నేడు ప్రపంచంలో కమ్యూనికేషన్ విప్లవం నడుస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగాన్ని పటిష్టం చేయాల్సిన దిశగా ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. దినదినం ప్రింట్, ఎలక్ట్రానిక్స్, సోషల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగం (పి.ఆర్) ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల, గ్లోబలేజేషన్ నేపథ్యంలో ‘‘పి.ఆర్’’ వ్యవస్థ ఒక పరిశ్రమ స్థాయికి చేరుకుంది.అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ప్రజలకు జవాబుదారీ విధానంతో వ్యవహరించాల్సిన అవసరం మన ప్రభుత్వాలకు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత గుర్తెరిగి దేశంలోని పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్లంతా సంఘటితమై 1958 లో ‘రిపబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ను స్థాపించారు.
నాటి నుండి దేశంలో ప్రజాసంబందాల వ్యవస్థను పటిష్టం చేయడానికి ‘పి.ఆర్’ విభాగ ప్రాధాన్యతలను ఆవశ్యకతలను విస్తృతి పెంచడానికి నిర్విరామంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘పబ్లిక్ రిలేషన్ సొసైటి ఆఫ్ ఇండియా’ 1968 ఏప్రిల్ 21న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ప్రజా సంబందాల ప్రాధాన్యతను దేశం గుర్తించేలా నిర్వహించి 1986 ఏప్రిల్ 21న జాతీయ సదస్సులో జాతీయ ప్రజా సంబందాల దినోత్సవం ప్రకటించినాడు. నాటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 నాడు దేశవ్యాప్తంగా ప్రజా సంబంధాల దినోత్సవంగా పాటిస్తున్నారు.ప్రజల కోసం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వరకు వెళ్లాలంటే ఆయా కార్యక్రమాలు నిర్ధేశిత లక్ష్యాలు సాధించాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధి లాగా పనిచేసే వ్యవస్థ ఉండాలి. అలా పనిచేసేదే సమాచార ప్రజా సంబంధాల విభాగం.నేడు ప్రభుత్వాలు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఒక్కొక్క పథకానికి వందల, వేల కోట్ల ఖర్చు పెడుతున్నాయి. ప్రజలలో ఆయా పథకాల పట్ల అవగాహన కల్పించడానికి స్పష్టమైన, సరళమైన సహజమైన సంక్షిప్త సమాచారం సమగ్రంగా ప్రజా బహుళత్వానికి చేరాలి. అలా జరగాలంటే పకడ్బందీ, ప్రణాళిక బద్దమైన ప్రచారం అవసరం.
దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ప్రచారం కోసం సమాచార చేరవేత కోసం సమాచార, ప్రజాసంబంధాల శాఖ పైననే భారం వేస్తున్నారు. ఉండే పరిమితిని బట్టి ఆశాఖ వ్యవహరిస్తుంది. ఈ పద్దతి మారాలి.అన్ని ప్రభుత్వ శాఖలలో అన్ని స్థాయిలలో ప్రజాసంబంధాల విభాగాన్ని నెలకొల్పాలి. గ్రామీణ స్థాయి నుండి మంత్రిత్వ స్థాయి వరకు పిఆర్ వ్యవస్థను పటిష్టం చేయాలి.కొన్ని మంత్రిత్వ శాఖలు అవసరాన్ని బట్టి పి.ఆర్.ఓ లను ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా ఎంపిక చేస్తున్నారు. వారి పరిమితి కూడా కొద్ది వరకు మాత్రమే ఉంటుంది.
ఈ విధానం మారాలి.ఐ.ఎ.ఎస్ నుండి ఆఫీస్ సబార్డినేట్ వరకు ప్రతి ఉద్యోగికి ప్రజాసంబందాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అవసరమైతే శిక్షణ ఇప్పించాలి. కొత్తగా ఎంపిక చేస్తున్న ఉద్యోగులకు కూడా ఎంపిక ప్రక్రయలోనే పి.ఆర్ పట్ల అవగాహన కలిగేటట్లు శిక్షణ కార్యక్రమాలు ఇప్పించాలి.ఒకప్పుడు కార్యాలయాలకే పరిమితమైన ఉద్యోగ వ్యవస్థ సమాచార వ్యవస్థ సాంకేతిక విప్లవం నేపథ్యంలో పరిపాలనా విభాగం నిర్వచనమే మారిపోయింది. ప్రతి చిన్న కార్యాలయమైనా ప్రజాసంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.పి.ఆర్ వ్యవస్థ ప్రాధాన్యాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు, కార్పోరేట్ సంస్థలు, ఎన్‌జీవోలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రజాసంబందాల విభాగం అనేది నేడు ప్రతి సంస్థకు కూడా తప్పనిసరి విభాగం అయ్యింది.
సమాచార హక్కు చట్టంగా మారి 14 సంవత్సరాలు దాటింది. మరోవైపు సోషల్ మీడియా విస్తృతి విభజిస్తోంది. ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఉద్యోగికి ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ తప్పనిసరి అవుతోంది.ప్రజాసంబంధాల ఆవశ్యకతను గమనించి ప్రధాన్యత ఇచ్చే సంస్థలు, వ్యవస్థలు చినరికి వ్యక్తులు కూడా విజయవంతం అవుతారనే విషయాన్ని గుర్తెరగాలి.
– సురేష్ కాలేరు,రాష్ట్ర సహధ్యక్షులు
తెలంగాణ ఉద్యోగుల సంఘం, 9866174474