- రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పోస్టర్ విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధనకు బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త ఫీజుల బకాయి-బీజేపీ లడాయికి నాంది పలుకుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు గురువారం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను చైతన్యపరుస్తూ వివిధ దశల్లో ఉద్యమ కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, దక్షిణ భారత దేశంలోనే అత్యధికంగా 6.8 శాతం నిరుద్యోగిత రేటు నమోదవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా నేటి వరకు ఉద్యోగాలు లేవు.. జాబ్ క్యాలెండర్ లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, అందుకే విద్యార్థుల న్యాయమైన హక్కు కోసం భారతీయ జనతా యువమోర్చా ఈ అంశాన్ని ఉద్యమంగా చేపట్టిందని ఆయన అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా విడుదల చేసే వరకు పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఉద్యమాన్ని యువమోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, చీవాట్లు పెట్టినా సర్కారు స్పందించలేదని విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే విద్యార్థులందరూ శాంతియుతంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు, యువతకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల స్థాపన వంటి ఇతర హామీలను కూడా అమలు చేయాల్సిందేనని రామచందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరే వరకు బీజేపీ, యువమోర్చా ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాయన్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులందరూ ఒక్కటిగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతం రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే, తదితరులు పాల్గొన్నారు.



