విచారణను 19కి వాయిదా వేసిన సుప్రీమ్ కోర్టు
న్యూ దిల్లీ, జూలై 12: విప్లవకవి వరవరరావు మెడికల్ బెయిల్‌ను సుప్రీమ్ కోర్టు మరోసారి పొడిగించింది. భీమా కోరెగావ్ కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు వైద్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్ ఇవ్వాలని బాంబే హైకోర్టును కోరారు. ఆ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేయడంతో..దాన్ని సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుభాషిణి దౌలియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అయితే విచారణకు అవసరమైన పత్రాల సమర్పణకు ఒక్కరోజు గడువు ఇవ్వాల్సిందిగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో సుప్రీమ్ కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అయితే ఇరుపక్షాల న్యాయవాదులు విచారణకు మరింత సమయం కావాలని కోరగా..వారి వాదనలు విన్న సుప్రీమ్ కోర్టు విచారణను జులై 19కి వాయిదా వేసింది. అయితే బెయిల్ గడువు ముగియడంతో వరవరరావు ఈ రోజు సాయంత్రం లొంగిపోవాల్సి ఉంది. దీంతో ఈనెల 19వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది.




