23 ఏప్రిల్ 1564న ఇంగ్లాండ్, స్టాన్ఫర్డ్‌లోని తోలు వ్యాపారి కుటుంబంలో మేరీ ఆర్డన్, జాన్ షేక్స్‌ఫియర్ దంపతులకు జన్మించిన విలియమ్ షేక్స్‌ఫియర్ 26 ఏప్రిల్‌న బాప్టిజమ్ స్వీకరించారు. విలియమ్ షేర్స్‌ఫియర్ తల్లితండ్రులతో పాటు సంతానం కూడా నిరక్షరాస్యులే అయినప్పటికీ విలియమ్ షేక్స్‌ఫియర్ మాత్రమే ప్రపంచ ఆంగ్ల సాహిత్య చరిత్రలో చెరగని ముద్రను వేశారు. ప్రఖ్యాత నాటక రచయిత, కవి, రంగస్థల నటుడైన షేక్స్‌ఫియర్ స్ట్రాట్‌ఫర్డ్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ‘ఇంగ్లాండ్ జాతీయ కవి’గా పేరుగాంచిన షేక్స్‌ఫియర్ 39 నాటకాలు, 154 సోనెట్స్, మూడు దీర్ఘ కవితలు, ఇతర రచనలు ఎన్నో చేశారు. వారు రచించిన అత్యద్భుత నాటకాలను అనేక ప్రపంచ భాషల్లోకి కూడా అనువదించారు.
తన 18వ ఏట 26 ఏండ్ల వయస్సుగల ‘అన్నే హాత్‌వే’ను వివాహమాడి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ప్రథమ సంతానంగా 1583లో కూతురు ‘సుసన్నా’, 1585లో కవల పిల్లలు ‘హామ్‌నెట్’, ‘జూడిత్’లు జన్మించారు. 1985 తరువాత 7 సంవత్సరాలు ఏమి చేశారో తెలియని (బహుశ ఉపాద్యాయుడిగా లేదా వేటగాడిగా చేసి ఉండవచ్చని) అజ్ఞాత చరిత్రను ‘లాస్ట్ ఇయర్స్’గా రికార్డు చేశారు.
షేక్స్‌ఫియర్ ప్రముఖ రచనల్లో హామ్లెట్, రోమియో అండ్ జూలియట్, ఒథెల్లో, కింగ్ లియర్, కింగ్ జాన్, జూలియస్ సీజర్, క్వీన్ ఎలిజెబెత్, మర్చంట్ ఆఫ్ వెన్నిస్, 3 భాగాల హెన్రీ •, కామెడీ ఆఫ్ ఎరర్స్, ది టెంపెస్ట్, మాక్‌బెత్ లాంటి అనేక సాహిత్య కళాఖండాలు ఉన్నాయి. నాటి సాంప్రదాయ కుటుంబ శైలికి దగ్గరగా ఉండేలా, నూతనత్వం మేళవించి, ప్రేమల నుండి యుద్ధాల వరకు ఆకర్షణీయంగా, వాస్తవానికి దగ్గరగా, తనదైన సరళ శైలిలో తన రచనలను చేశారు. విశ్వవిద్యాలయ విద్య కూడా చదవని విలియమ్ షేక్స్‌ఫియర్ తన జీవిత కాలంలో హాస్య, ప్రేమకథా, చారిత్రక, విషాద రచనలు ఎన్నో చేశారు. తన వ్యక్తిగత జీవితం గూర్చి స్పష్టమైన వివరాలు తెలియనప్పటికీ, ఆయన రచనల్లో మానవీయ భావోద్వేగాలు, సంఘర్షణలు గత నాలుగు శతాబ్దాలుగా కొనయా బడుతున్నవి.
విలియమ్ షేక్స్‌ఫియర్ ప్రపంచ ప్రఖ్యాత అత్యుత్తమ ఆంగ్ల సాహిత్యకారుడే అయినప్పటికీ, అతని జీవిత విశేషాలు సవివరంగా తెలియక పోవడం విచారకరం. తన జన్మదినం రోజుననే తన 52వ ఏట 23 ఏప్రిల్ 1616న తుది శ్వాస విడవడం జరిగింది. విలియమ్ షేక్స్‌ఫియర్ భౌతికంగా మన ముందు లేకపోయినా, తన నాణ్యమైన రచనలు కాలం ఉన్నంత వరకు మనల్ని నడిపిస్తూ, ఉల్లాస పరుస్తూ, జీవిత కష్ట సుఖాలను రుచి చూపిస్తూ, విశ్వ మానవాళికి మార్గదర్శకంగా ఉంటాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 9949700037