- రాష్ట్రంనుండి పోటీకి మోదీని ఆహ్వానించాలని బిజెపి, సోనియాకోసం తీర్మానం చేసిన కాంగ్రెస్
- పార్లమెంట్‌లో తెలంగాణ గళంకోసం కెటిఆర్, కవితలంటున్న బిఆర్‌ఎస్
(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణలో త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిగా మారనున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు, జాతీయ పార్టీగా విస్తరించే దశలో ఉన్న ప్రాంతీయ పార్టీ మధ్య రసవత్తర పోటీ జరిగే అవకాశాలున్నాయి. ఈసారి కూడా తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఉండనున్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ సోనియాగాంధీ, బిజెపి సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీని నిలబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. నిజంగానే వీరిద్దరు ఇక్కడినుండి పోటీచేస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ రెండు జాతీయ పార్టీలను ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలో పడిరది ఇప్పుడు బిఆర్‌ఎస్. నెలరోజులకింద జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు తామే అధికారానికి వొస్తామన్న ధీమాను వ్యక్తం చేశాయి. పార్టీలెన్ని పోటీపడిన విజయం మాత్రం ఏదో ఒక పార్టీకే సొంతమవుతుందన్నట్లుగానే ఈసారి కాంగ్రెస్‌ను వరించిన విషయం తెలియంది కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా దశాబ్ధకాలం అధికారాన్ని చెలాయించిన బిఆర్‌ఎస్ పార్టీని పక్కకుపెట్టి ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సాధారణ మెజార్టీతో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సిద్దమవుతున్నది.
ఈనెల చివరన లేదా వొచ్చేనెల మొదటి వారంలో ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో తమ ఆధిక్యతను నిరూపించుకోవాలని పై మూడు పార్టీలు ఇప్పటి నుండే తీవ్రస్ధాయిలో కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి పార్టీల అధిష్టాన వర్గాలు ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోనున్నాయి. ఒక పక్క బిజెపి కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో దక్షిణాది నుండి అధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని చూస్తున్నది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలను సాధించుకోవాలన్న పట్టుదలగా ఉంది. తెలంగాణలో ఉన్న 17 లోకసభ స్థానాల్లో కనీసం 12 నుండి 15 స్థానాలను గెలచుకునే విధంగా ప్రణాళిక రచిస్తున్నది. గత ఎన్నికల్లో నాలుగు లోకసభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా కొంతవరకు ఆ పార్టీ విజయం సాధించింది. కాని, ఈసారి మోదీ హ్యాట్రిక్ సాధించాలంటే మరిన్ని స్థానాలు అవసరం. అందుకే ఈసారి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్ళేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. శాసనసభ ఎన్నికల్లో తమ శక్తి యుక్తులను ప్రదర్శించినప్పటికీ అత్యల్ప స్థానాలను సాధించుకుంది. 14శాతం వోటింగ్‌్‌తో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అయితే ఈసారి ముప్పై అయిదు శాతం వోటింగ్‌్‌ను సాధించడం ద్వారా కనీసం పది స్థానాలనైనా సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకు స్వయంగా దిల్ల్లీ పెద్దలే రంగంలోకి దిగనున్నారు.
ముఖ్యంగా ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించే బాధ్యతను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పైన అధిష్టానం అప్పగించింది. కాగా ఇప్పటికే ఎన్నికల సన్నాహక సమావేశాలు పార్టీ నిర్వహిస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డితోపాటు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, ముఖ్యనాయకులు తరుణ్‌చుగ్, అరవింద మీనన్ తదితరులు ఇప్పటికే సమావేశమై ముందస్తుగానే అభ్యర్దులను ఎంపిక చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే దక్షిణాదిలో బిజెపి విస్తరించాలంటే రేపు తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని నిలబెట్టాలని ఆ పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబాన్ని పోటీకి నిలిపే ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసిన సోనియాగాంధీని ఇక్కడినుండి గెలిపించుకోవడంద్వారా ఆమె రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నది. ఈ మేరకు ఆ పార్టీ టిపీసీసీలో ఏకగ్రీవ తీర్మానంచేసి అధిష్టానానికి పంపించింది కూడా. ఈ విషయంలో అధిష్టానం సోనియాగాంధీ మధ్య చర్చజరుగుతున్నట్లు కూడా వార్త. ఒకవేళ సోనియాగాంధీ అంగీకరించిన పక్షంలో మెదక్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీచేయించే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తున్నది. సోనియా రాని పక్షంలో ప్రియాంకాగాంధీనైనా ఇక్కడినుండి గెలిపించుకోవాలను కుంటున్నారు. అయితే ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీలను ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలో పడిరది బిఆర్‌ఎస్. శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత నిరుత్సాహ పడవొద్దని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే పార్లమెంటు ఎన్నికల సన్నాహ సమావేశాలను ఆ పార్టీ నిర్వహిస్తున్నది.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా పోయిన ప్రతిష్టను నిలబెట్టుకోవడం ఒకటికాగా, తమ పార్టీని విస్తరించుకోవడం, పార్లమెంటులో తమ వాణిని వినిపించాలన్న లక్ష్యంగా ఆ పార్టీ కనీసంగానైనా 15 స్థానాలను గెలచుకునేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బిజెపిలు సోనియా,మోదీలను నిలబెడితే అందుకు ధీటుగా ఎవరిని నిలబెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. వారితో పోటీకి కాకున్నా పార్లమెంటులో తమ వాయిస్ వినిపించేందుకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్‌ను, అలాగే ఎమ్మెల్సీ కవితను కూడా పార్లమెంటుకు పోటీ చేయించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.




