కృత్రిమ మేధతో ఫోటోగ్రాఫర్లకు మరింత బాధ్యత
నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, ఇందుకు మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే కళాత్మకత, క్షణాల్లో ఆలోచించే నైపుణ్యంతో కెమెరాలో బంధించే చిత్రం చిరస్థాయిగా మిగులుతాయని అన్నారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ (World Photography Day) సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన 23వ రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్, ఫోటో ఎగ్జిబిషన్ ను మంగళవారం బషీర్ బాగ్ లోని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) కార్యాలయ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు.
ఈ ఫోటో కాంటెస్ట్ లో ప్రతిభ కనబరిచిన ఫోటో గ్రాఫర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ తాను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో, బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో చేసిన పోరాటాలకు సంబందించిన చిత్రాలను చూస్తున్నప్పుడు గతాన్ని గుర్తు చేస్తుంటాయని, అవే మన జ్ఞాపకాలని అన్నారు. ఫోటోగ్రఫి అభిరుచి అందరికీ రాదని, మంచి నైపుణ్యం ఉండాలన్నారు. 1995 నుండి 30 సంవత్సరాలుగా ఉన్న తాను ఉద్యమంలో పాల్గొన్న చిత్రాలను ఫైల్ చేసుకుని ఆ స్మృతులను సమీకరించుకుంటానని తెలిపారు. ఫోటో గ్రాఫర్ ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సానుకూలంగా ఉన్నారని, సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతామన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కృతిమ మేధస్సు రాకతో ఫొటో గ్రాఫర్లకు మరింత భాద్యత పెరిగిందని, తమ నైపుణ్యాన్ని మరింత మెరుగు పర్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి, రామ్మూర్తి, వసంత్, జాన్, మోహన్, సుమన్, జేమ్స్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, అనిల్, తదితరులతో పాటు పలువురు సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.





