నేడు శ్రీనివాస రామానుజన్ వర్ధంతి
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ’గణిత’ మేధావి శ్రీనివాస రామానుజన్ భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం.
అపారమైన మేథ•స్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 22, 1887 – ఏప్రిల్ 26, 1920) 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఆయనకు పది సంవత్సరాల వయసులోనే గణిత శాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. పదమూడేళ్లకే ఎస్‌ఎల్ లోనీ త్రికోణమితిపై రాసిన పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాదు తను సొంతంగా సిద్ధాంతాలు కూడా ప్రారంభించారు.
కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్ గణితం మీదే శ్రద్ధ చూపి మిగిలిన సబ్జెక్టులపై దృష్టి పెట్టక పోవడంతో ఎఫ్‌ఎ పరీక్ష తప్పారు. ఆ తరువాత మద్రాస్‌లోని పచ్చయ్యప్ప కాలేజీలో చేరారు. అక్కడ ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సింగారవేలు ముదలియార్, రామానుజన్‌తో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తుండేవారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై రామానుజన్ విశేష పరిశోధనలు చేశారు. 1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్య చకితుణ్ణి చేశారు. రామానుజన్ అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నపుడు, హార్డీ ఆయనను పలుకరించటానికి వెళ్లి మాటల మధ్యలో తాను వచ్చిన కారు నంబరు 1729, దాని ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ? అని అడిగారు. అందుకు రామానుజన్ తడుము కోకుండా ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య అని, ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యా సమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి నిదర్శనం.
మహా మేధావులు కూడా సాధించలేని సమస్యలను అలవోకగా ఎలాంటి పుస్తకాల సాయం లేకుండా సాధించి, ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్. రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్దులైన ఆయిలర్, గౌస్, జకోబి మొదలైన సహజ సిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వారు. రామానుజన్‌లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం.
15ఏళ్ళకే రామానుజన్‌లోని తెలివితేటలను ప్రపంచానికి చాటడానికి దోహదం చేసిన గ్రంథం జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రాసిన ‘సినాప్సిస్’. అందులో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. పెద్దపెద్ద ప్రొఫెసర్‌లు సైతం అర్థం చేసుకోలేకపోయిన ఈ సిద్ధాంతాలను, సూత్రాలకు రామానుజన్ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవారు. 3,500 గణిత ఫలితాలను సమీకరించిన రికార్డును సొంతం చేసుకున్న మేధావి. 1903లో మద్రాసు విశ్వ విద్యాలయంలో స్కాలర్‌షిప్ వచ్చింది. లెక్కల వల్ల కొడుకుకి పిచ్చి పడుతుందేమోనని భయపడిన రామానుజం తండ్రి ఆయనకు పెళ్ళి చేశారు. సంసారం గడవటం కోసం 25 రూపాయల వేతనం మీద రామానుజన్ గుమాస్తాగా చేరారు. చిత్తు కాగితాలను కూడా బహు జాగ్రత్తగా వాడుకుంటూ గణితమే లోకంగా బతికేవారు. గణితంలో ఆయన ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూచి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వ విద్యాలయం నెలకు 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో మద్రాస్ పోర్ట్‌ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డా.వాకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డికి పంపారు. ఉన్నత స్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు.
జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. 33 ఏళ్ళకే ఆయన 1926, ఏప్రిల్ 26న మరణించారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494