బిఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు
కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల దోపిడీ
ఆదాయం ఉన్న శాఖలన్నీ కెసిఆర్ కుటుంబం చేతిలోనే
అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలపై సంతకం
ఆందోల్ విజయ భేరి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఆందోల్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ దోచుకున్న డబ్బులను వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం ఆందోల్‌లో కాంగ్రెస్ విజయభేరి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…బిఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రానికి చెందిన ఆదాయన్నంతటినీ కెసిఆర్ కుటుంబం దోచుకుంటుందని, తాము అధికారంలోకి రాగానే వారు దోచుకున్న డబ్బులను వసూలు చేసి ప్రజల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పోటీ దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్ మధ్యనే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌ని కూడా కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసిందన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ చేసిన సొమ్మంతా కక్కిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూమిలో కుంగిపోతుందని, ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీ చేశారని రాహుల్ ఆరోపించారు. ఇసుక, మద్యంతో పాటు ఆర్థిక వనరులకు సంబంధించిన శాఖలకు చెందిన వ్యాపారాలన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. వాళ్ల చేతిలో ఉన్న ధరణి ద్వారా పేదల నుంచి 20 లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారని మండిపడ్డారు.
విద్యార్థులు కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్ లీక్‌లతో వారి శ్రమ వృథా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు స్కీమ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొకరి దగ్గర మూడు లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. తమది దళిత, ఆదివాసి, పీడిత పాలిట సర్కార్ అని, కెసిఆర్‌ది దొరల సర్కార్ అయ్యిందని, ప్రజల సర్కార్ అంటే ఎలా ఉంటుందో తాము చూపెడతామని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ సమావేశంలోనే తాము ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిన ఆరు అంశాలపై మొదటి సంతకం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్‌తో పాటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, ఎవరికైతే ఇళ్లు లేవో వారికి 5 లక్షల రూపాయలు, ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రతి మండలంలో ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను కాంగ్రెస్ తొక్కి పడేసిందని అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడమే ధ్యేయంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టిందని, బీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులను మోదీ ప్రభుత్వం చేయట్లేదని, మోదీ పూర్తి మద్దతు కేసీఆర్‌కు ఉందని అన్నారు. లోక్‌సభలో మోదీకి కేసీఆర్ మద్దతు ఉందని, ఇక్కడ కేసీఆర్‌కు మోదీ మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రాజనర్సింహను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.




