మార్పు అనివార్యమంటున్న ప్రజలు

మోదీ చేతిలో కెసిఆర్‌ ‌రిమోట్‌ : ‌కాంగ్రెస్‌
ఎంఐఎం ‌చేతిలో కారు స్టీరింగ్‌ : ‌బిజెపి
మోదీ అబద్దాల బాద్‌షా : బిఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌తెల్లవారితే ప్రచారానికి బ్రేక్‌ ‌పడనుంది. ఈ నెల మూడవ తేదీన నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుండి 25 రోజులుగా రాష్ట్రంలో హోరాహోరీగా ప్రచార కార్యక్రమం కొనసాగుతున్నది. గుర్తింపు ఉన్న, లేని పార్టీల అభ్యర్ధులతో పాటు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా నిర్వహిస్తున్న ప్రచారాలతో రాష్ట్రం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. మరో రెండు రోజులకు అంటే ఈ నెల 30న ప్రజలు ఇచ్చే తీర్పుపై ఆ పార్టీల భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఏదీ ఏమైనా ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతటా వినిపిస్తున్నది ఒకే మాట. ఈసారి మార్పు అనివార్యమన్నది. ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన సాగటం లేదన్నది అందరినోట వినిపిస్తున్న మాట. లాభలతో ఏర్పడిన తెలంగాణను అప్పులపాలు చేశారన్నదిప్పుడు ప్రజల్లో ప్రబలంగా నాటుకుపోయింది. నీరు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌ను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్న అపవాదు ఉంది. నియామకాల విషయంలో యువకులను దారుణంగా మోసం చేసిందన్న విషయాన్ని విపక్షాలు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగాయి. పోటీ పరీక్షల నిర్వహణలో ఎంత దారుణంగా విఫలమైందన్న విషయం కన్నుల ముందు కనిపిస్తున్న అంశం. అధికార పార్టీ ఎంఎల్‌ఏల ఆస్తులు పెరిగిన విధానం, ఎవరినీ ఖాతరు చేయని వారి తీరు, ఇవన్నీ ప్రజలను కలచివేసిన అంశాలు కావడంతో పాలనలో మార్పు జరుగాలన్న ఒకే మాట రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది.

ఈ అంశాలతో విపక్షాలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. కాగా ఈ ఎన్నికల్లో  ప్రధానంగా మూడు పార్టీలు శక్తిమేర కృషిచేస్తున్నాయి. ప్రజలను ఆకర్షించే పలు పథకాలను తమ మానిఫెస్టోల రూపంలో ఈ పార్టీలు ముందుంచాయి. తమ ప్రభుత్వానిక పట్టం కట్టిన వెంటనే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ సందర్భంగా ఎదుటి పార్టీ మాటలను నమ్మవద్దని మరీమరీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఫలానా పార్టీకి వోట్లు వేయడం ద్వారా ప్రజలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని, ఒకరిని మించి ఒకరు ఎదుటి పార్టీపైన ఆరోపణలు గుప్పించారు. అందుకు రాష్ట్ర నాయకులు సరిపోరన్నట్లుగా కాంగ్రెస్‌, ‌బిజెపిలాంటి జాతీయ పార్టీలు జాతీయ నాయకులను రంగంలోకి దింపాయి. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వాడిని పలుసార్లు తెలంగాణకు రప్పించింది బిజెపి. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పార్టీ ముఖ్య నాయకులను రంగంలోకి దింపింది. కాంగ్రెస్‌ ‌కూడా తామేమీ తీసిపోనట్లుగా సోనియా గాంధీ, రాహుల్‌, ‌ప్రియాంకా గాంధీని ఇంకా రాష్ట్రంలో తిప్పుతూనే ఉంది.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మొదలు కాంగ్రెస్‌ ‌వృద్ధ నాయకులంతా తెలంగాణపై దాడిచేయడానికా అన్నట్లుగానే ఒకరి తర్వాత ఒకరుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలన్నీ ఎదుటి పార్టీపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని మోదీ అంతటి వాడు కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఆసక్తిని కలిగిస్తున్న అంశం. భారాస, కాంగ్రెస్‌ ఒక్కటే నంటాడు మోదీ. ఎన్నికల షెడ్యూల్‌ ‌మొదలు కావడానికి ముందు నుండి ఆదివారం నాటి తెలంగాణ పర్యటన వరకు ఆయన అదే చెబుతున్నాడు. అ రెండు పార్టీలకు ఒకదానితో ఒకదానికి విడదీయరాని బంధం ఉందంటాడాయన. ఇవి ఒకే నాణానికి రెండు ముఖాలలాంటివని, అందుకే హస్తానికి వోటు వేస్తే బిఆర్‌ఎస్‌కు వోటు వేసినట్లేనని పదేపదే చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు కాంగ్రెస్‌లో గెలిచిన ఎంఎల్యేలంతా తిరిగి బిఆర్‌ఎస్‌లో చేరి మంత్రులైపోతారని, గతంలో జరిగిన సన్నివేశాలను ఆయన గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఒక విధంగా ప్రజలను మోసం చేస్తున్నాయి. కెసిఆర్‌ ‌చరిత్ర కాంగ్రెస్‌తోనే మొదలైన విషయాన్ని, కేంద్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌పై తీవ్రాతితీవ్రంగా ఆయనతో పాటు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం విరుచుకుపడుతున్నది. ముఖ్యంగా కారు స్టీరింగ్‌ ఎంఐఎం ‌చేతిలో ఉందంటూ బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్న ఒకే ఒక పార్టీ అయిన ఎంఐఎంపైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నది.

కాగా బిఆర్‌ఎస్‌ ‌రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌మోదీ చేతిలో ఉందంటుంది కాంగ్రెస్‌. అం‌దుకే కెసిఆర్‌ ‌మోదీని పెద్దగా విమర్శించలేక పోతున్నారంటుంది కాంగ్రెస్‌. ‌కెసిఆర్‌ అవినీతి దిల్లీకి పాకింది. మధ్యం కేసులో ఆప్‌ ‌నేతలను వెంటాడి కేసులు పెట్టి, జైల్‌లో పెట్టిన ఈడి కెసిఆర్‌ ‌కూతురును వొదిలివేయడమే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో ప్రచారంలో భాగంగా పేర్కొనడం గమనార్హం. దీన్ని బట్టే మోదీకి కెసిఆర్‌కు చీకటి ఒప్పందాలున్నాయంటాడాయన. బిజెపి కేవలం బిఆర్‌ఎస్‌తోనే కాదు, ఎంఐఎంతో కూడా కలిసింది. ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఒక్కటే. ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగానే తమ పోరాటమంటుంది కాంగ్రెస్‌. ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించినప్పటి నుండీ రాష్ట్రంలో ఐటి, ఈటి దాడులన్నీ కాంగ్రెస్‌ ‌నాయకులపైనే జరగడం కూడా ఈ విషయాన్నే చెబుతున్నదంటుంది కాంగ్రెస్‌. ‌వాస్తవంగా తెలంగాణలో లేని బిజెపి కేవలం బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడానికే వొస్తున్నదిని ఆ పార్టీ ముఖ్యనేత ప్రియాంకగాంధీ ఆరోపిస్తుంది. దిల్లీలో బిజెపికి బిఆర్‌ఎస్‌ ‌మద్దతిస్తుంటే, ఇక్కడ బిజెపి బిఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నదని రాహుల్‌ ‌గాంధీ ఆరోపిస్తున్నారు. అందుకే ఇక్కడ జరిగే అన్యాయాల్లో మోదీ కూడా భాగస్వామేనంటారాయన.

ఇదిలాఉంటే మోదీ, అమిత్‌షాలు ఇద్దరూ అబద్ధాల బాద్‌షా అంటుంది బిఆర్‌ఎస్‌. ‌నూతనంగా ఏర్పడిన తెలంగాణకు న్యాయంగా సంక్రమించాల్సిన నిధులు, ఇతర పథకాల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపించి, తీరా ఎన్నికల సమయంలో పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నదని వారు విమర్శిస్తున్నారు. అమిత్‌షాకు అబద్ధాల షాగా నామకరణం చేయాలని బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేస్తుంది. దేశంలో ఏయిర్‌ ఇం‌డియా లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల్లో గెలువటానికి షుగర్‌ ‌ఫ్యాక్టరీ అని, పసుపు బోర్డు అని ఇలా మాయ మాటలు చెప్పడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. అసలు కేంద్రం ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాల గురించి ఎందుకు చెప్పడంలేదని  ప్రశ్న వేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ ‌విషయానికొస్తే తెలంగాణ ఇవ్వటంలో జాప్యంచేసి వేలాది మందిని పొట్టనపెట్టుకున్న ది కాంగ్రెసేనని బిఆర్‌ఎస్‌ ‌విస్తృత ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్‌ ‌చెబుతున్న మార్పు ఆరునెలలకు ఒకసారి ముఖ్యమంత్రిని మార్చడమేనా అని ప్రశ్నిస్తున్నది. ఎన్‌కౌంటర్‌లతో రాష్ట్రాన్ని వల్లకాడు చేసిన ఇందిరమ్మ పాలనగురించి కాంగ్రెస్‌ ‌మాట్లాడటాన్ని ఘాటుగా విమరిస్తుంది.మాజీ ప్రధాని పిపి నర్సింహారావు పార్థివదేహాన్ని కూడా అవమానపర్చిన కాంగ్రెస్‌కు ఇవ్వాళ ఆయన గుర్తుకు రావటం విచిత్రమంటూ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిఆర్‌ఎస్‌ ‌నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *