“ఈ ఎపిసోడ్ నిర్థారణ చేసింది ఏమంటే ప్రధాన మీడియా సంస్థలు,అధికారపక్షం మధ్య ఎంత బలమైన అనుబంధం ,అక్రమ బంధం కొనసాగుతుంది.పరస్పర ప్రయోజనాల కోసం వారేమి చేస్తున్నారనే విషయం ప్రజల ముందు బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు.తాము, మంత్రివర్గం సుద్దపూసలమే,పైగా మేము ఏ మెరుగని లేగదూడలం, ,మీడియానే ఆంబోతులు మధ్యలో మమ్మల్ని బలి పశువులు చేయోద్దు అనడంలోనే ఆయన బలహీనత కనపడుతుంది, మీడియా పట్ల ఉన్న అయన భయం బహిర్గతం అవుతుంది.ఆయన మాటల్లోనే దాటవేత,సాచివేత కూడా దాచినా దాగని సత్యంగా బహిర్గతం అయ్యింది.”

అసలు కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుంది?మంత్రులే దండుపాళ్యం ముఠాల్లాగా దండుకుంటున్నారా? అధికారానికి చాలాకాలంగా దూరంగా ఉండడం వలన వచ్చిన అవకాశాన్ని ఆబగా వినియోగించుకుంటున్నారా? అసలేం జరుగుతోంది.తెలంగాణాలో ప్రధానమైన రెండు మీడియా సంస్థలు అధికారపార్టీకి ,అందునా కీలక కాంగ్రెస్ నేతలకు సన్నిహితంగా ఉన్న సంస్థలు పరస్పర విరుద్ధంగా చేసిన రెండు కధనాల పై వచ్చిన వార్తలు వాటినే బలపరుస్తున్నాయి. గడచిన రెండేళ్ళుగా మంత్రులపై కమీషన్లు విచ్చలవిడిగా దండుకుంటున్నారని, ఇసుక దోపిడీలు,భూముల కబ్జాలు,చేస్తున్నారని ప్రత్యక్షంగానో,పరోక్షంగా నో మంత్రుల పై ఆరోపణలు మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.ప్రతిపక్షాలైన బి ఆర్ఎస్ , బిజెపి కూడా అదేపనిగా అధికారపక్షం పై అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.అట్లాంటి సందర్భాల్లో అధికారపక్షం పై ప్రతిపక్షాలు విమర్శలు సహజమే కదా! అని ప్రజలు అనుకున్నా అనుకోవచ్చును.కానీ, ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ ‘కొత్తపలుకు’ తో కాంగ్రెస్ లోగుట్టు బద్దలైంది.నిప్పులేనిదే పొగ రాదు కదా!చానలైనా,పత్రికైనా కనీస ఆధారాలు లేకుండా కధనం రాసే అవకాశం లేదు.
”బొగ్గు కోసం నీచకధనం”పేరుతో ఆంధ్రజ్యోతి యండి వేమూరి రాధాకృష్ణ తన కధనం లో నైనీ బొగ్గు గనుల వ్యవహారం లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రుల మధ్య ఈ టెండర్లలో జరిగిన పోటీని బహిర్గతం చేశారు.కథనం ఆసాంతం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,యన్ టీవి ఛానల్ యజమాని నరేంద్ర చౌదరి మధ్య ఉన్న బలమైన అనుబంధంను బహిర్గతం చేశారు.ఈ కథనం వెలుగు చూడకపోతే మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేసిన ఆరోపణలు వెనుక ఎవరున్నారు? ముఖ్యమంత్రి ఉన్నాడనే అనుమానాలు బలపడేవి.కానీ రాధాకృష్ణ కథనం పరోక్షంగా ముఖ్యమంత్రి ని ఆ ఊబి నుండి బయటపడేసి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను రచ్చకీడ్చింది.నైనీ బొగ్గు గనుల టెండర్ వివాదంలో అవినీతి గురించి, జోక్యం గురించి ఇక మరోరకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు.ఎందుకంటే, వార్త వచ్చిన మరుక్షణమే నైనీ బొగ్గు గనుల టెండర్ రద్దు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించి వెనక్కి తగ్గారు.దానివల్ల ,పత్రిక కధనం పూర్తి తప్పు అని కూడా నిర్ధారించలేము.
ఇదే సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క తనమీద ఆరోపణలకు సమాధానం చెప్పే సందర్భంలో దీని వెనుక ఆయనకు ఇష్టమైన మనుష్యులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు నన్న మాట ఆయన పరోక్షంగా ఎవరిమీద మాట్లాడింది ప్రజలకు అర్థం కాని విషయం కానేకాదు. గనుల సందర్శనా ధృవీకరణ పత్రం నిబంధన తనకు తెలియదని భట్టి విక్రమార్క అనడం ఆయన లోపాన్ని ఆయనే బహిర్గతం చేసుకున్నట్లు అయ్యింది.అంత పెద్ద కోట్లు రూపాయలు టెండర్లలో నిబంధన తనకు తెలియదనే అమాయకత్వం వెనుక నిజం గా అసమర్థత దాగి ఉందా?.లేదా మరో వ్యంగ్య అర్థం లోనైనా ఆ మాట వాడి ఉండాలి,ఎలా వాడినా,ఎటుచూసినా భట్టి ఈ వ్యవహారంలో గట్టిగా ఇరుక్కుపోయినట్లే కనిపిస్తుంది.
ప్రతిపక్ష శాసనసభా పక్ష ఉపనేత టి.హరీష్ రావు మరో ఆరోపణచేశారు.ఈసైట్ విజిట్ అనే నిబంధన కోల్ ఇండియాలో ఎక్కడా లేదని, సింగరేణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే ప్రవేశపెట్టారని ఆరోపించారు.అంతేకాదు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలు ద్వారా మైనస్ 7 శాతం కు కేటాయించిన టెండర్లు ప్లస్ 7 శాతానికి తమకు కమీషన్లు ఇచ్చిన వారికి కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని హరీష్ రావు ఆరోపించారు.అంతేకాదు, నిబంధన ద్వారా సింగరేణి టెండర్ దక్కించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కంపెనీ శోధన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందని,అసలు ఈ కుంభకోణం ఆద్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనని ఆయన ఆరోపించారు.ఈ నిబంధన ప్రకారం ఇప్పటికే సింగరేణిలో ఖరారైన టెండర్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తాజాగా బయటకొచ్చిన ఈ వ్యవహారంలో ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తోపాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య సింగరేణి టెండర్లు వ్యవహారం ముదిరి రచ్చకెక్కిందనే భావన వ్యక్తం అవుతోంది.
ఇకపోతే , పత్రిక కధనం మోత్తం ఓకే సీక్వెన్స్ లో నడుపు కొచ్చిన రాధాకృష్ణ ఎన్ టీవి కథనం పై సిట్ దర్యాప్తు రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా అధికారులే వేసుకున్నారనే వ్యాఖ్యానంతో కధనం ఉద్దేశ్యం ఏమిటో చెప్పకనే చెప్పుకున్నట్లు అయ్యింది.ఇంతకీ ఈ ఎపిసోడ్ నిర్థారణ చేసింది ఏమంటే ప్రధాన మీడియా సంస్థలు,అధికారపక్షం మధ్య ఎంత బలమైన అనుబంధం ,అక్రమ బంధం కొనసాగుతుంది.పరస్పర ప్రయోజనాల కోసం వారేమి చేస్తున్నారనే విషయం ప్రజల ముందు బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు.తాము, మంత్రివర్గం సుద్దపూసలమే,పైగా మేము ఏ మెరుగని లేగదూడలం, ,మీడియానే ఆంబోతులు మధ్యలో మమ్మల్ని బలి పశువులు చేయోద్దు అనడంలోనే ఆయన బలహీనత కనపడుతుంది, మీడియా పట్ల ఉన్న అయన భయం బహిర్గతం అవుతుంది.ఆయన మాటల్లోనే దాటవేత,సాచివేత కూడా దాచినా దాగని సత్యంగా బహిర్గతం అయ్యింది.
గడచిన రెండేళ్ళుగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోపణలేని మంత్రుల సంఖ్య చాలా తక్కువ.అయితే బలహీన వర్గాల నుండి వచ్చిన మంత్రుల పై ఆరోపణలు మాత్రమే రచ్చకెక్కుతున్నాయి.అది మంత్రి సీతక్క పీఏ పై వచ్చిన ఇసుక ఆరోపణలు కానివ్వండి.నల్గొండ జిల్లా లో మంత్రి కొండా సురేఖ కూతురు పిఏ వసూళ్ళు ఆరోపణలు,పిస్టల్ దందా గురించి కానివ్వండి.గతంలో కాంట్రాక్టర్లు ఆందోళన నుండి నేటి నైనీ వ్యవహారం వరకు మల్లు భట్టి విక్రమార్క మీద వచ్చిన ఆరోపణలు కానివ్వండి.కరీంనగర్ పొన్నం ప్రభాకర్,మరో మంత్రి మధ్య నెలకొన్న వివాదం కానివ్వండి బాధిత మంత్రులంతా బలహీన వర్గాల వారే కావడం విశేషం. ఇకపోతే, ముఖ్యమంత్రి ఆయన అనుచరులు,ఆయన కుటుంబం ,రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కొడుకు , జూపల్లి కృష్ణారావు తదితరుల మీద ఇలా అనేక ఆరోపణలు వచ్చినా ఓ ఐ ఏ ఎస్ నో ,మరో అధికారినో,బలిపశువును చేసి సర్దుబాటు, దిద్దుబాటు చేసుకున్న లౌక్యం కనపడుతుంది .ఏది ఎలా ఉన్నా,ఇంత జరుగుతున్నా,చీటికి మాటికి చిన్న విషయంలో పట్టింపులు పట్టుకునే కాంగ్రెస్ అధిష్టానం నిష్క్రియాత్మక వైఖరి అంతు పట్టనిదిగా తయారైంది.
అన్నింటికి మించి కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ కూర్పు లోనే తప్పులో కాలేసింది.మెజార్టీ మంత్రులు క్యాబినెట్ మంత్రిగా సైతం గతంలో అనుభవం లేనివారే!తుమ్మల,జూపల్లి,శ్రీ
ఏది ఎలావున్నా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి మించి మంత్రివర్గం పరస్పరం రచ్చ కాంగ్రెస్ ప్రతిష్ట నిలువునా దిగజార్చుతుంది.శల్య సారథ్యం అనేది కాంగ్రెస్ కు కొత్తకాదు.దూరపు పదం కానీ, పరిచయం లేని పదం కూడా కాదు? ఒకవేళ నాలుగు రోజులు ముఖ్యమంత్రి దూరంగా ఉన్నా వ్యవహారం అంత తేలిగ్గా సర్థుమనిగేదికాదు.”కరవమంటే కప్పకు కోపం,విడవమంటే పాముకు కోపం “అన్న సామెత రాజకీయాల్లో పనికిరాదు.ఇట్లాంటి సందర్భం లోనే రాజకీయ చాణక్యం లోని గొప్పతనం బయటపడేది.నిర్దిష్టంగా ఏదో ఒక నిర్ణయం ఈ విషయం లో తీసుకోవడం తప్పనిసరి.సింగరేణి నైనీ బొగ్గు టెండర్లు రద్దు చేసి మళ్ళీ నిర్వహించడం పరిష్కారం కాదు.అసలు తప్పు ఎక్కడ జరిగింది , ఇప్పటికే ఖాయం చేసిన టెండర్లు కూడా రద్దుచేసి సమగ్ర విచారణ జరిపి నిర్దిష్టంగా చర్యలు తీసుకోవడం అవసరం.మిగిలింది ముచ్చటగా మూడేళ్ళకాలం.ఇప్పటికైనా ముఖ్యమంత్రి, అధిష్టానం కళ్ళు తెరిచి సరిదిద్దుకొనకపోతే తెలంగాణా లో కాంగ్రెస్ కు జరిగే నష్టం స్వయం కృత అపరాధం,అదే అధికారానికి కూడా ఆత్మహత్యా సాదృశ్యం కానుంది!?.





