మత విశ్వాసాలను గౌరవించడం అందరి విధి. ఎవరి మత విశ్వాసాలు వారివి. వాటిని గౌరవిస్తూనే సమాజం లో ముందుకు సాగాలి. పరమత సహనం అన్నది మన విధానం. భారతదేశం లౌకిక విధానలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఎవరి మతాలను కించపర్చడం లేదా చులకన చేయడం సరికాదు. మంచీచెడులను వివేచించడం మనపనికాదని గుర్తుంచుకోవాలి. విద్వేష భావనలు సామరస్యపూర్వక సాంఘిక జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తాయని గుర్తించాలి. ఎవరు ఏ మాతాన్ని రుద్దడం లేదా, మార్చడం నేరంగా పరిగణించాలి. అలాగే మత విశ్వాసాల జోలికి పోకుండా చూడాలి. ప్రజాస్వామిక లౌకిక విలువలకు భారతీయ జనతా పార్టీలోని ఒకరిద్దరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల మొత్తం సమాజమే తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఎదుటి వారు అలాంటి పనిచేస్తే విమర్శించాలే తప్ప మనమే అలాంటి పనులకు దిగడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. కొందరు నేతలు తూలిన మాటలపై సంజాయి షీ ఇచ్చుకోవాల్సి రాకూడదు. ప్రస్తుత భారతదేశం బహుమతాలతో పెనవేసుకుని ఉంది. బహుభాషలు మాట్లాడే ప్రజలు కలసి జీవిస్తున్నారు. సాంస్క•తిక భిన్నత్వాలను కలిగిన భారతీయ సమాజ బలిమిగా ఉందంటే కారణం అది దేశమంతా ఒక్కటే అన్న భావన మాత్రమే. ఈ ప్రజాస్వామిక లౌకిక విలువలకు ఎవరు కూడా ఆటంకం కలిగించినా అది తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. తూలిన మాటలను వెనక్కి తీసుకోలేమని గుర్తించాలి. వేషభాషలు, వ్యక్తిగత విశ్వాసాలు,ఆహారపు అలవాట్లను ప్రజల వ్యక్తిగత స్వేఛ్చకు వదిలేయాలి.
సామరస్యపూర్వక సాంఘిక జీవనాన్ని కొనసాగించేలా చూడాలి. వేల ఏళ్లుగా భారత్‌లో దాడుల కారణంగా హిందూమతం విచ్చిన్నం చేసే ప్రయత్నం చేశారు. అలాగే మతమార్పిడు లతో దాడులు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లుగా విడివడ్డ తరవాత కూడా హిందువులను ఊచకోతకు గురి చేశారు. ఇప్పటికీ దాడులుచేస్తూనే ఉన్నారు. మొన్నటికిమొన్న దీపావళికి ముందు బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతను చూశాం. కాశ్మీర్లో టెర్రరిస్టుల ముసుగులో మతాంతీకరణకు జరిగిన దురాగతాలను కళ్లారా చూశాం. వీటిపై ఆనాడు మిన్నకున్నా ఇప్పుడు యుద్దం చేయాలి. అలాంటి సందర్భం వదిలి తాజాగా మహ్మద్ ప్రవక్త, ఇస్లామ్‌పై బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఓ రకంగా వారి సంకుచిత భావాలను వెల్లడించేలా ఉన్నాయి. ఇలాంటి వారివల్ల దేశానికి తలవంపులు తెచ్చిపెట్టరాదు. తాలిబన్ల లాగా మనం కూడా విచ్చలవిడిగా ఉంటే మన ఔన్నత్యం దెబ్బతింటుంది. మనం అందుకు భిన్నమని వేల ఏళ్లుగా రుజువు చేస్తూ వచ్చాము. మనపై మతదాడులు జరిగినా సంయమనం పాటించడం వల్లనే భారతదేశ ఔన్నత్యం ప్రపంచానికి తెలిసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్‌లో పర్యటిస్తున్న కీలక సమయంలో ఈ వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం సరైనదేనా అన్నది ఆలోచించాలి. వ్యూహాత్మక భాగస్వామ్య పక్షాలైన గల్ఫ్ రాజ్యాలతో భారతదేశ బాంధవ్యాలు మోదీ హయాములో ఇంకా బలపడ్డాయి. సంకుచిత ప్రయోజనాలకోసం కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండరాదు. ప్రజాస్వామ్య దేశంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియా కీలకపాత్ర పోషించా ల్సి ఉంది.
మతపరమైన హింసోన్మాదంపై పోరాడుతున్న మనం అలాంటి చర్యలకు ఒడిగట్టరాదు. భిన్నత్వంలో ఏకత్వమే సహజాభరణమైన భారతావనికి బలంగా నిలిచాయి. అవే మనకు ఆయువుగా ఉన్నాయి. తాజా వివాదం వివిధ రంగాలపై తక్షణ ప్రభావం చూపగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముస్లిం మత విశ్వాసాలు ప్రబలంగా ఉండే పశ్చిమాసియా దేశాలు భారతీయ ఉత్పత్తులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. మన దేశం నుంచి వెళ్లే కార్మికులకు వీసాల జారీని నియంత్రించడానికి ప్రయత్ని ంచవచ్చు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ల నుంచి మన దేశానికి వస్తాయని ఆశిస్తున్న పెట్టుబడుల్లో ఆలస్యం జరగవచ్చు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టడంలో, ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందకుండా నిరోధించడంలో పలు గల్ఫ్ దేశాలు భారత్‌కు సహకరిస్తూ వస్తున్నాయి. మరికొన్ని తటస్థ వైఖరిని కనబరుస్తున్నాయి. కొందరు బిజెపి నేతల తాజా వ్యాఖ్యలతో ఏర్పడిన ప్రతికూల వాతావరణాన్ని ఎంత త్వరగా చక్కదిద్దితే మనదేశానికి అంత మంచిది. పాలకులు ఈ పరిణామంతో ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. పార్టీ పెద్దలకు ఉన్న ఈ నైపుణ్యం నూపుర్, జిందాల్ వంటివారికి ఉండదు కనుక వారు రెచ్చిపోయి, దేశాన్ని ప్రమాదంలో పడేశారు. వీరిద్దరి మాటలు దేశానికి ఆర్థికంగా ఎంత నష్టంచేయబోతున్నాయో రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా తెలుస్తుంది. అమృతోత్సవ భారతం ఎంతో కష్టపడి నిర్మించుకున్న బంధాన్ని ఎంతో సులువుగా కూల్చి వేశారు. పాకిస్థాన్ కు ఎక్కడలేని శక్తీ ఇప్పుడు వచ్చింది. ఇంతకాలం దాని చేతికి చిక్కని మత ఆయుధాన్ని ఇప్పుడు నేరుగా అందించింది మనమే.
నిప్పుచల్లారకుండా అది తనవంతుగా ఎగవేస్తూనే ఉంటుంది. బీజేపీ ప్రతినిధి తన సుదీర్ఘ ప్రకటనలో అవవసరార్థం అన్నమాటల్లో కొన్నింటినైనా ఆచరణలో చూపకపోతే ఈ అగ్గి చల్లారే అవకాశం లేదు. ఇలాంటి వ్యాఖ్యలుచేసేముందు మనం ఎంత నిగ్రహంగా ఉండాలో ఆలోచించాల్సి ఉంది. మనం ఒక్కరమే ఈ భ్మూద జీవింజడం లేదు. ఎందరో మనతోపాటు ఉంటున్నారు. మనమంతా కలసి బతకాల్సిఉంది. ఇవన్నీగమనించిమన ప్రవర్తన ఉండాలి. మన మాటలు ఉండాలి. బిజెపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ముస్లిం దేశాలు విరుచుకుపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన పలు దేశాలు.. బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలిపాయి. సౌదీ సహా పలు అరబ్ దేశాలు చేస్తోన్న వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. మతపరమైన వ్యక్తిత్వాన్ని కించపరిచే అభ్యంతరకర ట్వీట్లు, వ్యాఖ్యలు కొంత మంది మాత్రమే చేస్తారు. అవి ఏవిధంగానూ భారత ప్రభుత్వ అభిప్రాయాలు కావు. మొత్తంగా ఇప్పుడు ఇతరులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండడం అలవర్చుకోవడం మంచిది. అది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.మనమంతా ఒక్కటే అని చాటాల్సిఉంది. మతాలతో ప్రజలను విడదీసే సంకుచిత స్వాభావాన్ని వదిలితేనే మంచిది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్




