బంధాల కోసం తపించే నేటి అనుబంధాలు

మనుషుల మధ్య క్రమంగా మాయమౌతున్న అనుబంధాలు మానవజీవనసంక్షోభానికి దారితీస్తున్నాయి. ఆ సంక్షోభం మనుషులు చేజేతులా తెచ్చుకుంటున్నదే. అనుబంధం నిత్యం పల్లవించే పత్రహరితం. ఇప్పుడు ఆ పత్రహరితాన్ని కోల్పోయి జీవనోధ్యానాలు మోడువారిపోతున్నాయి. వాటిని అవేదనల శిశిరాలే ఆవహించేస్తున్నాయి. అనుబంధాలు పైకి కనిపించే కృత్రిమత్వపు ప్లాస్టిక్‌ పూలైపోతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఒకప్పుడు కళకళలాడిన కుటుంబబంధాలు నేడు పెరిగిపోతున్న జీవనవేగం, ధనదాహం, ప్రపంచీరకణల ప్రభావంతో కునారిల్లుతున్నాయి. మనిషి ఇప్పుడు మండువేసంగి లాంటి సంపాదనలో సతమతమైపోతూ పండువెన్నెల లాంటి అనుబంధానికి దూరమైపోతున్నాడు. ఆ అనుబంధాల అన్వేషణలో, మమకారాల చినుకులు రాలక ఆనందాల హరివిల్లులు కనిపించని కుటుంబాలు మళ్లీ అనుబందాలతో కళకళలాడాలనే తపనతో ఖమ్మంకు చెందిన సాహితీ బృందావన విహార వేదిక ఆధ్వర్యంలో కథలపోటీ నిర్వహించి అందులోనుంచి ఎంచుకున్న 36 కథలతో ఆ వేదిక అధ్యక్షురాలు, వర్తమాన రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల సునీత తన సంపాదకత్వంలో వెలువరించిన కథల సంపుటి ‘నేటి అనుబంధాలు’.

‘సమాజం సాంకేతిక అభివృద్ధి సొగసులు అందుకొని ముందుకు ప్రయాణిస్తోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ సాంకేతిక మాయలో పడి మానవ సంబంధాలను దూరం చేసుకుంటున్నాడు.. ఇందులోని ఒక కథలో సాగే ఈ వాక్యాల సారాంశమే రెండు రాష్ట్రాలకు చెందిన రచయితల ఈ కథలకన్నిటికీ కేంద్రబిందువు. మనుషులు కోల్పోతున్న తమ వూరి మమకారాన్నీ, ఆ వూరి మట్టిపరిమళాన్నీ ఆక్కడ వీచే అయినవాళ్ల ఆత్మీయతాసమీరాల్ని ఈ కథలు స్పృశించాయి. పలు కథలు బాల్యజ్ఞాపకాల్ని మన మనసుల్లో నింపుతాయి. కన్నవారి మమకారపు నోస్టాల్జియాలోకి మనల్ని పంపుతాయి. విదేశాల్లో స్థిరపడిపోయిన పిల్లల ఆత్మీయతల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదనలోని వివిధ పార్శ్వాలను ఈ కథలు చిత్రించాయి. వారి ఎదురుచూపుల్లోని ఎన్నో ప్రశ్నలను మనముందు నిలిపి మనల్ని ఆలోచనలకు గురిచేస్తాయి.

కన్నప్రేమ బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తే అనుబందాల పరిమళాలద్దే పెంచిన ప్రేమ, తన మనవడు ప్రమాదంలో చనిపోయాడని తెలియని బామ్మ అతనిపట్ల వల్లమాలిన ప్రేమతో ఉత్తరాలు రాస్తూనే వుంటే అతని మరణవార్త తెలిసినా కూడా ఆమెకు చెప్పకుండా ఆ ఉత్తరాల్ని పోస్టు చేసే పోస్టుమన్‌ ఔదార్యం, ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు పరితపించే ముందుతరంవారి ప్రేమదాహంతో పోల్చలేని నేటితరం ధనదాహం, తన పెంపకంలో కుమార్తెపై తాను చూపిన నిర్లక్ష్యమే ఆ తరువాత తాను గారాబంగా పెంచిన కొడుకులో చూసి పశ్చాత్తాపపడే తండ్రికి కుమార్తె అందించే అనుబంధపు మాధుర్యం, కష్టపడి కొడుకుల్ని చదివించి విదేశాలకు పంపిస్తే ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందే తన బార్యను చూడడానికి రాని వారి నిర్లక్ష్యానికి గుణపాఠంగా తన ఆస్తిని గ్రంథాలయానికి, వ్యవసాయక్షేత్రానికి కేటాయిస్తూ వీలునామా రాసిన తండ్రి సమయస్ఫూర్తి… ఇవన్నీ ఈ కథలకు వస్తువులయ్యాయి. ‘ప్రకృతి ఒడిలో మానసికప్రశాంతత వుందనేరోజు, ఆధునిక మనిషి అర్థం చేసుకునేరోజు వస్తుందని నా మనసు చెబుతుంది. పల్లెప్రశాంతత కోసం పరితపించే రోజులు వస్తాయి. బంధాలు అనుబంధాలు మాత్రమే శాశ్వతమని, మనిషి తన గురించి తనే మరచిపోయి పరుగులు తీసి సంపాదించిన భౌతిక ఆస్తులు అశాశ్వతమని గుర్తిస్తాడు’ అనే కొండంత ఆశతో ఈ కథలన్నీ సాగుతాయి.

నేడు అనుబంధాలు సాంకేతికరంగును పులుముకొని కుటుంబసభ్యుల మధ్య ఏవిధంగా, ఎంత కృత్రిమంగా చోటుచేసుకుంటున్నాయో ఒక కథలోని సన్నివేశం ఇలా చెబుతుంది… ‘సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చేస్తోంది. పిల్లలు వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు మాష్టారు, సావిత్రమ్మలు. ఇంతలో పెద్దోడు నుంచి ఫోన్‌ వచ్చింది. నాన్నగారూ కొత్త ప్రాజెక్టులో బిజీగా వున్నాను. సంక్రాంతికి రావడం లేదు. ఆ రోజు జూమ్‌ మీటింగు ఏర్పాటు చేస్తాను. కొంతసేపు సరదాగా గడుపుదాం. సరేనాన్నా అంటూ మాష్టారు ఫోన్‌ పెట్టేశారు. కొంతసేపటి తరువాత చిన్నోడు పోన్‌ చేసి నాన్నగారూ నాకు వీలు కుదరడం లేదు. స్కైప్‌ యాప్‌ లో ఆ రోజు కొంతసమయం గడుపుదామని చెప్పాడు. సరే అంటూ ఫోన్‌ పెట్టేసాడు.

పాప గూగుల్‌ మీటింగ్‌ లో కలుద్దామని చెప్పింది. ఏమన్నారండీ పిల్లలు అని అడుగుతేంది సావిత్రమ్మ. జూమ్‌ గుగుల్‌ మీటింగ్‌, స్కైప్‌ యాప్‌ లలో కొంతసేపు గడుపుదామని చెబుతున్నారు. సాంకేతికతను వినియో గించమని చెప్తున్నారు ఇంజ నీర్లు కదా. సావిత్రమ్మ మౌనంగా వుండిపో యింది’…. ఈ సన్నివేశం అనేక కుటుంబాల్లో మమకారరాహిత్యంతో, స్మశాన వైరాగ్యంతో గడిపే ముసలి తల్లిదండ్రుల జీవనస్థితికి సాక్షీభూతం గా నిలుస్తుంది. ఈ కథలు మనిషితనాన్ని కోల్పోతున్న మనిషికి పలు హెచ్చరికలు చేస్తాయి. రక్తసంబం ధాల్లోని రమ్యతను తెలియజేస్తాయి. మనుషుల మధ్య ఆత్మీయతావారథులు నిర్మించుకోవాలని హితబోధ చేస్తాయి. మన మట్టివాసనను మనకు గుర్తుచేస్తా యి. కొత్తరచయతల్ని ప్రొత్సహించే దిశగా సాహితీబృందావన విహార వేదిక ఈ కథాసంపుటిని తీసుకురావడం అభినందనీయం.
-డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర
(సెల్‌: 9177732414 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *