకటించుకో, వ్యక్తీకరించుకో, నిన్ను నువ్వు చేదుకో అని మనిషికి సూచించారు. జయంత్‌ ‌మహాపాత్ర రాసిన ఆంగ్ల కవితను స్వయంగా తెలుగులోకి అనువదించిన రామాచంద్రమౌళి ఒకచోట దోషాలతో నిండిన ఈ జీవిత గాయాలను  మాన్పాలని అంటారు. పాకురుమెట్ల దిగుడు బావి ఒక చరిత్ర, ఒక నాగరికత, సంస్కృతుల ఆనవాలు అన్నారు. నీ కళ్ళలోకి చూస్తూ అదృశ్యమైపోయే క్షణం కవితలో కొంతనీరు, కొంత నిప్పు మనిద్దరిలో కలిసి ఇద్దరమూ అదృశ్యమై ఒక కొత్త మనిషై ఉద్భవిద్దాం తొందరగా  వచ్చినన్ను చుట్టేయ్‌ అం‌టారు. తపోముద్రల వెనుక కవితలో పిడికెడు మట్టిని  శోధించమనడంou need to explore a handful of soil, a few footprints in the sandఅని ఆత్రేయశర్మ ఆంగ్లానువాదం చేశారు. భూమ్యాకాశాలు సమాకలించి ఆద్యంతాలు, అవధులు తెలుసుకోవాలన్నారు. పాతకిటికీని కొత్తగా తేరవడమే ఇప్పటి చారిత్రక అనివార్యత అని తెలిపారు. చీకటి వెలుగుల సంపూర్ణ కాంతిపుంజమే భగవంతుడన్నారు. పురామహామానవుల పాదముద్రలతో పునీతమైన దేవభూమిని ఘన శ్రమ సంస్కృతిని తలిచారు. స్వాగతం దొరా కవిత విదేశీపెట్టుబడుల విపరీతాలను ఎండగట్టింది. జీవితం ఒక అవిరామ క్రీడ, వెలుగు నీడల అనంతలీల అని చెప్పారు. మానవీయ విద్యతో వ్యక్తిలో అజ్ఞాతమై ఉండే వెలుగు ప్రకాశిస్తుందని తెలిపారు. శిఖరాలన్నీ లోయలుగా మారితే క్షితిజ  సమాంతర రేఖను అన్వేషించాలన్నారు.

భూమిలో సమాధైన విత్తనం అనివార్యంగా మొలకెత్తడంలోని రహస్యం తెలియాలంటారు. బయట అంతా పాతే కొత్తదనమంతా లోపలే వెతుక్కోవాలని చెప్పారు. కళ్ళలో ఇంకిపోయిన కన్నీటి సముద్రాలను కొలిచే పురికరం ఉందా అని ప్రశ్నిస్తారు. వెళ్ళడం ఎంత ముఖ్యమో, వెళ్ళి తిరిగి రాగలగడం అంతే ముఖ్యమని జీవన యుద్ధరంగంలో వీరుడై నిలిచిన మనిషిని ఉద్దేశించి అంటారు. ఆ ఊదారంగు పక్షి/  లోపల హృదయమంతా ఒక చిక్కుపడ్డ దారపు ఉండ అన్న రామాచంద్రమౌళి కవిత్వ పంక్తులకు The heart inside is full of a tangled roll of thread అన్న ఆంగ్లానువాద పంక్తులను యు ఆత్రేయశర్మ రాశారు. అనంత భీకర తాండవమైన సృష్టిలో  శాంతి క్రతువును మహామానవ ప్రపంచమంతా హోమించాలన్నారు. నదుల తీరాల నాగరికతకు కవి నమస్కరించారు. నీరే దైవం, నీరే మనిషిని అదే అంతిమ పుష్కరపాఠమని తెలిపారు. గాయమైన ప్రతిసారి రక్తం రాదన్న కవి మాటలనుisn’t a common consequences of every injury అని ఎంవిఎస్‌ ‌ప్రసాద్‌ అనువదించారు. రేపటి మహత్తరంగా మహాకాళేశ్వర జలాశయం మారాలని ఆకాంక్షించారు. లక్ష టన్నుల చెత్తను ఏ చీపుళ్ళతో ఎవరు ఊడుస్తారో అన్న ఆవేదనను లేలేత స్వప్నం కవితలో దేశం కోసం వ్యక్తపరిచారు. మానవీయతను అజేయ, అద్వితీయ పతాకంగా ఎగరేయడమే తెలుగు – ఇంగ్లీషు ద్విభాషా కవిత్వంగా వెలువడిన తపస్సులోని అంతిమ కవితా లక్ష్యం.
– తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply