– రీఫార్మ్.. పెర్ఫార్మ్.. ట్రాన్స్‌ఫార్మ్ దిశగా భారత్
- ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది
– 9 దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం
– ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణల అమలు
– దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదు
– మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానం
– కాంగ్రెస్‌కు దూరదృష్టి లేదు..వోట్ బ్యాంక్ రాజకీయాలు
– రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ
– విపక్షాల నిరసనలు.. నినాదాలు.. చివరకు వాకౌట్
న్యూదిల్లీ, ఫిబ్రవరి 5: వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం ప్రస్తుతం దూసుకెళుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం అన్ని జీవిత పార్శ్వాల్లో, వర్గాల్లో మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు. సరైన దిశలో దేశం ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్జడెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. విపక్ష నేతల నిరసనలు, నినాదాల నడుమ ప్రధాని ప్రసంగించారు. ఆ తరువాత కొద్ది సేపటికే విపక్షాలు వాకౌట్ చేశాయి. అయితే, ప్రధాని మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు. స్వాతంత్య్రం తొలి నాళ్లల్లో భారత్ ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని అన్నారు. కానీ, మునుపటి ప్రభుత్వాల విధానాల కారణంగా 2014 నాటికి 11వ స్థానికి పడిపోయిందని అన్నారు. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోందని అన్నారు. ఈయూ సహా 27 దేశాలతో భారత్ అనేక ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. 9 దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నామని చెప్పారు. రీఫార్మ్.. పెర్ఫార్మ్.. ట్రాన్స్‌ఫార్మ్ దిశగా భారత్ సాగుతోందని అన్నారు. ఉత్పత్తి రంగంలో అనేక విజయాలు సాధించామని చెప్పారు. ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. భారత్‌లో ప్రతిభావంతమైన యువతకు కొరత లేదని వ్యాఖ్యానించారు. రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంక కీలకమని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. ఒకప్పుడు భారత్ బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందని చెప్పారు. ప్రపంచ సవాళ్లకు భారత్ పరిష్కారాలు చూపించే స్థితిలో నిలిచి ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు. అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణం కలగలిసిన అరుదైన స్థితిలో భారత్ ఉందని అన్నారు. మునుపటి ప్రభుత్వాల తప్పులను సరిచేసేందుకే అధిక శాతం తమ శక్తియుక్తులను వినియోగించాల్సి వస్తోందని అన్నారు. గత ప్రభుత్వాల కారణంగా మూటగట్టుకున్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించుకుంటున్నామని అన్నారు. ఈ నష్టాన్ని సరిచేసేలా భవిష్యత్తుకు తగిన విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గ్లోబల్ సౌత్‌గా పేరు పడ్డ దేశాల తరపున భారత్ అంతర్జాతీయ వేదికలపై బలంగా తన వాణిని వినిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచదేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ అవతరించిందని చెప్పారు. కాంగ్రెస్‌కు దార్శనికత లేదని విమర్శించారు. ఫలితంగా భారత్ చాలా కాలం పాటు కష్టాలు పడిందన్నారు. వోటు బ్యాంకు రాజకీయాల కారణంగా వ్యవస్థలు బలహీనపడతాయని అన్నారు. ప్రపంచంలో అగ్రగామి దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ఉత్సుకతతో ఉన్నాయని చెప్పారు. ఈయూ ట్రేడ్ డీల్‌తో ప్రపంచంలో స్థిరత్వంపై వివిధ దేశాలకు నమ్మకం పెరిగిందని అన్నారు. అమెరికాతో ఒప్పందంతో ఈ భావన మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. ఇకపోతే కాంగ్రెస్‌పై ప్రధాని మోదీతీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. తనతోపాటు ఓ వర్గంపైనా ద్వేషాన్ని పెంచుకుంటోం దన్నారు. ఇటీవల లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. దీనిపై లోక్‌సభలో చర్చ జరగకపోవడం అత్యున్నత పదవికే అవమానకరమన్నారు. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే.. ఎన్డీయే హయాంలో మూడో స్థానానికి చేరుకోనుంది. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది. గతంలో మనతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. భారత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు.
తయారీ రంగంలో బలమైన ఎకో సిస్టమ్ ఉంటేనే ఒప్పందాలకు ముందుకొస్తారు. రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్.. నినాదంతో దూసుకెళ్తున్నాం. అన్ని విషయాల్లో పోటీ పడేందుకు భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. మనదగ్గర యువత జనాభా అధికంగా ఉంది. మన యువతకు ప్రపంచ దేశాలన్నీ స్వాగతం పలుకుతున్నాయి. బ్యాంకుల బలోపేతానికి అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలిచాం. బ్యాంకుల నుంచి ఇప్పుడు పేదలకు రుణాలు అందుతున్నాయి. ముద్ర యోజన ద్వారా అనేక మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. దీని కింద రూ.30లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. 10కోట్ల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు లబ్ది పొందారు. 2014 తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను తీసేసి నీతిఆయోగ్‌ను తెచ్చాం. ఇది వేగంగా, సమర్థంగా పనిచేస్తోంది. అక్రమార్కులను రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అక్రమ వలసదారులను బయటకు పంపించివేస్తున్నాయి. బెంగాల్‌లో మాత్రం అటువంటి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజల హక్కులు హరిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





