శాస్త్ర పరిశోధనల పర్యవసానాలేమిటి?

శాస్త్ర విజ్ఞానంలో గత సహస్రాబ్దిలో జరిగిన వికాసం వెనుక ఒక పొసగని అంశం ఉంది. మామూలుగానైతే ఈ శాస్త్ర విజ్ఞాన వికాసం మానవుల స్వేచ్ఛను చాలా ఎక్కువ స్థాయిలో పెంపొందించగల శక్తి కలిగివుంది. మనిషికి, ప్రకృతికి నడుమ ఉన్న గతితార్కిక వైరుధ్యంలో మానవుడి సామర్థ్యాన్ని అది పెంచగలదు. నిరంతరం తనను తాను ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నలకు సమాధా నాలను అన్వేషిస్తూ ఆ క్రమంలో శాస్త్రీయ విజ్ఞానం, కార్యాచరణ అనంతంగా అభివృద్ధి చెందుతూనేవుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా మానవులు సమిష్టిగా విముక్తి పొందేం దుకు దోహదం చేస్తుంది. కాని శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ద్వారా మానవులు పొందవలసిన స్వేచ్ఛ మాత్రం చాలావరకూ ఆచరణ రూపం దాల్చలేదు. పైగా, కొద్దిమంది తక్కిన మానవులమీద, సమాజాలమీద సాగిస్తున్న ఆధిపత్యాన్ని మరింత బలంగా కొనసాగించడానికి ఈ శాస్త్రవిజ్ఞాన వికాసం తోడ్పడుతోంది. అంటే మానవుల స్వేచ్ఛను మరింత పెంపొందించడానికి తోడ్పడవలసిన శాస్త్ర విజ్ఞానం ఆ మానవుల స్వేచ్ఛను మరింత కుదించడానికి, కొద్దిమంది ఆధిపత్యాన్ని పెంచడానికి తోడ్పడుతోంది. ఇదే ఆ పొసగని అంశం. ఒకప్పుడు సమాజం (యూరోపియన్‌ ‌సమాజం) చర్చి ఉక్కుపిడికిలిలో ఇరుక్కుని ఉండేది. శాస్త్రవేత్త గెలియో చేత బలవంతంగా దైవప్రార్ధన చేయించిన వైనం గుర్తుకు తెచ్చుకోవొచ్చు. అటువంటి ఉక్కుపిడికిలిని బద్దలుగొట్టిన తర్వాతనే శాస్త్రవిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఐతే ఇదంతా బూర్జువావిప్లవంలో భాగంగా, ఫ్యూడల్‌ ‌వ్యవస్థను కూలదోసే క్రమంలో భాగంగా జరిగింది.

ఇందుకు 1640 నాటి ఇంగ్లీషు విప్లవం ఒక ఉదాహరణ. అంటే యూరప్‌ ‌లో ఆధునిక శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి మొదటినుంచీ పెట్టుబడిదారీ అభివృద్ధితో విడదీయలేనంతగా ముడిపడివుంది. అందుచేత శాస్త్ర పరిశోధనల ఫలితాలను ఏ ప్రయోజనాలకోసం వినియోగించాలనేది అప్పటినుంచీ పెట్టుబడిదారీ వర్గమే ప్రధానంగా నిర్ణయిస్తూవస్తోంది. దీని ప్రభావం తాత్విక వాదనలపై కూడా పడింది. అకీల్‌ ‌బిల్‌ ‌గ్రామీ వంటి తత్వ వేత్తలు ఈ ధోరణి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధోరణి ఏమిటి ? ప్రకృతిని ఒక జడ పదార్ధ ంగా పరిగణించడం, అటువంటి జడత్వాన్నే ప్రపంచంలో వివిధ మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలకు, స్థానిక తెగలకు కూడా ఆపాదించడం. ప్రకృతి శక్తులపై పశ్చిమ దేశాల ఆధిపత్యం (శాస్త్రవిజ్ఞానం ద్వారా) సమర్ధనీ యమేనని, దానితోబాటు మారుమూల ప్రాంతాల ప్రజలమీద కూడా సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యం న్యాయమేనని ఈ ధోరణిని అందిపుచ్చుకున్న తత్వ వేత్తలు చెప్తున్నారు. అంటే వాళ్ళు సామ్రాజ్యవాదాన్ని బలపరుస్తున్నారన్నమాట. మానవులకు సంపూర్ణ స్వేచ్ఛను ఇవ్వగల శాస్త్ర విజ్ఞానం  పూర్తి ఫలితాలను పొందాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థను దాటి ముందుకు పోవడమే మార్గం అని ఈ యుగంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గ్రహించారు. అందుకే, పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే పోరాటాలు జరిగినప్పుడు వారంతా సోషలిజం వైపు నిలిచారు.

ఆల్బర్ట్ ఐన్స్టీన్‌ అటువంటి శాస్త్రవేత్తల్లో ఒకరు. అతడు సోషలిజాన్ని గట్టిగా సమర్ధించడమే గాక, రాజకీయ కార్యకలాపాల్లో, సభల్లో కూడా పాల్గొనేవాడు. అందుచేత అమెరికన్‌ ‌గూఢచారిసంస్థ ఎఫ్బిఐ అతడి చర్యలను రహస్యంగా కనిపెట్టడానికి, ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపడానికి గూఢచారులను నియమించింది. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అతడి భావాల కారణంగానే ఆటం బాంబు తయారు చేయడానికి ఉద్దేశించిన మాన్‌ ‌హట్టన్‌ ‌ప్రాజెక్టు లో ఐన్స్టీన్‌ ‌ను భాగస్వామిని చేయడానికి భద్రతా కారణాల సాకుతో అనుమతినివ్వలేదు. ఐన్స్టీన్‌ ‌మాదిరిగానే 20వ శతాబ్దపు అత్యుత్తమ శాస్త్రవేత్తలలో బ్రిటన్‌ ‌కు చెందిన జె.డి బెర్నాల్‌ ‌నుండి, జోసెఫ్‌ ‌నీధం, జెబిఎస్‌ ‌హాల్డేన్‌, ‌హైమన్‌ ‌లెవీ, జిహెచ్‌ ‌హార్డీ, డొరొతీ హార్డ్కిన్‌, ‌మరెందరో వామపక్ష ఉద్యమాలలో భాగస్వాములయ్యారు. నయా ఉదారవాదం అమలు కావడంతో పరిస్థితిలో మౌలికమైన మార్పు వచ్చింది. శాస్త్రవిజ్ఞానం ఒక సరుకుగా మారింది. శాస్త్ర పరిశోధనలకు నిధులు సమకూర్చే బాధ్యతనుండి ప్రభుత్వం తప్పుకుంది. ఆ పనిని కార్పొరేట్లకు అప్పగించింది. దీని వలన పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించి శాస్త్ర విజ్ఞానం పురోగమించాలనే తన రాజకీయ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం శాస్త్రవేత్తకు బాగా తగ్గిపోయింది. నిధులను సమకూర్చే ప్రైవేటు దాతలకు ఆమోదయోగ్యంగా ఉండే శాస్త్రవేత్తలు మాత్రమే రిసెర్చి ప్రాజెక్టులలో భాగం కావడానికి అనుమతి పొందగలుగుతారు. సోషలిస్టు భావాలపట్ల విశ్వాసం కలిగివుండడం శాస్త్రవేత్తకు ఉపయోగకరంగా ఉండే అంశంగా లేదు.

దాతలనుండి విరాళాలను సేకరించగల సామర్థ్యం ఉంటేనే యూనివర్సిటీలలో పదవులు దొరుకుతాయి. ఇంతవరకూ విద్యా రంగంలో తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే వీలు ఉండేది. ఇప్పుడు ఆ విషయంలో కూడా పరిమితులు ఏర్పడ్డాయి. శాస్త్రవిజ్ఞానం ఒక సరుకుగా మారడం అంటే శాస్త్రవేత్తలు రాజకీయంగా పాలకవర్గాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడడం. తన పరిశోధన ద్వారా మానవులను మరింత స్వేచ్ఛా ప్రపంచం వైపు నడిపించాలనే లక్ష్యం కలిగివుండే హక్కు శాస్త్రవేత్తలకు లేకుండా పోతోంది. అందుచేత జరిగే శాస్త్ర పరిశోధనల పర్యవసానాలేమిటో పెద్దగా చర్చ జరగకుండానే వాటిని స్వీకరించడం, అమలు చేయడం జరుగుతోంది. ఆ విధంగా ఆలోచనా రహితంగా నూతన శాస్త్రవిజ్ఞానాన్ని అమలులో పెట్టడం అనేది నేడు మన కళ్ళముందే కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇం‌టలిజెన్స్ -ఎఐ) ‌విషయంలో జరుగుతోంది. ఎఐ ని అమలు చేయడం వలన అనేక పర్యవసానాలు కలగవొచ్చు. కాని ప్రస్తుతం నేను ఒక్కదాని గురించి మాత్రమే ఇక్కడ చర్చిస్తాను. అది ఎఐ ఫలితంగా కలిగే భారీ నిరుద్యోగం. ఈ మధ్య ఎఐ అమలును వ్యతిరేకిస్తూ హాలీవుడ్‌ ‌స్క్రిప్ట్ ‌రైటర్లు చేసిన సమ్మె పలువురి దృష్టిని ఆకట్టుకుంది. మానవ శ్రమను దేనినైనా చేయగల యంత్ర పరికరం వస్తే అది మానవులను శ్రమ నుండి విముక్తి చేస్తుంది. లేదా అదే మనుషులతో మరింత ఎక్కువ ఉత్పత్తిని అదే సమయంలో చేయించగ లుగుతుంది. ఆవిధంగా ప్రజానీకానికి మరింత ఎక్కువ సరుకులను, సేవలను అందించగలుగుతుంది.

కాని పెట్టుబ డిదారీ వ్యవస్థలో మానవులకు బదులు వినియోగించగల కొత్త పరికరం ఏది వచ్చినా అది మానవుల కష్టాలను పెంచడానికే దారి తీస్తుంది. ఒకానొ పరికరం మానవుల ఉత్పాదకతను రెట్టింపు చేయగలుగుతుంది అనుకోండి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతీ పెట్టుబడిదారుడూ ఆ పరికరాలను వినియోగించి తనవద్ద పని చేసే ఉద్యోగులలో సగం మందిని ఉద్యోగాలనుండి తొలగిస్తాడు. దీని ఫలితంగా కార్మికుల రిజర్వు సైన్యం (నిరుద్యోగం) రెట్టింపు అవుతుంది. అంతే కాక, ఉద్యోగాలు చేస్తున్న కార్మికుల జీతాలు కూడా ఏమీ పెరగవు. అందుచేత వేతనాలకు చెల్లించే మొత్తం సగానికి సగం తగ్గుతుంది. ఇంకోపక్క ఉత్పత్తి అయిన సరుకులో మిగిలిపోయేది పెరుగుతుంది. ఉత్పత్తి అయిన సరుకుకు సరిపడా డిమాండ్‌ ‌లేనందువలన ఉత్పత్తిని తగ్గించవలసివస్తుంది. అప్పుడు నిరుద్యోగం మరింత పెరుగుతుంది. ఇంగ్లీషు ఆర్థికవేత్త డేవిడ్‌ ‌కార్డ సాంకేతిక స్థాయి పెరిగితే డిమాండ్‌ ‌తగ్గి, దాని ఫలితంగా నిరుద్యోగం అదనంగా పెరుగుతుంది అన్న వాదనను గుర్తించలేదు. అతడు ‘సే’ యొక్క సూత్రాన్ని బలంగా నమ్మాడు. ’’ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినందువలన పెట్టుబడిదారుడికి మిగులు అదనంగా వస్తుంది. దానిని అతడు మళ్ళీ పెట్టుబడి పెడతాడు. అందుచేత అదనపు ఉద్యోగాల కలుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం కొత్తగా వొచ్చినందువలన మార్కెట్‌ ‌లో డిమాండ్‌ ఏమీ తగ్గిపోదు. ఒకవేళ తగ్గినా అది తాత్కాలికమే. కొత్త పెట్టుబడులు రాగానే మళ్ళీ ఉపాధి పెరుగుతుంది. ‘అంతేగాక, సాంకేతిక పరిజ్ఞానం కొత్తగా ప్రవేశపెట్టక మునుపు ఉన్న ఉద్యోగాల కంటే అదనంగా ఉద్యోగాలు వస్తాయి.’’ ఇదీ సే సూత్రం సారాంశం. ఐతే ఈ సే సూత్రం ఆచరణలో వర్తించదు. మార్కెట్‌ ఎం‌తమేరకు పెరిగే అవకాశం ఉంది అన్నదానిని బట్టి పెట్టుబడులు అదనంగా వస్తాయి.

తప్ప సరుకు అమ్ముడుపోతే ఎంత లాభం వస్తుంది అన్నదానిని బట్టి కాదు. ( ఒకవేళ ఇంతవరకూ విస్తరించని కొత్త మార్కెట్లకు విస్తరించే అవకాశం ఉంటే వలస పాలన కాలంలో మాదిరిగా, లేక, మార్కెట్‌ ‌లో డిమాండ్‌ ‌పడిపోయినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని డిమాండ్‌ ‌ను నిలబెట్టే చర్యలు తీసుకునే వీలు ఉంటే అప్పుడు కొత్త టెక్నాలజీ వలన అదనపు నిరుద్యోగం రాకపోవచ్చు) సంపన్న పశ్చిమ దేశాల్లో కొత్త టెక్నాలజీ ప్రవేశం అదనపు నిరుద్యోగానికి దారి తీయకపోడానికి కారణం (1) వాళ్ళకి వలసదేశాల మార్కెట్లు అందుబాటులో ఉండడం, ( దాని వలన కొత్త టెక్నాలజీ ప్రవేశం సంపన్న పశ్చిమ దేశాలలో కాకుండా వలసదేశాలలో భారీ నిరుద్యోగానికి దారి తీసింది. చిన్నచిన్న పరిశ్రమలు, చేతివృత్తులు దివాలా తీశాయి) అంటే నిరుద్యోగాన్ని వలసదేశాలకు ఎగుమతి చేశారన్నమాట. (2) మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేవరకూ దాదాపు 19వ శతాబ్దం అంత కాలమూ యూరప్‌ ‌నుంచి భారీగా కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ‌లకు వలసలు నడిచాయి. దాని వలన యూరప్‌ ‌లో నిరుద్యోగం తలెత్తినా, అది నిలవలేదు. కాని ఈ రోజు పరిస్థితి పూర్తిగా భిన్నం.

వలసవిధానం ఉనికిలో లేకపోవడం అనేది ఒక్కటే తేడా కాదు. సంపన్న పశ్చిమ దేశాలలో తగ్గే డిమాండ్‌ ‌నంతటినీ భర్తీ చేయగల స్థితిలో మూడో ప్రపంచ దేశాలు లేవు. అదే విధంగా నయా ఉదారవాద విధానాల అమలు కారణంగా ప్రభుత్వం మార్కెట్‌ ‌లో జోక్యం చేసుకోలేదు. ఎఫ్‌ఆర్బిఎం చట్టం విధించిన పరిమితులు, సంపన్నుల మీద అధిక పన్నులు విధించకూడదన్న ఆంక్షలు ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచుకునేందుకు లేకుండా కట్టడి చేస్తున్నాయి. ఇక కార్మికులమీద అదనపు పన్నులు వేస్తే దాని వలన స్థూల డిమాండ్‌ ఏమీ పెరగదు. అందుచేత పెట్టుబడివారీ విధానం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమ మేథస్సు ను వినియోగిస్తే అనివార్యంగా భారీగా నిరుద్యోగం పెరుగుతుంది. ఇదే సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో ఏవిధంగా ఉంటుందో చూడండి. ఏ రకమైన యాంత్రీకరణ అయినా, ఎఐ ని సైతం వినియోగించినా, అక్కడ కార్మికుల చాకిరీ తగ్గుతుంది కాని ఉపాధి పోదు. ఇక ఉత్పత్తి ఎంత జరగాలో, వేతనాలు ఏ స్థాయిలో ఉండాలో కేంద్రీకృతంగానే నిర్ణయించడం జరుగుతుంది. కనుక మార్కెట్‌ ‌లో డిమాండ్‌ ‌పడిపోదు. అందుచేత ఏ నష్టమూ కలగని రీతిలో కృత్రిమ మేథస్సును వినియోగించాలంటే అందుకు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించి సోషలిజం వైపు పోవడం ఒక్కటే మార్గం అని భావించాలి.
– కందుల శ్రీనివాస్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page