ఇం‌ట గెలిచారు… రచ్చ గెలుస్తారా?

  • గులాబీ పార్టీకి… 22 ఏండ్లు
  • ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీ దాకా…
  • జాతీయ పార్టీగా మారేనా?…దేశానికి నాయకత్వం వహించేనా?
  • రాబోయే రెండేళ్ల కాలం కేసీఆర్‌కు కత్తి మీద సామే..!?
  • 11 కీలక అంశాలపై తీర్మానం
  • కేసీఆర్‌ ‌ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ

ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర : నేటితో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌) ఆవిర్భవించి 21ఏళ్లు పూర్తవుతుంది. 22వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ రెండు దశాబ్దాల పార్టీ ప్రయాణాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌(‌హెచ్‌ఐసిసి) వేదికగా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పార్టీ అధిష్టానం, శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. బుధవారం ఉదయం పదకొండు గంటలకు పార్టీ అధ్యక్షుడి హోదాలో సిఎం కేసీఆర్‌ ‌పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా 11 కీలక అంశాలపై తీర్మానం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా పట్నమంతా ఎక్కడ చూసినా గులాబీమయమే. గులాబీ తోరణాలతో పట్నం కొత్త శోభను సంతరించుకుంది. పండుగ వాతావారణం నెలకొంది. ఒక పట్నంలోనే కాదూ, యావత్‌ ‌తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులందరూ పండుగలా పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకునే పనిలో ఉన్నాయి. తెలంగాణ సాధించిన ఆత్మగౌరవాన్ని చాటేలా గులాబా జెండాను ఎగరవేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి…యావత్‌ ‌దేశంలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ గులాబీ జెండాను పార్టీ శ్రేణులందరూ ఇంటిపై ఎగరవేయనున్నారు.

హుస్సేన్‌ ‌సాగర్‌ ఒడ్డున…కేసీఆర్‌ ‌నాయకత్వంలో పురుడుపోసుకుని..
సరిగ్గా 21 ఏళ్ల కిందట అంటే ఇదే రోజు(ఏప్రిల్‌ 27, 2001)‌న ప్రస్తుత సిఎం, నాటి ఉద్యమకారుడు కేసీఆర్‌ ‌నాయకత్వంలో పిడికెడు మందితో హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున జలదృశ్యయంలో పురుడుపోసుకున్న ఒక విత్తు నేడు మహా వృక్షమైంది. కేసీఆర్‌ ‌నాయకత్వంలో…నాటి కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969 నాటి ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులే. పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. ఎక్కడా హింసకు తావు లేకుండా గాంధేయ మార్గంలో ఉద్యమ పంథాను నిర్దేశించారు. ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కున్నప్పటికీ… దాదాపు 13 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఎట్టకేలకు స్వరాష్ట్ర కాంక్షను టిఆర్‌ఎస్‌ ‌నిజం చేయగలిగింది. ఆ తర్వాత ఉద్యమ సారథి కేసీఆర్‌ 2014‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం…2018లో టిఆర్‌ఎస్‌ ‌మరోసారి అధికారంలోకి వొచ్చిన విషయం విధితమే.

కేసీఆర్‌ ‌ప్రస్థానం ఇలా…
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అలియాస్‌ ‌శేఖరన్న అలియాస్‌ ‌కేసీఆర్‌..ఆ ‌పేరు అ(వి)ంటేనే జై తెలంగాణ నినాదంలా వినిపిస్తుంది. సిద్ధిపేట మండలంలోని చింతమడకలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కేసీఆర్‌…‌కాంగ్రెస్‌ ‌పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983లో తొలిసారిగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సిద్ధిపేట నుంచి టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆయన అప్పటి నుంచి వెనక్కి చూడలేదు. 1985 నుంచి ఇప్పటి దాకా ఆయనకు ఓటమంటే ఎరుగడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప సభాపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అనేక పదవులు చేపట్టారు. చేపట్టిన ప్రతి పదవికీ ఆయన వన్నె తెచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన ఉద్యమం, పోరాటం దాదాపుగా పుష్కర కాలం పాటు వెనకడుగు వేయకుండా ఉద్యమ స్పూర్తిని రగిలించి పసి పాప నుంచి పండు ముసలి వరకు జై తెలంగాణ అనేలా చేసిన పోరాట పటిమ ఆయనది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అంటే చాలూ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నది. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించిన శక్తి ఆయనది. 2001 ఏప్రిల్‌ 27‌న పదవులు ముఖ్యం కాదు, ప్రాంత అభివృద్ధి ముఖ్యం అంటూ దశాబ్దాలుగా చెలిమి ఉన్న తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి అంకురార్పరణ చేశారు.

తన మాటల్నే పెట్టుబడిగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీని స్థాపించిన కేసీఆర్‌ ఎన్నో మంచి చెడులను తన ఖాతాలోకి వేసుకున్నాడు. పార్టీ పుట్టిన మూడు నెలల్లోనే వొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ గుబాళించింది. కారు స్పీడు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీ నేతల్లో వణుకును పుట్టించింది. 2001లో సిద్ధిపేట అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ 56 ‌వేల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీతో జత కట్టి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నారు. కొద్ది నెలలకే కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని బయటకు వొచ్చి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత రాజశేఖర్‌రెడ్డి సర్కార్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపితో జతకట్టి రెండు ఎంపి స్థానాలను, 11 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది టిఆర్‌ఎస్‌. ‌రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఉద్యోగాలకు సంబంధించి తలెత్తిన వివాదం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దారి తీసింది. 2009 నవంబర్‌లో కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగారు. ఈ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ సాధన కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలు..ఎత్తుగడలతో ముందుకుపోతూ ప్రతి అడుగును ఆచితూచి వేస్తూ తెలంగాణ గమ్యాన్ని చేరుకునే వరకు ఆయన అలుపెరగని పోరాటం చేశారు. ఆఖరి అస్త్రగా తెలంగాణ తెచ్చుడో…కేసీఆర్‌ ‌సచ్చుడో అనే ఏకైక నినాదంతో కేసీఆర్‌ ఉద్యమంలోకి దూకారు. అందరి నోట తెలం‘గానం’ అనిపించేలా చేయడంలో కేసీఆర్‌ ‌సఫలీకృతులయ్యారు. దీంతో అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కున్నారు. విమర్శలు ఎదుర్కున్నారు. వ్యక్తిగతంగా కూడా ఎన్నో విమర్శలను చవిచూశారు. అవమానాలు పడ్డారు. కానీ, వాటన్నింటిని అధిగమించారు. తెలంగాణను సాధించారు.

ఉద్యమ పార్టీయే..అధికార పార్టీగా…
ఎనిమిదేండ్ల కిందటి వరకు పార్టీని, ఉద్యమాన్ని రెండింటిని ఏక కాలంగా సమాంతరంగా నడిపించిన కేసీఆర్‌ ఉద్యమంలో విజయాన్ని సాధించి ప్రస్తుతం ప్రభుత్వ సారథిగా కొత్త పాత్రలో ఒదిగిపోయారాయన. రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల రాష్ట్రంలో టిడిపి, వైఎస్‌ఆర్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు అడ్రస్‌ ‌లేకుండా పోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నుంచి 12 మంది వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం కారెక్కారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌ ఎదిగింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలనను సాగించాలన్న తపనలో సిఎం కేసీఆర్‌ ఉన్నారు. తనకు అధికారమిచ్చిన ప్రజలకు ఎన్నో మేళ్లు చేసే దిశగా కేసీఆర్‌ ‌వడివడిగా అడుగులు వేస్తున్నారు. గడిచిన ఎనిమిదేండ్లుగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా పెట్టనవి కూడా ఎన్నో కొత్త కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఎండాకాలంలోనూ చెరువులు మత్తడులు దుంకేలా చేసిన ఘనత కేసీఆర్‌దేననీ చెప్పాలి. ఉద్యమ నేత నుంచి ప్రభుత్వాధినేతగా మారిన కేసీఆర్‌ ‌తీసుకుంటున్న పలు నిర్ణయాలను విపక్షాలు, ప్రజాసంఘాలు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రత్యక్ష పోరాటాలకు దిగుతున్నాయి. ముఖ్యంగా భూ కుంభకోణాలు, హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్, ‌గంజాయి, ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌పై విపక్షాలన్నీ పోరాటాలు చేస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఉద్యమ పార్టీ కాదని, అదొక కుటుంబ పార్టీ అని, సూటుకేసుల పార్టీ అని, ఫామ్‌ ‌హౌస్‌ల పార్టీ అని, కేసీఆర్‌కు సీట్లు, నోట్లు తప్ప మరొకటి పట్టవని కేసీఆర్‌ ‌కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్‌ ‌మాత్రం ఏనాడు అదరలేదు. అంతకంటే బెదరలేదు. చలించలేదు. ప్రతిపక్షాల ఆరోపణలు ఏమాత్రం పట్టించుకోకుండా సిఎం కేసీఆర్‌ ‌తన పంథాలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిని పెట్టి తెలంగాణను బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు.

ఇంట గెలిచారు…రచ్చ గెలుస్తారా?
‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అనేది సామెత. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎప్పుడో ఇంట(తెలంగాణ)లో గెలిచారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు మొదలుకుని పంచాయతీలు, జిల్లా పరిషత్‌, ‌మునిసిపల్‌ ఎన్నికలు, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికలు, సింగరేణి ఎన్నికల వరకూ ప్రతి ఎన్నికలలోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. ప్రతి ఎన్నికలలోనూ ప్రజటు టిఆర్‌ఎస్‌ ‌పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తూ… టిఆర్‌ఎస్‌ ‌పార్టీని అక్కున చేర్చుకున్నారు. అయితే, గత కొంత కాలంగా కేసీఆర్‌ ‌దృష్టి జాతీయ రాజకీయాల వైపు మళ్లించారు. సిఎం కేసీఆర్‌ ఇటీవల కాలంలో బిజెపియేతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ ముఖ్య మంత్రులతో పాటు పశ్చిమబెంగాల్‌ ‌సిఎం మమత బెనర్జీ, జార్ఖండ్‌ ‌సిఎం హేమంత్‌ ‌సోరెన్‌, ‌మహారాష్ట్ర సిఎం ఉద్దవ్‌ ‌థాకరేను ఆయన కలిశారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని కోరుకుంటున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీహార్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ) నేతలైన తేజస్వీ యాదవ్‌, అఖిలేష్‌యాదవ్‌తో పాటు మహారాష్ట్రలో ఎన్‌సిపి అధినేత శరద్‌ ‌పవార్‌ను కలిసి మద్దతు కోరారు. రానున్న రెండేళ్ల కాలం మాత్రం సిఎం కేసీఆర్‌కు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కత్తి మీద సామే అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు, రెండో ఏడాదిలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. బిజెపి పార్టీ రాష్ట్రంలో ఎదగడానికి అన్ని అస్త్రాలను ఉపయోగించే పనిలో ఉండటంతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి రాజకీ యంగా కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కునక తప్పదని అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణలో ఇంటి పార్టీగా ఎన్నో విజయాలను సాధించిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ పార్టీగా మారి, దేశానికి నాయకత్వం వహిస్తుందా… లేదా? అన్న దానిపై అనేక చర్చలు, ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. సిఎం కేసీఆర్‌ ‌మాత్రం దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎదుగుతుందని చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నట్లు కనబడుతుంది. ఏది ఏమైనా వొచ్చే సంవత్సరం టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చాలా ముఖ్య మైందని చెప్పాలి. ఇప్పటికే ఇంట గెలిచిన కేసీఆర్‌…‌భవిష్యత్‌లో రచ్చ గెలుస్తారా? లేదా?అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page