- ప్రపంచ సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకుంటూ నిర్మొహమాటం, నిజాయితీ పరికరాలుగా
-
సమకూర్చుకున్న అరుదైన విమర్శకురాలు నాగినీ కందాల. సాహిత్య విమర్శ
-
నేపథ్యంగా ఆమె ‘శోభ’ పాఠకుల కోసం ఇచ్చిన ఈ విలువైన ఇంటర్వ్యూ మూడు వారాల పాటు ప్రచురిస్తాము.
-
సాహిత్య విమర్శ పరిధి- రచనలోని గుణదోష విచారణ మాత్రమేనా, అంతకు మించి ఉంటే మీ దృష్టిలో అవేమిటి?
సాహిత్య విమర్శకు పరిధులు నిర్వచించడం సరికాదు, సాధ్యం కూడా కాదు. ఏ కళారూపాన్నైనా పాఠకులు తమదైన పరిధిలోకి లేదా ఆవరణలోకి తెచ్చుకుని చదువుతారు. పాఠకుల చూపుని బట్టి రచనలోని ప్రపంచం మారుతూ ఉంటుంది. బార్త్ అన్నట్లు పుస్తకం పాఠకుల చేతిలో పడగానే రచనకూ, రచయితకూ మధ్య సంబంధం శాశ్వతంగా తెగిపోయినట్లే. అందువల్ల కళను ఎప్పటికీ ఒక స్థిరాంకంగా చూడడం వీలుపడదు. అలాగే రచనకు గుణదోషాలు కూడా ఇతిమిద్ధంగా ‘ఇవీ’ అని నిర్వచించడం కష్టం. ఎందుకంటే అవి కాలంతో బాటు మారుతూ ఉంటాయి. ఈకాలపు ఉత్తమ రచన మరోకాలానికి ఛాందసత్వం కావచ్చు. అదేవిధంగా ఈకాలపు సాంఘిక నియమాలను ఎద్దేవా చేసి, బ్యాన్ కి గురైన రచన, మరోతరానికి వచ్చేసరికి గొప్ప సాంఘిక రచనగా మిగలనూవచ్చు. ఒకవిధంగా చూస్తే, రచనలోని గుణదోషాలను పాఠకుల కంటే, కాలమే ఎక్కువ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ‘కళ కళ కోసమే’ అనే రినైజెన్స్ కాలపు నినాదాన్ని ఎద్దేవా చేస్తూ సాత్రే లాంటివాళ్ళు ‘కమిటెడ్ లిటరేచర్’ను [Littérature engagée- ఆర్టిస్టు రాజకీయ సామాజికాంశాలు, భావజాలాల విషయంలో ఖచ్చితమైన పక్షం తీసుకోవడం] సమర్ధిస్తూ, మార్సెల్ ప్రూస్ట్, ఫ్లాబర్ట్ లాంటివాళ్ళు సంపన్నులు కావడంవల్లే సాహిత్యంలో వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తూ భావుకత్వంలో, సౌందర్యారాధనలో మునిగితేలారని విమర్శించారు.
ఇక పారిశ్రామీకరణ, సోషలిస్టు ఉద్యమాలతో సోవియట్ యూనియన్ ఆవిర్భవిస్తున్న సమయంలో రష్యన్ రచయిత క్రిఝానోవ్స్కీ రచనల్లో తాత్వికత పాళ్ళు ఎక్కువ అంటూ, అవి ఆ కాలానికి సరిపోవనీ, యువతను పక్కదారి పట్టించడానికి తప్ప మరోవిధంగా పనికిరావనీ విమర్శించారు మాక్సిమ్ గోర్కీ. క్రిఝానోవ్స్కీ రచనలు ఆయన మరణానంతరం వెలుగు చూసి NYRB క్లాసిక్స్ లో చేరి ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. ప్రూస్ట్, ఫ్లాబర్ట్ ల రచనలు పోస్ట్ మోడరన్ సాహిత్యపు గతిని మార్చిన అత్యుత్తమ రచనలుగా ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉన్నాయి. జార్జ్ ఆర్వెల్ ‘1984’, ‘ఫారెన్ హీట్ 451’, మార్గరెట్ ఆట్వుడ్ ‘ది హ్యాండ్మైడ్స్ టేల్’, జేమ్స్ జాయిస్ ‘యులీసిస్’, నబకోవ్ ‘లోలిటా’, కర్ట్ వన్నెగట్ ‘స్లాటర్ హౌస్ 5’, మార్గరెట్ మిఛెల్ల్ ‘గాన్ విత్ ది విండ్’- ఇలా చెప్పుకుంటూపోతే నేటి క్లాసిక్స్ అన్నీ ఒకప్పుడు తీవ్ర విమర్శలపాలై నిషేధానికి గురైనవే. ఒక రచయిత తన జీవితకాలంలో తన రచనలు జనాదరణ పొందడం చూడగలిగితే, నిస్సందేహంగా ఆ రచయితది చాలా అదృష్టం అనుకోవచ్చు. కానీ ఒకవేళ అలా జరగకపోతే, ఆనాటి సమాజపు తీర్పు ఒక్కటీ ఆ రచన నాణ్యతను తూచే కొలమానం ఖచ్చితంగా కాదని గ్రహించడంలో వివేకం ఉంది. చరిత్ర చూస్తే ఘోరంగా విఫలమైన మెజారిటీ తీర్పులెన్నో.
సాహితీ విమర్శ చెయ్యాలంటే రచనకు సానపెట్టి, దాని నాణ్యతను అంచనావేసే తూకపు రాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. ఆ తూకపు రాళ్ళు ప్రాచీన సాహిత్యమేనంటారు కొందరు. సమకాలీన సాహిత్యానికి ఆ పాత కొలమానాలు పనికిరావంటారు మరికొందరు. నిజానికి వర్తమానం గతాన్ని ఎంతగా మార్చుతుందో, గతం కూడా వర్తమానాన్ని అంతే ప్రభావితం చేస్తుంది. సాహిత్యంలో పాత, కొత్తల మధ్య సయోధ్య కుదిరినప్పుడే పాత నియమాలను పునఃపరిశీలించే అవకాశం, కొత్త నియమాలను సవరించుకునే అవకాశం ఉంటాయి. సంప్రదాయ, సమకాలీన సాహిత్యాలు ఒకదానితో ఒకటి ‘ఢీ’ కొడుతూ పోటీపడాలి కానీ, రెండిటి మధ్యా వంతెనలు సమూలంగా తగలబెట్టుకోవడం సరికాదు.
అలాగని ‘ఎంతసేపూ పాతవి పట్టుకుని వేళ్ళాడతామా?’ అంటే, నా ఉద్దేశ్యం అది కాదు. సంప్రదాయ సాహిత్యాన్ని శిలాశాసనంలా భావించి గుడ్డిగా అనుసరించడం ఎంత తప్పో, దాన్ని పూర్తిగా తిరస్కరించడమూ అంతే తప్పు. ఇక్కడ పోలికంటే, కొత్త రచనల్ని పాత రచనలతో పోల్చడం ఒక్కటే కాదు, రెండిటినీ ఒకదానితో మరొకటి పోల్చడం అవసరం. నిజానికి గాయత్రి చక్రవర్తి స్పివాక్, జక్వెస్ డెరిడా, సాండ్రా గిల్బర్ట్, వర్జీనియా వూల్ఫ్ లాంటివాళ్ళు విమర్శ పేరిట చేసినదదే. అప్పుడే పాత రచనల్లో ఉన్న లోపాల్ని గమనించి, అవసరమైతే వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ వాదనను మరో అర్థంలో తీసుకుని సాహితీ విమర్శ పేరిట పాత రచనల్ని సమూలంగా తిరగరాసే మూర్ఖత్వం కూడా సరికాదు. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకూ, నాగరికతకూ మిగిలిన గుర్తుల్ని చేతనైతే భద్రపరుచుకోవాలి, అంతేగానీ వాటిని తిరగరాసే హక్కు మనకు లేదు. అది ఆ కాలపు రచయితల్ని అవమానించి, వారి ఉనికిని చాటే కళను నాశనం చెయ్యడమే.
ఇక పాత, కొత్త రచనల విషయంలో పోలికలంటూ తెస్తే, అవి కేవలం భాష, శైలి వంటి శాస్త్రీయ అంశాలకు మాత్రమే పరిమితం చేస్తే సరిపోదు. వాటిని అప్పటి సంస్కృతికీ, రాజకీయ సామాజికాంశాలకూ కూడా విస్తరించాలి. అప్పుడే ఆకాలపు రచనల్లోని లొసుగులను గుర్తించి, నేటి ఆధునిక సమాజానికి అనుగుణంగా సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా సంప్రదాయ సాహిత్యపు మూలలను కూడా అందిపుచ్చుకుని సరికొత్త ప్రమాణాలతో సాధికారికంగా, స్వతంత్రంగా మరో కొత్త రచన ఆవిర్భవిస్తుంది.
‘అనుభవించి పలవరించడమే ముఖ్యం తప్ప విమర్శ పేరుతో జరుగుతున్నది సాహిత్యానికి అనవసరం’ అన్నమాటను మీరెలా అర్థం చేసుకుంటారు?
ఈ మాట గిరిగీసుకోవడం, మానసిక పరిణితిని అడ్డుకోవడం, తనచుట్టూ గోడలు కట్టుకోవడంలా అనిపిస్తోంది. “No Man Is an Island” అనేమాట సాహిత్యంలోనూ వర్తిస్తుంది. ఏ రచననైనా, (ఆమాటకొస్తే ఏ కళారూపాన్నైనా) ఎవరికివారు అనుభవించి, పలవరించడానికి మాత్రమే అయితే ఈ సాహిత్యం, విమర్శ ఇవన్నీ అనవసరమేమో! ఏదో కాలక్షేపానికి చదివేవాళ్ళు కాకుండా, ముఖ్యంగా సాహిత్యాన్ని సాధనగా చేసుకున్నవారి గురించి మాట్లాడుతున్నాను. సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకునేవారు చదవడం, రాయడం- ఈ రెండు విషయాల్లోనూ, వ్యక్తిగతానుభవమనే అత్యవసరమైన మౌలికమైన దశను దాటేశాక, దానిపై పలువురి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం, దానితో మన అభిప్రాయాలనూ, అనుభవాలనూ బేరీజు వేసుకోవడం కూడా అవసరమనుకుంటాను. అలా చెయ్యనినాడు మన భౌతిక ఆవరణను దాటి బయటకురాలేకపోతున్నామనీ, మన ఉనికిని కొన్ని పరిధులకు లోబడి మాత్రమే నిర్వచించుకుంటున్నామనీ అర్థం. “The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality.” అన్న ఇలియట్ మాటల్ని చూస్తే, ఇది వ్యక్తిగత పరిణితిని, తద్వారా సామాజిక అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుంది. ఈ తీరు సాహిత్యపు ముఖ్యోద్దేశాన్ని మొత్తంగా నీరుగార్చేస్తుంది.
అసలు సాహిత్యమంటేనే మన స్వీయానుభవాలను కథలుగా చేసి ఇతరులకు చెప్పుకోవడం, ఇతరులు చెప్పే కథల్ని అంతే సహానుభూతితో వినడమే కదా! గూటెన్బర్గ్ ముద్రణ యంత్రానికి ముందు, అంటే ఈ ప్రింటింగ్, పుస్తకాలు ఇవేవీ లేనప్పుడు, సాహిత్యం శబ్దరూపంలో మాత్రమే ఉండే కాలంలో దూరదేశపు బాటసారులూ వస్తూవస్తూ తమ దేశపు సంస్కృతిని కథలుగా చేసి తీసుకొచ్చేవారు. మరోదేశపు ప్రజలు తమకు తెలియని ఆ వింతలూ, విశేషాల్ని చెవులింత చేసుకుని వినేవారు. ఆ కథలు కథకుల విశిష్ట స్వభావన్ననుసరించి తమ రూపురేఖలు మార్చుకుంటూ జనం మధ్యలో తిరిగేవి, నలుగురి నోళ్ళలో నానేవి. వాటి గురించి రచ్చబండల దగ్గర నలుగురూ కూర్చుని చర్చించుకునేవారు. ఆ నోటా, ఈ నోటా ఆ కథలు తీరాలు దాటేవి, ప్రత్యక్షంగా వినని మరికొంతమందికి చేరేవి. వాటిపై సామాజిక వ్యాఖ్యానాలతో న్యాయాన్యాయాల విచారణ జరిగేది, సాంఘిక నియమాల్లో మార్పులూ-చేర్పులూ జరిగేవి, తద్వారా ప్రాపంచిక దృక్పథం మార్చుకోవడానికి అవకాశముండేది.
ఇప్పుడు మనకు పుస్తకరూపంలో లభ్యమవుతున్న పురాణేతిహాసాలు, జానపదాలు, కావ్యాలు మొదలు సోక్రటీస్, ప్లేటోల ప్రసంగాల వరకూ- ఆ మూలకథల్ని పట్టుకుని చరిత్రలో మరిన్ని కథలు పుట్టాయి. తరాలకు, సమాజాలకూ తగ్గట్టు, అవే గ్రంథాలు తమను తాము తిరగరాసుకుంటున్నాయి. ఇదంతా ఎవరికివారు అనుభవించి పలవరిస్తే జరిగిన విషయాలు కాదు. ఇప్పుడు ఆ భిన్నాభిప్రాయాలే ‘విమర్శ’ పేరిట అక్షరానికీ, పుస్తకానికీ పరిమితమైపోయి, ఆధునికతను సంతరించుకున్నాయి. మనిషితో మనిషి ప్రత్యక్షంగా సంభాషించి వ్యక్తపరచలేని లేదా పరిష్కరించుకోలేని అంశాలను కనీసం విమర్శ రూపంలో అక్షరాలకైనా పరిమితం చెయ్యకూడదనడం అచ్చంగా సంకుచితత్వం తప్ప మరొకటి కాదు. సాహిత్యం ఉన్నంతకాలం విమర్శ కూడా ఉంటుంది, ఉండాలి.
(ఇంకా ఉంది)




