స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు…
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 6:ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తొలి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేశారు. వేద మంత్రాలు మంగళవాయిద్యాల నడుమ సహస్రనామాలను పారాయణం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ పుష్పాలతో లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామిని, అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు నిత్య కల్యాణోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.





