- ధరలు దిగి రావడం లేదు…
- రూపాయి అందకుండా పోతోంది!
- మోదీ కారణంగా ఇక్కట్ల పాలవుతున్న సామాన్యులు
- దెబ్బతింటున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు
ప్రధాని మోదీ పాలనలో దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్నపూర్ణగా ఉన్న భారత్‌లో అన్ని రకాల పంటలు పండుతున్నా ప్రస్తుతం సామాన్యులకు మాత్రం సరుకులు అందడం లేదు. ధరలు దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిరుపేదలు పడుతున్న కష్టాలకు ఇంకా కాలం చెల్లడం లేదు. ఓ పక్క విపక్షాలు ప్రధాని మోదీ తప్పులను ఏలెత్తి చూపుతున్నా.. ఆయన తన పద్ధతిని మార్చుకోవడం లేదు.. పైగా ఒక నియంతలా తన మాటే చెల్లాలని తన పాతధోరణిలో…మూస ధోరణిలో ముందుకు సాగుతున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ కారణంగా మోదీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేక పోతున్నారు. విపక్షాలు విమర్శిస్తున్నా ఏమాత్రం ఖాతారు చేయడంలేదు. తాజాగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుడి నడ్డి విరిగింది. పెరిగిన ధరలను చూసి ప్రజలు విలవిల్లాడిపో తున్నారు. కేవలం ఒక్క రోజులోనే లీటర్‌కు 15 నుంచి 25 రూపాయలు పెరగడం గమనార్హం. ఇక ఉల్లిపాయలు కిలో 65 రూపాయలకు చేరింది. పప్పుల ధరలు మాత్రం చెప్పనక్కరలేదు. ధరలు దిగి రావడం లేదు. రూపాయి అందకుండా పోతోంది. గతంలో పైసకు ఉన్న విలువ నేటి రూపాయికి లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు…రోజురోజుకు ధరలు విలయ తాండవం చేస్తున్నాయి. ఉద్యోగ ఉపాధి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

వడ్డించే వాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటి? అన్న సామెత ఇప్పుడు మన దేశ కుబేరుల్లో ముందు వరసలో ఉన్న ఆదానీకి బాగా సరిపోతుంది. ఎందుకంటే ఆయన చేసే వ్యాపారం కన్నా.. పొందుతున్న సహకారం వల్లనే ఈ స్థాయికి చేరారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సామాన్యులు సమస్యల్లో చిక్కుకుని ఏడుస్తుంటే.. ఆదానీ, అంబానీ లాంటి వారు మాత్రం ఆస్తుల్లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరిపోతున్నారు. వారి ఆస్తులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను వారికి అప్పగించే పని ఆగడం లేదు. ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ సంపదలో మరో మెట్టు ఎక్కడంలో ఆయన వెనక ఎవరున్నారు..ఎవరు సహకారం అందిస్తున్నారో దేశంలోని సామాన్యులకు కూడా తెలుసు.
సంపదను దేశ అభివృద్దికి వినియోగించి ఉంటే ప్రజలకు ఉచితాలు పంచాల్సిన అవసరంలేదు. అలాగే కార్పోరేట్లకు ఇచ్చే రాయితీలు అడ్డుకుంటే ధరలతో ప్రజలు భారం మోయాల్సిన అవసరం రాదు. ఉచితాలు అనుచితాలు, సంస్కరణలు, నూతన విధానాలతో నిమిత్తం లేకుండా పాలన సాగిస్తే భారత ఆర్థిక వ్యవస్థ బలపడేది. పెద్ద మొత్తాలను ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం అప్పనంగా కార్పొరేట్ల కు అప్పగిస్తోంది. ఆ మొత్తం ఖజానాకు చేరివుంటే ప్రజల సంక్షేమానికి లేదా పెట్టుబడుల ద్వారా దేశ సంపదల వృద్ధికి తోడ్పడేది. తమ ప్రభుత్వం వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఇస్తున్న ప్రోత్సాహం అని గొప్పలు చెప్పుకొనేందుకు, ఇంతేసి మొత్తాలను ఇస్తున్నాం రండి అని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ప్రకటనలు చేసుకుంది. కొందరి సంపద పెరిగితే ఏడుపు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. సంపాదించటం చేతకాక అంటారు మరికొందరు. అయితే దేశంలో పేదల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. కొనుగోలు శక్తి నశిస్తోంది. ధరల పెరుగుదలకు దారి తీసిన కారణాల్లో ప్రధానమైనదిగా చమురుపై సెస్‌ల పెంపుదల ఒకటి. జనానికి ఉపశమనం కలిగించటం కంటే జిఎస్టీల పేరుతో దండుకోవడం ఎంతవరకు సబబు. ప్రజాస్వామ్యం లో పాలకుల అవినీతి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఎండగట్టాల్సిందే. లేకుంటే దేశ ప్రజలు మూల్యం చెల్లంచించుకోక తప్పదు.

బిజెపి నేతలు కూడా మోదీ భజనలో మునిగి పోయారు. సమస్యలు తెలుసుకోవడం… తెలుసుకున్న సమస్యలను ప్రధానికి వివరించడం అన్నది లేకుండా పోయింది. అంతెందుకు ఏపిలో కేంద్రమంత్రు లుగా ఉన్న రామ్మోహన్ నాయుడు వంటి వారు రాష్ట్రానికి ఏం చేద్దామా అని ఆలోచించి, నిధులు విడుదల చేయించుకుని అభివృద్ది పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కానీ తెలంగాణలో ఉన్న ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి పోయడానికే మాత్రమే సమయం తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకం గా నిర్మించుకున్న గంగవరం పోర్టు, నెల్లూరులోని పోర్టులు అన్నీ ఆదానీ పరం అయ్యాయి. గత జగన్ ప్రభుత్వం దగ్గరుండి వాటిని ఆదానీకి కట్టబెట్టారు. ఇదంతా మోదీ చలవ వల్లనే అని వేరుగా చెప్పనక్కరలేదు. గంగవరం పోర్టుకోసం భూములు ఇచ్చి త్యాగం చేసిన జాలర్లు ఆగమయ్యారు. గంగవరం పోర్టుతో పాటు విశాఖ ఉక్కును కూడా మోధీ ప్రభుత్వం అప్పనంగా కార్పోరేట్లకు కట్టబెట్టే ఆలోచన చేశారు. తాత్కాలికంగా ఈ ప్రక్రియ నిలిచిపోయినా… దీని రోణకు ఒక్క ప్రకటనా చేయడం లేదు.
అలాగే విశాఖ స్టీల్ పటిష్టతకు, ఐరన్ ఓర్ కేటాయింపులకు చర్యలు తీసుకోవడం లేదు. ఇలా ప్రభుత్వ సంస్థలను అప్పనంగా కట్టబెడితే ఎవరైనా ఆదానికి మించి ఆదాయం సంపాదించగలరు. ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగలరు. ఈ కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆదానీ అమాంతంగా ఎగబాకారు. నిజానికి ప్రపంచంలో ఉన్న కుబేరులంతా కష్టపడి నీతిమంతంగా సంపాదించి, అందులో దేశం కోసం కొంత వెచ్చించి కుబేరులవుతున్నారు. కానీ ఆదానీ, అంబానీలాంటి వారు భారత ప్రజల శ్రమశక్తిని తమ ఖాతాల్లో వేసుకుంటూ కుబేరులవుతున్నారు. ఇలాంటి వారికి మన ప్రధాని మోదీ లాంటి వారి సహకారం పుష్కలంగా ఉండడం కూడా కలసి వస్తోంది.
అత్యధిక సంపద వృద్ధి నమోదు చేసుకున్న ప్రపంచ కుబేరుల్లో అదానీ దే అగ్రస్థానం. అంతేకాదు, ఈ ఏడాది సంపదను మరింత పెంచుకోగలిగిన ప్రపంచ టాప్ టెన్ కుబేరుల్లో అదానీ, అంబానీలు భారతీయులే కావడం విశేషం. మోదీ ప్రధాని అయ్యాక ఈ ఇద్దరికి గతంలో ఎప్పుడూ లభించనంత ప్రోత్సాహం దక్కుతోంది.పెట్రోల్‌పై రూపాయి తగ్గించడానికి, గ్యాస్‌పై రూపాయి తగ్గించడానికి, జిఎస్టీ వడ్డింపులను కొంతయినా తగ్గించడానికి ఏ మాత్రం సాహసించని మోదీ ఇలాంటి కుబేరుల కోసం మాత్రం ఎంత్కెనా చేయడానికి సిద్దంగా ఉన్నారు. కార్పోరేట్లకు ఇచ్చే తాయిలాల్లో ఒక్క శాతం కూడా వ్యవసాయరంగానికి ఖర్చు చేసినా పరిస్థితి మరోలా ఉండేది. ఉచితాలకు ఖర్చు కావడం లేదు. దీనిని ఎవరు కూడా చర్చించడం లేదు.. నిజానికి కార్పోరేట్లకు ఉచితాలు ఇవ్వడం, రుణాలు మాఫీ చేయడం, పన్నులు రద్దు చేయడం కూడా లంచంగానే భావించాలి. సామాన్యులకు చేయని సాయం కార్పోరేట్ గద్దలకు దోచిపెట్టడం ఎంతవరకు సమంజసం. గతంలో కాంగ్రెస్ పాలకులు అనుసరించిన కార్పోరేట్ అనుకూల విధానాలను మరింత వేగంగా అమలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ కారణంగా సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారు.
-డా.సి.వి.ఆర్





