బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు
మంగళవారం జరుగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామరావు వివిధ అంశాల పైన మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరఫున కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కొరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడిన తీరుపైన కేటీఆర్ అభినందనలు తెలిపారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వొస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





