తెలంగాణలో రాజ్యాంగ విలువలకు తూట్లు
ఇక్కడి బుల్డోజర్ రాజ్ పాలనపై ఎందుకు మౌనం?
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న వికృత పాలన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. శుక్రవారం లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.ఆ లేఖలో పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే.. మీరు రాజ్యాంగ విలువల గురించి దేశం మొత్తం తిరిగి మాట్లాడుతుంటే, రేవంత్ తన అనాలోచిత, అవగాహన రాహిత్యం వల్ల నిత్యం రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే అటోమేటిక్ గా డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం చేస్తామని మీరు ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు విరుద్దంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇదే విషయంపై సుప్రీం కోర్టును సైతం అవమానపరిచేలాఅసెంబ్లీ లోపల, వెలుపల చేసిన రేవంత్ వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్ ను వ్యతిరేకిస్తున్న మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ రాజ్ పాలనపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు.
ఇక్కడ హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్‌డోజర్లు పంపి పేద, మధ్య తరగతి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఈ విధ్వంస పూరిత వైఖరి హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరి వందల ఎకరాల్లో విధ్వంసానికి తెరతీసింది. జాతీయపక్షి నెమలి సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయి. మరోవైపు ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నినదిస్తున్న హెచ్ సీ యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసుల దాష్టీకం అందరిని తీవ్రంగా కలిచి వేసింది. ఒక్క మీ కాంగ్రెస్ పార్టీ మినహా హెచ్ సీయూ విషయంపై ఎన్ ఎస్ యూ ఐ సహా అన్ని పార్టీలు, వర్గాలు తీవ్రంగా ఖండించాయి.
వ్యతిరేకించాయి.రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్ సీ యూ సందర్శించిన మీకు అప్పటి మా ప్రభుత్వం ఎస్కార్ట్ ఇచ్చి, పోలీసు బందోబస్తు ఇచ్చి నిరసన తెలిపేందుకు అవకాశం కల్పించిందన్న విషయాన్ని నేను ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నానని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. నేడు అదే యూనివర్సిటీలో మీ సీఎం రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరు మౌనంగా ఉండటం సెంట్రల్ యూనివర్సిటీతో సహా యావత్ తెలంగాణను ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చేదాక కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సీ యూలో విధ్వంస కాండను ఆపలేదని తెలిపారు. మీరు ప్రవచిస్తున్న నీతి సూక్తులను మీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం పాటించేలా విగా తగు సూచనలు ఇవ్వాలని కోరారు.