ఉండకుంటే వెళ్లండి…

కొమురవెల్ల్లి జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలో మంత్రి కొండా సురేఖ సమీక్ష
స్టేజీపైకి కొమ్మూరిని పిలవడంపై మంత్రి, ఎమ్మెల్యే పల్లా మధ్య వాగ్వాదం
మీటింగ్‌ను బహిష్కరించిన ఎమ్మెల్యే పల్లా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బిఆర్‌ఎస్‌) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్‌ విషయమై మంత్రి, ఎమ్మెల్యే మధ్య కొంతసేపు ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. చివరకు చేసేదేమీ లేక ఎమ్మెల్యే పల్లా మీటింగ్‌ను బహిష్కరించి వెళ్లిపోయాడు.  వివరాల్లోకి వెళ్లితే…శనివారం సాయంత్రం సిద్ధిపేటలోని నాగులబండ వద్ద గల మినర్వా హెటల్‌(హరిత)లో జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామికి సంబంధించిన జాతర ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి సంబంధిత మంత్రి హోదాలో కొండా సురేఖ హాజరయ్యారు. ఇదే సమావేశానికి జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బిఆర్‌ఎస్‌) కూడా ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యాడు. అయితే, ఇదే సమావేశానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి పోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ స్టేజీ పైకి ఆహ్వానించింది.

దీనిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్ర  అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని అధికారిక సమీక్షా సమావేశమైన స్టేజీపైకి ఎలా పిలుస్తారంటూ మంత్రి కొండా సురేఖతో వాగ్వాదానికి దిగాడు. అయితే, ఈ సమావేశాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించడం లేదనీ, ఓ ప్రయివేట్‌ హోట్‌ల్‌లో నిర్వహిస్తున్నామనీ, ఇక్కడ ప్రోటోకాల్‌ పాటించాల్సిన అవసరం లేదంటూ మంత్రి కొండా సురేఖ ఒకింత ఘాటుగానే సమాధానం చెప్పినట్లు సమాచారం. ఇదేమీ పార్టీ మీటింగ్‌ కాదంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనడంతో…మీకు మాట్లాడేంతగా ఏమీ లేదన్నారు. మీటింగ్‌ మీకు నడవాలా…వద్దా..అని తిరిగి మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. మీ ఇష్టం అని చెప్పడంతో మీరు ఉండకుంటే వెళ్లండన్నారు. ఇలా చేసుకోవడానికి ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకని పల్లా అన్నప్పుడు…మీరు మాట్లాడంతగా అది లేదన్నారు. స్పెషల్‌ ఇన్వైటీగా పిలుచుకునే అధికారం, అథారిటీ తనకుందంటూ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేయడంతో…ఇక చేసేదేమీ లేక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీటింగ్‌ను బహిష్కరించి వెళ్లిపోయారు. మొత్తానికి కొద్దిసేపు మినర్వా హెటల్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీక్షా సమావేశం నుండి వెళ్లిన తర్వాత కొమ్మూరి స్టేజీపైకి వొచ్చారు. అనంతరం కొమురవెల్లి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, సంబంధిత అధికారులతో మంత్రి కొండా సురేఖ సమావేశాన్ని కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page