నిర‌స‌న హ‌ద్దు దాటితే…

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా  హైద‌రాబాద్‌ను సంద‌ర్శించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీకి హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుత ఆహ్వానం ప‌ల‌క‌డ‌మే కాదు, త‌న‌ ప‌ట్ల చూపిన అభిమానం పుల‌క‌రింప‌జేసి వుంటుంది. నిజానికి గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ మ‌న‌దేశంలో మూడు రోజుల పాటు నాలుగు న‌గ‌రాల్లో ప‌ర్య‌టించాల్సివుంది. అవి వ‌రుస‌గా కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, ముంబ‌యి, న్యూదిల్లీ. కోల్ క‌తా, హైద‌రాబాద్ త‌ర్వాత ముంబ‌యి, దిల్లీన‌గ‌రాల‌ను సంద‌ర్శిస్తారు. ప్ర‌ధానితో భేటీ అవుతారు. అక్క‌డితో ఆయ‌న గోట్ ఇండియా ప‌ర్య‌ట‌న ముగుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెస్సీ కార్య‌క్ర‌మాన్ని అద్భుతంగా మ‌ల‌చ‌డంలో చ‌క్క‌టి ప్ర‌ణాళికార‌చ‌న చేసి అనుకున్న ప్ర‌కారమే అమ‌లు చేయ‌డం కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డానికి దోహదం చేసింది.

తాజ్ ఫ‌ల‌క్‌నామాలో వంద‌మందితో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన‌డం, త‌ర్వాత ఉప్ప‌ల్ స్టేడియంకు వ‌చ్చి రేవంత్‌రెడ్డితో కొంచెం సేపు ఫుట్‌బాల్ ఆడ‌టం కిక్కిరిన స్టేడియంలోని అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింద‌నే చెప్పాలి. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసి లేజ‌ర్‌షో, క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఏర్పాటు చేసిన లైటింగ్‌ అంద‌రినీ అల‌రించాయి. ప్ర‌ముఖులు, సినీతార‌ల సంద‌డితో స్టేడియం క‌ళ‌క‌ళ‌లాడింది.

తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా పోలీసులు పాస్‌లు వున్న‌వారినే అనుమ‌తించ‌డం, తీసుకున్న ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు కార్య‌క్ర‌మం స‌జావుగా సాగ‌డానికి దోహ‌దం చేసింది. మొత్తంమీద హైద‌రాబాద్‌లో మెస్సీ కార్య‌క్ర‌మం స‌క్సెస్ కావ‌డం, కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రాహుల్ గాంధీ దృష్టిలో రేవంత్ ప‌ట్ల మ‌రింత సానుకూలత ఏర్ప‌డ‌టానికి దోహ‌దం చేసివుండ‌వ‌చ్చు. జూబిలీహిల్స్ ఉప ఎన్నిక‌లో విజ‌యం, తెలంగాణా రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో ఆశించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు రావ‌డంతో పాటు ఈ మెస్సీ ప‌ర్య‌ట‌న స‌క్సెస్ రేవంత్‌కు రాబోయే మూడేళ్ల కాలం ప‌ద‌వికి ఢోకాలేకుండా, పార్టీపై ప‌ట్టును కొన‌సాగిస్తూ ముందుకెళ్ల‌వ‌చ్చు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తున్న‌దంటే హైద‌రాబాద్‌కు రావ‌డానికి ముందు మెస్సీ కోల్‌క‌తా వెళ్లాడు. అక్క‌డి సాల్ట్ లేక్‌కు వెళ్లిన ఆయ‌న ప‌దిహేను నిముషాల‌సేపు కూడా వుండ‌లేక‌పోయారు. అక్క‌డి నిర్వాహ‌కులు, పోలీసుల దారుణ వైఫ‌ల్యం నేప‌థ్యంలో మెస్సీ వెంట‌నే స్టేడియంనుంచి వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. ఎంతో ఖ‌రీదు పెట్టి టిక్కెట్టు కొనుక్కొని వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌మ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని చూడ‌లేక‌పోయామ‌న్న కోపం అభిమానుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకునేలా చేసింది. ఫ‌లితం స్టేడియం విధ్వంసం! చివ‌ర‌కు కోల్‌క‌తా పోలీసులు నిర్వాహ‌కుడిని అరెస్ట్ చేసినా, స్వ‌యంగా ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ జ‌రిగిన సంఘ‌ట‌పై క్ష‌మాప‌ణలు చెప్పినా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

స్టేడియంలో అభిమానుల ఆగ్ర‌హావేశాల‌కు ధ్వంస‌మైన కుర్చీలు ఇత‌ర‌త్రా సామ‌గ్రి, చెత్త‌తో నిండిపోయిన గ్రౌండ్‌కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డ‌మే కాదు, సివిక్ సెన్స్ లేకుండా ధ్వంస‌కాండ‌తో నిర‌స‌న తెలిపిన వైనం మ‌న‌దేశ ప‌రువును బ‌జార్న ప‌డేసింద‌నే చెప్పాలి. పోలీసుల‌ను స‌స్పెండ్‌ చేసినా, నిర్వాహ‌కుడిని అరెస్ట్ చేసినా పోయిన ప‌రువు రాదు క‌దా! మ‌రోసారి మ‌రే ఇత‌ర అంత‌ర్జాతీయ ప్ర‌ముఖ క్రీడాకారుడు మ‌న‌దేశానికి రావాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించే దుస్థితి క‌ల్పించిన తీరు త‌ల‌వొంపులు తెచ్చేదిగా వుంది.

నిర్వాహ‌కులు ఏకంగా రూ.12వేల చొప్పున టిక్కెట్ ఖ‌రీదు వ‌సూలు చేశార‌ట‌!    మెస్సీ కోల్‌క‌తాకు శ‌నివారం తెల్ల‌వారుజామున చేరుకున్నాడు. ఆయ‌న స్టేడియంకు వ‌చ్చిన త‌ర్వాత ఏర్ప‌డిన గంద‌ర‌గోళంతో అభిమానుల ఆగ్ర‌హానికి కుర్చీలు విరిగిపోయాయి. స్టేడియం ధ్వంస‌మైంది. వాట‌ర్ బాటిళ్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు గ్రౌండ్‌లోకి విసిరేశారు. చివ‌ర‌కు గోల్ పోస్ట్ కూడా వీరి ఆగ్ర‌హానికి ధ్వ‌స‌మ‌వుతున్న వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పెద్ద‌మొత్తంలో అభిమానుల‌నుంచి టిక్కెట్ల రుసుమును వ‌సూలు చేసిన నిర్వాహ‌కులు, మెస్సీతో కేవ‌లం వీఐపీలు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు వారి బంధువులు ఫోటోలు దిగ‌డానికే ప‌రిమితం కావ‌డం, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూడ‌లేక‌పోవ‌డం, క‌నీసం అత‌డిని దూరం నుంచి చూద్దామ‌న్నా కుద‌ర‌క‌పోవ‌డం అభిమానుల ఆగ్ర‌హానికి ప్ర‌ధాన కార‌ణం.

ఇది విధ్వంస‌కాండ‌కు కార‌ణ‌మైంది. నిర్వాహ‌కుల లోపం వున్నా, అభిమానులు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసే విధానం ఇది కాదు! వీరి కోపానికి, ఆగ్ర‌హానికి నాశ‌న‌మైంది మ‌న ఆస్తులే క‌దా! నిర్వ‌హ‌ణ‌లో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం, తెలంగాణ నుంచి, అదేవిధంగా సివిక్ సెన్స్ విష‌యంలో అక్క‌డి అభిమానులు ఇక్క‌డి అభిమానుల‌నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంద‌ని ఈ ఉదంతం వెల్ల‌డిస్తోంది. అంతేకాదు నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంలో చైనావారి నుంచి కూడా వీరు నేర్చుకోవాల్సింది చాలా వుంది!

ఇదే మెస్సీ గోట్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గ‌త కొద్దిరోజులుగా ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డికి రావ‌డానికి ముందు చైనాలో కూడా ప‌ర్య‌టించాడు. హాంగ్ కాంగ్‌ స్టేడియంలో కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడాల్సి వుంది. కానీ అక్క‌డ ఆడ‌కుండా వెళ్లిపోయాడు. త‌ర్వాత అత‌ను జ‌పాన్‌ను సంద‌ర్శించాడు. టోక్యోలోని నేష‌న‌ల్ స్టేడియంలో కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడాడు. తాము పెద్ద‌మొత్తంలో చెల్లించి టిక్కెట్లు కొనుక్కొని వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఫుట్‌బాల్ ఆడ‌నందుకు మెస్సీపై హాంగ్‌కాంగ్ వాసుల‌కు కోపం రాలేదు. కానీ త‌మ శ‌త్రుదేశమైన జ‌పాన్‌లో ఫుట్‌బాల్ ఆడేస‌రికి ఒక్క‌సారి వారిలో ఆగ్రహం క‌ట్ట‌లు తెంచుకొని ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్న నిర‌న‌స‌నల‌కు మెస్సీ దిగిరావాల్సి వ‌చ్చింది. స్వయంగా వీడియోలో మాట్లాడాడు. చైనా భూభాగంపై ఫుట్‌బాల్ ఆడ‌క‌పోవ‌డానికి రాజ‌కీయ కార‌ణాలు లేవ‌ని, కేవ‌లం తాను గాయ‌ప‌డినందువ‌ల్ల అక్క‌డ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఆడ‌లేక‌పోయాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంలో కూడా సివిక్ సెన్స్ వుండాల‌న్న‌దానికి హాంగ్ కాంగ్ వాసులు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు. మ‌రి మ‌న కోల్‌క‌తా అభిమానుల మాటేంటి?   విక‌టించిన అభిమానం క‌ట్ట‌లు తెంచుకొని విధ్వంసం సృష్టిస్తే ఎవ‌రి ప‌రువు పోయింది? మ‌న‌దేశ ప‌రువే క‌దా! అభిమానం వుండ‌టంలో త‌ప్పులేదు.  ఆగ్ర‌హావేశాలు విధ్వంసం సృష్టించే స్థాయిలో వుండ‌కూడ‌దు. ద‌క్షిణ భార‌త్‌లోని హైద‌రాబాద్ ఎంత చ‌క్క‌గా మెస్సీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిందో ప్ర‌త్య‌క్షంగా చూశాం క‌దా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *