“పదేళ్ల విధ్వంసం తర్వాత విద్యారంగానికి ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ‘ప్రోత్సాహకాలు’ ఆశాజనకంగా అందించి రేవంత్ ప్రభుత్వం తన మార్క్ ను చూపెట్టింది. యూనివర్సిటీల్లో 1,524 పోస్టులు ఉంటే కేవలం 463 మంది అధ్యాపకులు మాత్రమే పర్మినెంటుగా పనిచేస్తున్నారు.యూనివర్సిటీల్లో 1,064 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 12 వర్సిటీలకు 12 సంవత్సరాలుగా ఉన్న సమస్య తీరనుంది.నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది నిరుద్యోగులకు ఇది శుభవార్తే.”
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను ఆయా రంగాల్లో అనుభవంతో పాటు సామాజిక న్యాయం పాటిస్తూ నూరేళ్ళ చరిత్రలో ఎస్సీ ఉపకులపతిని నియమించి చరిత్ర సృష్టించారు.రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో బోధన ,బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి తలపెట్టిన, ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును ఉపసంహరించుకుంది. దానితో ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, తాత్కాలిక అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు. నాటి నుండి విద్యారంగ అభివృద్ధి కోసం,మౌళిక వసతుల ఏర్పాటుకు సరియన ప్రణాళికలతో ముందుకొచ్చిన విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపులో పెద్ద పీట వేసింది.విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దే ప్రయోగశాలలైన విశ్వవిద్యాలయాల అభివృద్దే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.పదేళ్ల విధ్వంసం తర్వాత విద్యారంగానికి ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ‘ప్రోత్సాహకాలు’ ఆశాజనకంగా అందించి రేవంత్ ప్రభుత్వం తన మార్క్ ను చూపెట్టింది. యూనివర్సిటీల్లో 1,524 పోస్టులు ఉంటే కేవలం 463 మంది అధ్యాపకులు మాత్రమే పర్మినెంటుగా పనిచేస్తున్నారు.యూనివర్సిటీల్ లో 1,064 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 12 వర్సిటీలకు 12 సంవత్సరాలుగా ఉన్న సమస్య తీరనుంది.నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది నిరుద్యోగులకు ఇది శుభవార్తే. విద్యా ప్రమాణాలు పెంచే మౌలిక సదుపాయాల అభివృద్ధికి పునాది వేసి, గ్లోబల్ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని మలచాలన్న దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికిప్పుడే పూర్తిస్థాయిలో నిర్ణీత ఫలితాలను అందించలేకపోయినా.. ఉస్మానియా వేదిక గా విద్యార్థులకు జోష్ నింపడంతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు మహర్దశకు బాటలు పడుతున్నాయన్న సంతోషానికి అవధులు లేవు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల పతనం చంద్రబాబు నాయుడు కాలము నుండే ప్రారంభమైంది. దానితో నియామకాలు లేక విద్యారంగంలో అసమానతలతో పాటు సామాజిక అశాంతి పెరగడానికి కారణమైనాయి. డా .వైఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న కాలంలో నిధులు, సౌకర్యాలు, పరిశోధన అవకాశాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాలు స్థాపించారు. అలాగే, అదే సమయంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణకు కఠినమైన నిబంధనలు అమలు చేసారు. నూతన రాష్ట్రంలో కేసీఆర్ నియామకాలు చేయక ,పనిచేస్తున్న అధ్యాపకులకు నష్టం కలిగే విధంగా కామన్ బోర్డు తేవడం దానితో వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే నాడు తెలంగాణ జెండా మోసింది ఈ అధ్యాపకులే. పైగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనేది ఒక ప్రగతిశీల ఆలోచనలో భాగమే అయినప్పటికీ,రిజర్వేషన్లు పాటించక సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందే ఉన్నత విద్యను దూరం చేస్తున్నాయని విమర్శ ఉంది.
అందుకే విశ్వవిద్యాలయాల ప్రాముఖ్యతను కాపాడడం కోసం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో విద్యార్థుల్లో ఉపాధి కోసం నైపుణ్యాల అభివృద్ధికి ‘స్కిల్డ్ యూనివర్సిటీ’ డిజిటల్ యూనివర్సిటీ, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ముదావహం.అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతన రాష్ట్ర యూనివర్సిటీల ఏర్పాటుకు, ప్రణాళికల తయారీకి ఆదేశాలివ్వడం లాంటి అంశాలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో ‘కొత్తకోణం’లో ఉత్తమ ఫలితాలను ఇవ్వడానికి దోహదపడతాయి. నాణ్యత ప్రమాణాలు పెంచడం కోసం విద్యార్థులకు,సిబ్బందికి, ముఖ గుర్తింపు తప్పనిసరిగా చేసి, పాలకమండలులు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు పర్యవేక్షణ చేయాలి.1000కోట్లతో అభివృద్ధికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రాక కొరకు అన్ని విశ్వవిద్యాలయాలు ఎదిరిచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ ’ పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టి దగాచేసింది. అట్టడుగు వర్గాలకు ఆసరా గా ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేసి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటును ప్రోత్సహించింది. నీళ్లు ,నిధులు,నియామకాల నినాదంతో నమ్మినవారిని నయవంచన చేసి పదేళ్లపాటు పబ్బం గడుపుకుంది. దాని ఫలితంగా ఉచితంగా లభించే ఉన్నత విద్య అంగట్లో సరుకులా తయారై అందని ద్రాక్షలా మిగిలింది. పట్టాలు ‘కొనుక్కునే’ పరిస్థితి దాపురించింది. విశ్వవిద్యాలయాలు కేంద్రంగా ఉద్యమంతో సాధించుకున్న నూతన రాష్ట్రంలో ఉన్నత విద్యకు ధోకాలేదని కలలు కన్నారు, చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని అందరూ ఆశించారు.
గడిచిన గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం బోధన సిబ్బంది నియామకాలు చేయలేదు, కానీ జూనియర్ లెక్చరర్లు గా, డిగ్రీ కళాశాల లెక్చరర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మినెంట్ చేసి, విద్యారంగం ప్రయోగశాలలుగా పేరొందిన రాష్ట్ర విశ్వవిద్యాలయాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను పర్మినెంట్ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అడగకుండానే పదవీవిరమణ వయస్సు 58 నుండి 61 పెంచి, యూనివర్సిటీ అధ్యాపకులకు మాత్రం గుండు సున్నా, దానికి కారణం లేకపోలేదు,అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కేవలం వందలల్లో ఉన్నందుకే శాపంగా మారింది. ఉద్యమ నినాదానికి విరుద్ధంగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల నిధుల కేటాయింపు లేక, నిర్వహణ భారమై,బోధన, బోధనేతర ఉద్యోగాల ఖాలీ ల భర్తీ చేపట్టని క్రమంలో అప్రదిష్టను సంతరింపజేసుకుని తిరుగుబాటుకు కారణం అయ్యిందనే ప్రచారం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పర్యటించి విద్యార్థుల,పరిశోధకుల, అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది సాధక బాధలతో పాటు అక్కడ కావాల్సిన నిర్మాణాత్మకమైన పనుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ నడుం బిగించారు.అందులో భాగంగా 108 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓనమాలు నేర్చుకొని మాజీ ప్రధాని పివి లాంటి ఎందరో మహానుభావులు పేరు ప్రఖ్యాతులు గడించారు, ఉద్యమాలకు కేంద్ర బిందువుగా చేసుకొని ఎందరో నాయకులు ఎదిగినా.. తన మాతృ సంస్థకు ఎదో చేయాలనే ప్రయత్నం చేయలేదు. 20 సంవత్సరాలలో విశ్వవిద్యాలయాల ముఖం చూడని ముఖ్యమంత్రులు ఉన్నారు, అటువంటిది సీఎం రేవంత్ ఉద్యమాల గడ్డ మీద అడుగుపెట్టి సంచలనం అయ్యారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంత మైన ఆయుధం విద్య మాత్రమే అని బలంగా నమ్మిన ఆయన ఒక విజన్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని కాలగర్భంలో కలిసి పోనీయకుండా సీనియర్ల సేవలు అవసరం అని, పదవీవిరమణ వయస్సు 60 నుండి 65కి పెంచింది.గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధుల కొరత లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాన్ ఫర్డ్ , ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో పోటీపడే విధంగా ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం సాహసోపేత నిర్ణయాన్ని విద్యార్థిలోకం స్వాగతిస్తున్నది. మంచి తలరాతను మార్చేది కేవలం విద్య కానీ నమ్మిన సీఎం రేవంత్ ఖాలీ గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు న్యాయపరమైన చిక్కులు లేకుండా జరగాలంటే ‘సూపర్ న్యూమరీ’ కింద ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ‘ యూజీసీ టైం స్కేల్’ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. అప్పుడే విద్య,పరిశోధన ప్రమాణాలు పెరిగి ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది.





