“పదేళ్లుగా దేశంలో నెలకొన్న విభజన వాతావరణంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక అసహనం, తమ ప్రాధాన్యాలను అమలుచేయించడానికి పౌర నిఘా (విజిలాంటిజమ్) పెరిగిపోయాయి. మూక దాడులు, హింసాకాండ పెరిగిపోయాయి. గోమాంసం తింటున్నారని, గోవులను అక్రమరవాణా చేస్తున్నారని అనుమానంతో హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే, ఉత్తరభారతంలో పరిస్థితులు ఉన్నాయి..”
“వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్జేస్తే
ఉసురుపోయి కూడ నీకె ఉపయోగిస్తున్నాను..’’

అరవైల్లో వచ్చిన ‘గోవుల గోపన్న’ సినిమాలో గోవే ఉత్తమపురుషలో చెబుతున్నట్టు కొసరాజు రాసిన పాట అది. మత, ధార్మిక ప్రాధాన్యాల గురించి కాకుండా, గోవులకు, మన జీవితాలకు ఉండే ఆధారసంబంధాన్ని ఎంతో కారుణ్య. కృతజ్క్షతా భావంతో ఆ పాట చెబుతుంది. పశుసంపద అనుత్పాదక స్థితికి వచ్చిన తరువాత వాటిని విక్రయించడం ఒక ఆనవాయితీగా ఉన్నదని ఆ పాట సూచిస్తున్నది. ( మాంస వృత్తిలో ఉన్న వర్గాన్ని “కటిక” అని కొంచెం నిందార్థ ధ్వనిలో గీత రచయిత ప్రస్తావించారు. ఆనాడు ఇప్పటి స్పృహ లేకపోవడం వల్ల అట్లా వాడి ఉంటారు. ఈ వ్యాస రచయితకు అట్లా వాడడం అంగీకారం కాదు)
పశుపాలక, వేదార్య కాలం నాటి జీవన విధానం ఎట్లా ఉన్నప్పటికీ, మధ్యయుగాల నుంచి మాత్రం గోవధ- నిషేధం ఒక ధార్మిక అంశంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా బక్రీద్ వంటి పండుగల సందర్భంగా బలి ఇచ్చే జంతువులలో ఆవులను మినహాయించాలన్న డిమాండ్ ఉండడం, కొందరు మొగల్ చక్రవర్తులు కూడా అటువంటి నిషేధాలను ప్రకటించడం చరిత్రలో నమోదయింది. ఆధునిక రాజకీయాలలో కూడా గోవధ నిషేధం ఒక ముఖ్యాంశంగా ఉన్నది. అదే సమయంలో ఆహారస్వేచ్ఛను ప్రజాస్వామిక హక్కుగా గౌరవించాలన్న వాదన కూడా బలంగానే ఉండింది. గోవధ నివారణను కోరుకున్నప్పటికీ, గాంధీజీ, నిషేధం విధించడం మీద సుముఖత ప్రకటించలేదు. నిజానికి, నిర్దిష్టంగా గోవులను మాత్రమే వధ నుంచి మినహాయించడం మీద ప్రజలలోని వివిధ వర్గాల మధ్య ఒక ఏకాభిప్రాయం రావడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రత్యేక సందర్భాలలో ప్రదర్శనాత్మకంగా గోవధను నివారించడం దగ్గర నుంచి, ఆహార అలవాట్లను సర్దుబాటు చేసుకోవడం దగ్గర నుంచి, స్వేచ్ఛను అంగీకరించడం దాకా అనేక పరిష్కారాలను చర్చించవచ్చు. ఒక మతవర్గానికి గోవును రక్షించుకోవడం ధర్మం కావచ్చును కానీ, ఇతర వర్గాలకు గోవును చంపితీరవలసిన ధార్మిక అగత్యం ఏమీ లేదు. కాబట్టి, శాంతిసామరస్యాల కోసం వివిధ విశ్వాసాల సమాజం, తనకు ఉచితమైన, సాధ్యమైన పరిష్కారాలను అన్వేషించవచ్చు. అట్లా కాక, ఘర్షణాంశంగా దాన్ని సజీవంగా ఉంచడమే ఇటీవలి చరిత్రలో కనిపిస్తున్నది. సున్నితమైన అగ్నిరేఖ మీద సాము చేయవలసి వస్తున్న సమాజం, గోరక్ష, గోవధ అంశం నేపథ్యంలో తరచు అలజడి ఎదుర్కొంటున్నది.
పదేళ్లుగా దేశంలో నెలకొన్న విభజన వాతావరణంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక అసహనం, తమ ప్రాధాన్యాలను అమలుచేయించడానికి పౌర నిఘా (విజిలాంటిజమ్) పెరిగిపోయాయి. మూక దాడులు, హింసాకాండ పెరిగిపోయాయి. గోమాంసం తింటున్నారని, గోవులను అక్రమరవాణా చేస్తున్నారని అనుమానంతో హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే, ఉత్తరభారతంలో పరిస్థితులు ఉన్నాయి. కుడి, ఎడమల దేశసరిహద్దులను దాటి అక్రమరవాణా చేసే ముఠాలున్నాయి., దేశంలోపలే, రాజస్థాన్, హర్యానా మధ్య అక్రమపశురవాణా జరుగుతుంది. పశువులను అపహరించి, మందగా మార్చి, తరలించడం కొందరికి వృత్తి. ఈ స్మగ్లింగ్‌లో ఆవులే కాక, ఇతర పశువులూ ఉంటాయి. వేర్వేరు ప్రాంతాల్లో పశువులకు వేర్వేరు ధరలు ఉండడం, రాజస్థాన్ లో ఆవులే కాక, వ్యవసాయ పాడిపశువులన్నిటి రక్షణకు కఠినమైన చట్టాలుండడం వల్ల, ఎక్కువ ధరపలికే చోట్లకు అక్రమంగా తరలిస్తుంటారు. ఈ రాష్ట్రాల్లో, పశువుల తరలింపుదారులను గోరక్షకుల పేరుతో అడ్డుకోవడం, దాడులు జరగడం, ఇందులో బెదిరింపు వసూళ్లు, హత్యలు, జరగడం వార్తల్లో చూస్తుంటాము. కొన్నిసార్లు, అడ్డుకునే ఆగంతుకులకు ఆవులు, ఎడ్లు, గేదెల తేడా కూడా తెలియనట్టు ఉంటారు. సామాజిక ఆర్థిక మూలాలున్నీ ఈ సమస్యతో మతకోణం కూడా జతపడి జటిలం అయింది. దీన్ని ఒక దుర్మార్గ ధోరణి గా పరిగణించి, సమర్థంగా ఎదుర్కొనవలసింది పోయి ప్రభుత్వాలు తమ రాజకీయాలకు ఉపయోగపడుతుందని ప్రోత్సహిస్తున్నాయి కూడా. ఫలితంగా ఉత్తర భారతీయ సమాజంలో నిరంతర ఉద్రిక్తత నెలకొన్నది. ప్రజలలోని వివిధ మతవర్గాల మధ్య దూరం, అసహనం పెరిగిపోయాయి.
“ఉత్తరమైనా, దక్షిణమైనా- వ్యవసాయ, గ్రామీణార్థిక వ్యవస్థల క్షీణత దేశమంతా కనిపిస్తున్నది. యాంత్రీకరణ కారణంగా వ్యవసాయంలో పశువుల పాత్ర వేగంగా తగ్గిపోతున్నది. అవసరార్థం పాక్షికంగా పశుసేవలు తీసుకునే రైతు కూడా, నిరంతరం పశువులను పోషించే స్థితిలో ఉండడం లేదు. పాడిపశువులు తప్ప రైతుల దగ్గర నికరంగా ఉండే పశువులు లేవు. పాడికి కూడా బర్రెలను తప్ప, ఆవులను పెంచుకునేవారు అరుదు. ఈ నేపథ్యంలో గోవులు ఎట్లా బతికి బట్టకడతాయి?..”
దక్షిణ భారతదేశంలో సరిహద్దు స్మగ్లింగ్‌కు ఆస్కారం లేదు. గ్రామీణ రంగంలో పశువుల దొంగతనాలు, లేదా, మరొకచోటికి తరలింపు జరిగే అవకాశం తక్కువ. పైగా, ఉత్తరాదిలో ఉన్నంత మతవిభజన, ఉద్రిక్తత లేవు. అయినా, చెదురుమదురుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పశుతరలింపు దారులను గోరక్షకులు నిలువరించే వార్తలు వింటున్నాము. తాజాగా, హైదరాబాద్‌లో గోరక్షకుల మధ్య, గోఅక్రమ రవాణాదారుల మధ్య ఘర్షణ జరిగినట్టు, అందులో గోరక్షకుడు తీవ్రంగా గాయపడినట్టు వార్తలలో చూసినప్పుడు, సహజంగానే ఆందోళన కలుగుతుంది. బాధితుడు కోలుకోవాలని, దాడిచేసినవారు శిక్ష అనుభవించాలని కోరుకోవడం సరే. కానీ, ఈ పరిస్థితి సాధారణ సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయకుండా ఏమి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం, పౌర సమాజం ఆలోచించాలి.
ఉత్తరమైనా, దక్షిణమైనా- వ్యవసాయ, గ్రామీణార్థిక వ్యవస్థల క్షీణత దేశమంతా కనిపిస్తున్నది. యాంత్రీకరణ కారణంగా వ్యవసాయంలో పశువుల పాత్ర వేగంగా తగ్గిపోతున్నది. అవసరార్థం పాక్షికంగా పశుసేవలు తీసుకునే రైతు కూడా, నిరంతరం పశువులను పోషించే స్థితిలో ఉండడం లేదు. పాడిపశువులు తప్ప రైతుల దగ్గర నికరంగా ఉండే పశువులు లేవు. పాడికి కూడా బర్రెలను తప్ప, ఆవులను పెంచుకునేవారు అరుదు. ఈ నేపథ్యంలో గోవులు ఎట్లా బతికి బట్టకడతాయి?
గోరక్షకులు, తరలింపుదారుల ఘర్షణల నేపథ్యంలో సమాధానాలు లేని సందేహాలు కొన్ని ఎదురవుతున్నాయి. గోరక్షణ మీద, విజిలాంటిజమ్ మీద నమ్మకం, పట్టింపు ఉన్న ఒక మిత్రుడితో ఒకప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని ప్రశ్నలు వేశాను. అందులో మొదటిది- గోరక్షణ గురించి చట్టపరమైన సమాచారం తెలుసునా? గోవధ నిషేధ చట్టం ప్రకారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఆవులను, లేగలను ఎట్టి పరిస్థితులలోను చంపకూడదు. కానీ, ఎద్దులను, దున్నపోతులను, అవి శ్రమకు, సంతానానికి పనికిరాకపోతే, పశువైద్యుల సర్టిఫికేట్ తీసుకుని వధించవచ్చు. గోరక్షకులకు ఈ తేడా తెలుసునా? తరచు నిలువరించే రవాణాల్లో ఈ తేడా చూస్తున్నారా? అన్నిటి కంటె ముఖ్యమైన ప్రశ్న- చట్టప్రకారమే గోవధ నేరమైనప్పుడు, పోలీసుల సహాయం తీసుకోకుండా, కొందరు వ్యక్తులు, బృందాలు స్వయంగా ఎందుకు రంగంలోకి దిగుతున్నారు? ప్రభుత్వయంత్రాంగాన్నే బాధ్యురాలిగా చేస్తే, గోరక్షణ కోరుకునేవారికి శ్రమ ఉండదు, సమాజంలో ఉద్రిక్తతా కలగదు.
“అప్రియమైన వాస్తవం ఏమిటంటే, ఆవులను, ఇతర పశువులను పోషించలేక లేక ఆర్థిక అవసరాలకు తెగనమ్మేది గోవు పవిత్రతను విశ్వ సించేవారే. అట్లాగే, దేశంలో పశుమాంసాన్ని ఎగుమతుల కోసం ఉత్పత్తిచేసే యాంత్రిక వధశాలల యజమానులూ ఆ ధర్మంలోని వారే. ఇట్లా పశువులను ట్రక్కులలో తరలించేవారు, అక్కడక్కడ మాంసశాలలు నడుపుతూ జీవనం సాగించేవారు మాత్రం అధికంగా ఇతర విశ్వాసాల వారు ఉంటారు. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, విజిలాంటే దాడులు ఎందుకు జరుగుతాయనే విషయం బోధపడుతుంది..”
అన్నిటి కంటె ముఖ్యమైన ప్రశ్నలు వేరుగా ఉన్నాయి. ఉత్తరాదిలో అయితే, మారుమూల ప్రాంతాలలో అనధికారంగా నడిచే చిన్న చిన్న కబేళాలు ఉన్నాయి. మాంసం కోసమే పశురవాణా చేసేవారు, ఆ కబేళాల ద్వారా వ్యాపారం చేస్తారు. మరి తెలుగురాష్ట్రాలలో పశువుల తరలింపు లో ఉన్నవారు, వాటిని ఎక్కడికి తరలిస్తారు? హైదరాబాద్ లోను, పరిసరాల్లోను ఉన్న లైసెన్స్‌డ్ కబేళాలకే తీసుకుపోతారు. మరి, కబేళాల దగ్గర అడ్డుకుని, వాటిని నియంత్రించకుండా, రవాణాదారులను నిరోధించడం ఎందుకు? కబేళాల యజమానులెవరు? రవాణాదారులెవరు? ఎవరి మత సామాజిక గుర్తింపులేమిటి?
గోవులతో సహా పశువులను వేటినైనా వధించడానికి కబేళా నిరాకరించినప్పుడు ‘నేరం’ ఒక స్థాయిలో ఆగిపోతుంది. పశువులను సొంతదారు విక్రయించకపోతే, అసలు తరలింపే జరగదు. లాభసాటి, గిట్టుబాటు కాని పశువును రైతు అమ్ముకుంటున్నాడు. తరలింపుదారు కొనుక్కుని, కబేళాకు తరలిస్తున్నాడు. ఈ మొత్తం గొలుసుకట్టులో గోరక్షకులు, కేవలం మధ్య లింకు ను మాత్రమే అడ్డుకుంటున్నారు. ఎందుకంటే, ఆ మధ్యలింకులోని వ్యాపారులను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా సామాజిక విభజన తీవ్రం కావాలని కొందరు కోరుకుంటున్నారు కాబట్టి. గోవులను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు- పశువులను రైతులు అమ్మకుండా నిరోధించవచ్చు, ఆవులను పెంచడంలోని ధార్మిక ఔన్నత్యాన్ని వారికి నచ్చచెప్పవచ్చు. ఏ మాత్రం స్తోమత లేని రైతాంగపు గోవులను తామే సేకరించి, ఒక గోశాలను నిర్వహించి ధర్మాన్నికాపాడవచ్చు. అమ్మేవారి జోలికి, చివరకు వధించేవారి జోలికి వెళ్లని గోరక్షకులు సాధించేదేమిటి?
అప్రియమైన వాస్తవం ఏమిటంటే, ఆవులను, ఇతర పశువులను పోషించలేక లేక ఆర్థిక అవసరాలకు తెగనమ్మేది గోవు పవిత్రతను విశ్వసించేవారే. అట్లాగే, దేశంలో పశుమాంసాన్ని ఎగుమతుల కోసం ఉత్పత్తిచేసే యాంత్రిక వధశాలల యజమానులూ ఆ ధర్మంలోని వారే. ఇట్లా పశువులను ట్రక్కులలో తరలించేవారు, అక్కడక్కడ మాంసశాలలు నడుపుతూ జీవనం సాగించేవారు మాత్రం అధికంగా ఇతర విశ్వాసాల వారు ఉంటారు. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, విజిలాంటే దాడులు ఎందుకు జరుగుతాయనే విషయం బోధపడుతుంది.
మానవ ఉత్సాదక వ్యవస్థలో భాగం కాని పశువులేవీ మానవపోషణలో మిగలలేవు. ఈ సూత్రాన్ని మొదట గమనించాలి. పశువులు పెంపుడు జంతువులు కావు, పనిజంతువులు. పశువులు అంతరించిపోవడానికి కీలకం మన ఉత్పాదక విధానంలో మార్పులు రావడం. అయినా, మన సాంస్కృతిక, ధార్మిక అవసరాల రీత్యా, గోవులో మరొకటో అవసరమైతే, అవి ఆ మేరకు మాత్రమే, స్వల్పసంఖ్యలో జీవించగల్గుతాయి. లేదా, ఆవుపాలు ఒక ముఖ్య పాడి ఉత్పత్తిగా మారితే కూడా గోవుల రక్షణ మరింత మెరుగుగా చేయవచ్చు. అప్పుడైనా- వట్టిపోయినప్పుడు, వయసుడిగినప్పుడు యజమానులు నష్టానికి సిద్ధపడి పోషణ కొనసాగిస్తారా?




