విద్యుత్‌ ‌బస్సుల్లో చార్జీల బాదుడు..

ఈవీ బస్సులకు పన్ను మినహాయింపు.. ఇంధన ఖర్చు లేదు..
మరి అదనపు చార్జీలు ఎందుకంటున్న ప్రయాణికులు
లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ ‌బస్సుల్లో రూ.10 నుంచి 20వరకు అదనంగా వసూలు

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : వరంగల్‌ ‌రీజినల్‌ ‌లో నడుస్తున్న ఎలక్ట్రికల్‌ ‌బస్సుల్లో చార్జీల బాదుడుపై విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. గ్రీన్‌ ‌టాక్స్ ‌పేరుతో ప్రయాణికులపై అదనపు భారం మోపడాన్ని  ప్రయాణికులు తప్పుబడుతున్నారు. ఎలక్ట్రిక్‌ ‌బస్సులకు పన్ను మినహాయింపు ఉండడంతో పాటు ఫ్యూయల్‌ ‌ఖర్చు ఉండదు.. కాబట్టి  డీజిల్‌ ‌బస్సు ఛార్జీల కంటే  తక్కువ ఉంటాయని భావించిన ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. డీజిల్‌ ‌బస్సులతో పోల్చితే 10 నుంచి 20 రూపాయల అదనపు చార్జీల వసూలు చేస్తుండడం ఇప్పుడు ప్రయాణికులకు మింగుడు పడడంలేదు.

ఇటీవల కొత్త ఎలక్ట్రికల్‌ ‌బస్సుల రాకతో వరంగల్‌ ‌రీజియన్‌ను వేధిస్తున్న బస్సుల కొరత సమస్య తీరింది. కానీ, ఎలక్ట్రిక్‌ ‌బస్సు చార్జీలు ప్రయాణికులకు భారంగా పరిణమించాయి. కొత్తగా అందుబాటులోకి వొచ్చిన ఎలక్ట్రికల్‌ ‌బస్సులో డీజిల్‌ ‌బస్సులతో పోల్చితే 10 నుంచి .20 రూపాయలు అదనపు చార్జీల వసూలు వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతుంది. పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌ ‌బస్సులకు ప్రభుత్వం పన్నుల మినహాయింపు ఇచ్చినా… డీజిల్‌ ‌ఖర్చు లేకపోయినా ఎలక్ట్రికల్‌ ‌బస్సుల్లో అదనపు  చార్జీల భారం మోపడమేమిటని పలువురు ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

వరంగల్‌ ‌రీజియన్‌కు 112 ఎలక్ట్రిక్‌ ‌బస్సులు
వరంగల్‌ ‌రీజియన్‌ ‌లో కాలం చెల్లిన బస్సులను సంఖ్య పెరిగింది. మరోవైపు  మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ ‌బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ ‌రీజియను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్‌ ‌బస్సులు కేటాయించింది. .రీజియన్‌కు కేటాయించిన 112 బస్సుల్లో ఇప్పటివరకు 75 బస్సులు చేరాయి. మొత్తం 112 బస్సుల్లో 19 సూపర్‌ ‌లగ్జరీ బస్సులు, 18 డీలక్స్ ‌బస్సులు, 75 ఎక్స్‌ప్రెస్‌ ‌బస్సు లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 75 బస్సులు వొచ్చాయి.

ఇందులో 19 సూపర్‌ ‌లగ్జరీ, 16 డీలక్స్ ‌బస్సులు, 40 ఎక్స్ ‌ప్రెస్‌ ‌బస్సులు ఉన్నాయి.. ఎలక్ట్రిక్‌ ‌బస్సుల రాకతో వరంగల్‌ ‌రీజియన్‌లో  బస్సుల కొరత కాస్త తీరింది. ప్రస్తుతం హనుమకొండ, హైదరాబాద్‌ ‌మధ్య ఎలక్ట్రిక్‌ ‌బస్సులు జేబీఎం సంస్థ నిర్వహణలో సూపర్‌ ‌లగ్జరీ, డీలక్స్ ‌బస్సులు నాన్‌ ‌స్టాప్‌ ‌సర్వీసులుగా  ఎలక్ట్రిక్‌ ‌బస్సులు నడుస్తున్నాయి. ఈవీ బస్సుల రాకతో సంక్రాంతికి బస్సుల కొరత ఇబ్బంది తొలగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఎలక్ట్రికల్‌ ‌బస్సుల ఛార్జీలపై ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రీన్‌ ‌టాక్స్ ‌పేరుతో అదనపు బాదుడు.. డీజిల్‌ ‌బస్సులను మించి వసూలు చేయడంపై ప్రయాణికులు భగ్గుమంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page