రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి ఎక్కువయింది. ఒకరిపైఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం నిత్యం హాట్ హాట్‌గా తయ్యారయింది. ముఖ్యంగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అటు బహిరంగా సమావేశాల్లో, ఇటు లేఖల ద్వారా పలు విషయాలను సంధిస్తుండడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిపోతున్నది. రాష్ట్రంలోని అధికార పార్టీ కేంద్రంలోని బిజెపిని దుయ్యబడుతుంటే, ఆ పార్టీ రాష్ట్రశాఖ అధికార టిఆర్ఎస్ కేంద్రాన్ని నిలదీస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఏర్పడినతర్వాత విభజన హామీలను తుంగలో తొక్కుతున్నాయంటోంది కాంగ్రెస్. అయితే బహిరంగ సభల్లో తాము మాట్లాడే విషయాలు ఎదుటి పార్టీవారు వినిపించుకుంటున్నారో లేదో అని అనేక ప్రశ్నలతో కూడిన• లేఖాస్త్రాలను సంధించే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల పలు దఫాలుగా రాష్ట్రానికి వొచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇటీవల కాలంలో రెండు సార్లు రాష్ట్రానికి వొచ్చారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని తెరాస శ్రేణులు పలు అంశాలపైన లేఖాస్త్రాలను సంధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోమారు జూలై రెండు, మూడు తేదీల్లో ఆ పార్టీ అధినాయకత్వం అంతా కట్టగట్టుకుని హైదరాబాద్ రాబోతున్నారు. అయితే గతంలో అమిత్‌షా రాక సందర్భంగా రాష్ట్ర మంత్రి కెటిఆర్ లేఖలో సంధించిన ప్రశ్నలే పునరావృతం కానున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి వొస్తున్న సందర్భంగా పలు సార్లు అడుగుతున్న ప్రశ్నలే అయినా ఆ అధినాయకత్వం ఇంతవరకు వాటికి సూటిగా సమాధానం చెప్పిందిలేదు.
భాజపా పాలిత రాష్ట్రాలపట్ల చూపిస్తున్న శ్రద్ధను కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం ఎందుకు చూపించడంలేదని చాలాకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలను ఇక్కడ అభివృద్ధి పర్చే విషయంలో కేంద్రం ఏమాత్రం చొరవ చూపించడంలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఆరోపిస్తూనే ఉంది. భా•పా పాలిత రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనకు వేలాది కోట్ల రూపాయలను కేటాయిస్తున్న ట్లుగా కొత్తగా ఏర్పడిన తెలంగాణరాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న మూసీ నది ప్రక్షాళనకు కోట్లలో నిధులు కేటాయించక పోవడంపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు 24 కోట్ల రూపాయల గ్రాంటు ఇవ్వాలని సాక్షాత్తు నీతి అయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోకపోవడం, తెలంగాణ ఏర్పడినప్పుడు ఇచ్చిన విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి వొస్తున్న పరిశ్రమలకు రాయితీలను కల్పించకపోవడంపైన వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి కెటిఆర్ పలు సందర్భాల్లో వేస్తున్న ప్రశ్నలనే లేఖల ద్వారా నిలదీస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళుగా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావడం పోవడమేగాని విభజన సమయంలో ఇచ్చిన ఒక్క హామీనికూడా నెరవేర్చిందిలేదన్నది టిఆర్ఎస్ ఆరోపణ. ముఖ్యంగా ఏటా రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మాటలు చెప్పి అధికారంలోకి వొచ్చిన బిజెపి ఇప్పటివరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయిందంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ తమ ఆధీనంలో ఉన్న పదహారు లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అంతేకాదు దేశంలోని లక్షలాది మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడంపట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బహిరంగ లేఖ ద్వారా తీవ్రంగా తప్పు పడుతోంది. ఇంకా విద్యాలయాలను నెలకొల్పడంలో, బయ్యారం లాంటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సాఫ్ట్ వేర్ పార్కుల నిర్మాణం తదితర అనేక విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఘాటుగానే లేఖల ద్వారా స్పందిస్తోంది.
దానికి ప్రతిగా బిజెపి రాష్ట్ర నాయకత్వంకూడా ఘాటైన లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సంధిస్తున్నది.. రాష్ట్రంలో ఏర్పడిన పలు సమస్యలపైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలుమార్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు లేఖాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. తాజాగా రైతు బంధు పథకం క్రింద రైతులకు అందాల్సిన సొమ్మును సకాలంలో అందించకపోవడంపై తీవ్రంగా దుయ్యబట్టారు. ఒకపక్క రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తున్న క్రమంలో రైతులు దుక్కి దున్నేందుకు సిద్దంగా ఉంటే వారికి రైతు బంధు అందకపోవడంపై తాజాగా ఒక బహిరంగ లేఖ రాసారు . అంతకు ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కాని పక్షంలో ప్రభుత్వం రెఫరెండంకు సిద్దంకావాలంటూ ఆయన అందులో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంకు చెల్లించాల్సిన 48 వేల కోట్ల రూపాయలను చెల్లించకుండా, రాష్ట్ర ప్రజలపై ఆరు వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపడాన్ని తన లేఖలో తూర్పార పట్టారు.
కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గత నెల నుండి ప్రయోగిస్తున్న లేఖాస్త్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను తీవ్రంగా దుయ్యబట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాలన చాతకాదని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడుతున్న దంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి కెటిఆర్‌కు రాసిన వివిధ లేఖల్లో పేర్కొన్నారు. పబ్, క్లబ్ కల్చర్ రాష్ట్ర, హైదరాబాద్ కల్చర్‌ను దెబ్బతీస్తున్నదని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే, కేంద్రం పనితీరుపై ప్రధాని మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖలద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తెలంగాణ సిఎం పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న కేంద్రం ఆమేరకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నదంటూ, కెసిఆర్‌ను కాపాడుతున్నది మీరుకాదా అంటూ ఆ లేఖల్లో ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్ర, రాష్ట్రాలు అడిన డ్రామాలో రైతులు బలైనారని, వారి మరణాలకు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేయడంతోపాటు కేంద్రం నెరవేర్చని విభజన హామీలన్నిటిని ఆయన తన లేఖలో ఏకరువు పెట్టారు. వీటన్నిటిని ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలా రాజకీయ పార్టీలు ఇటీవల కాలంలో లేఖాస్త్రాలను తమ ప్రత్యర్థి పార్టీలపై సంధించడం ద్వారా తమ పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తున్నదని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి.




