నన్ను పారేసుకుని
నీలో వెతుకుతుంటే….
నాలో ఏదో వెతుకుతూ
నీవు కనపడ్డావు….
ముఖముఖాలు రాసుకుని
గీతలు పడ్డ చూపుల్లో
ఒకరినొకరు తడుముకుని
కళ్ళు తలుపులు తెరచుకుని
ఆచూకీ లేని ఇష్టాలు
అర్ధాకలితో ఎదురుపడి
ఒకరి బాధలో మరొకరిని గుర్తించి
కమిలిన మాటలను ఊరటలో ముంచి తేల్చి
పాత రోజులను పిలచి
కొత్త ఊహల్ని పరిచయం చేసి
మెత్తగా అల్లుకునే క్షణంలోని నిజాయితీకి
మంచులా కరిగిన కాలం
గడ్డకట్టిన కథలో చల్లగా చేరి
చెదపట్టిన రోజుల
చెరపట్టిన భావాలను
విడిపించి, విధిలించి, వివరించే మనసుతో
నీలో దొరకిన నన్ను
నీకే అప్పగించాలని
నాలో వెతికే నీ గుర్తులను
నీకే చూపించాలని..
…చందలూరి నారాయణరావు
9704437247