శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ సంక్షోభంగామారి అది ప్రజల మహోగ్రజ్వాలల మధ్య రావణకాష్టమై మండుతున్నది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఆందోళనకారులు ఆయన ఇంటితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్ళను అగ్నికి ఆహుతి చేశారు. అయినా వారి కోపం చల్లారలేదు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక ఎంపితో పాటు పలువురు మరణించగా వందలాదిమంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలైనారు. ప్రభుత్వ ఆస్థులేకాకుండా ఆందోళన కారులకు కనిపించిన ప్రైవేటు ఆస్తులు, కార్లపైదాడిచేయడంతో పరిస్థితి భయాందోళనకరంగా మారడంతో ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఆదేశాలను జారీ చేసింది. ప్రజల ఆస్తులను దోచుకోవడం, ప్రాణనష్టం కలిగించడం లాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వెంటనే కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్ష దిగిపోవాలంటూ అక్కడి ప్రజలు కొంతకాలంగా నిరసనలు చేపట్టారు. అయితే నిరసన కారులపైన ప్రభుత్వ మద్దతుదారులు దాడులు చేయడంతో ఇది ఇరుపక్షాల ఘర్షణకు దారితీసింది. వాస్తవానికి అధ్యక్షుడు గోటబయ రాజపక్ష తీసుకున్న అనేక నిర్ణయాలు ఆదేశ దుర్భర పరిస్తితికి దారితీసింది. శ్రీలంకలో ఆర్థిక క్షీణత కొత్తగా ఏర్ప డిందేమీకాదు. అనేక సంవత్సరాలుగా ఆర్థిక అసమానతలతో ఆ దేశం సతమతమవుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా సరైన పాలన నిర్వహించకపోవడం ఈ దుర్గతికి కారణంగామారింది. స్థోమతకు మించి ఇతర దేశాలనుండి తీసుకున్న అప్పులను చెల్లించే స్థితిలోలేకపోయింది. ఇదిప్పుడా దేశానికి మోయలేని భారంగా పరిణమించింది. దేశంలో క్రమేణ నిల్వలు పడిపోయి, దిగుమతులు నిలిచిపోయి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. దాంతో దేశంలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొంది.
నిత్యావసర వస్తువులు లభించకపోవడం, ఒక వేళ ఉన్నా వాటి ధరలు ఆకాశాన్ని అంటుకోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టక తప్పిందికాదు. ఈ సంక్షోభానికి కారకుడిగా భావిస్తున్న దేశ అధ్యక్షుడిని వెంటనే పదవినుండి దిగిపోవాల్సిందిగా ఆందోళనకారులు ఆయన భవనం ముందే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. పార్లమెంటు ను ముట్టడించడానికి ప్రయత్నించారు. దేశంలో శాంతిభద్రత సమస్యలు నెలకొనడంతో పలు దఫాలుగా ఎమర్జన్సీ విధించక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఇక ఎంతమాత్రం తాను పదవిలో ఉండలేనని తెలిసిన ప్రధాని మహీంద రాజపక్స గత సోమవారం తన పదవికి రాజీనామాచేయక తప్పిందికాదు. అప్పటికి కూడా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఆయనమీద దాడిచేసేందుకు ఆయన నివాసంపైకి ప్రజలు దూసుకుపోవడానికి ప్రయత్నించారు.
అయితే భద్రతా సిబ్బంది తీసుకున్న చర్యలవల్ల పెను ప్రమాదం తప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. భద్రతా సిబ్బంది మహీందను, ఆయన కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. అయితే ఆయన పలాయనం చిత్తగించాడని, తలదాచుకునేందుకు భారత్‌కు వెళ్ళాడంటూ వస్తున్న వదంతులను భారత్ సర్కార్ కొట్టివేసింది. కాని, పరిస్థితితులు అదుపు తప్పుతుండడంతో శ్రీలంక ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేసింది. విచిత్రమేమంటే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో ఆకలి కేకలు పోయి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
అధికార పార్టీ నాయకులు, వారి మద్దతు దారులపై దాడులు చేస్తున్న అసంతృప్తివాదులను, అధికార పార్టీకి చెందినవారు ప్రతిఘటిస్తుండడంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడుతున్నది. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం జరుగుతున్నది.
మొత్తంమీద శ్రీలంకలో జరుగుతున్న పరిణామం కేవలం ప్రజల ఓట్లకోసం, వారిని అకట్టుకునేందుకు ‘ఉచిత’ హామీలను ప్రకటించే ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా మారింది. శక్తికి మించిన హామీలివ్వడం, వాటిని అమలు పర్చేందుకు విదేశాలనుండి అప్పులు తీసుకుని రావడం, వాటిని తీర్చలేని పరిస్థితి ఎలా ఉంటుందంటే అందుకు శ్రీలంక ఒక ఉదాహరణగా నిలుస్తున్నది స్పష్టమవుతున్నది. కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం గుర్తుచేస్తున్నది.
– మండువ రవీందర్‌రావు