బి(టి)ఆర్‌ఎస్ పార్టీ మరో పార్టీలో విలీనమన్నది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్న ప్రచారం కాదు. ఇంతకాలంగా కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ను బంతాట అడుకుంటూ వొచ్చాయి. బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో కలుస్తుందని బిజెపి ఆరోపిస్తే, బిజెపిలోనే కలుస్తుందని కాంగ్రెస్ వాదిస్తూ వొచ్చాయి. అయితే తాజాగా బహిర్గతమైన కవిత లేఖ ఈ చిక్కుముడిని విప్పినట్లైంది. బిఆర్‌ఎస్‌ను బిజెపిలో కలిపేందుకు 101 శాతం బిఆర్‌ఎస్ సిద్దపడిందని ఆమె ఆ లేఖలో తీవ్ర ఆరోపణ చేయడంతో కాంగ్రెస్‌కు ఈ రెండుపార్టీలను విమర్శించేందుకు రాజకీయాస్త్రం దొరికినట్లైంది. దిల్లీ లిక్కర్ కేసులో కవిత జైల్‌శిక్ష అనుభవిస్తున్న రోజుల్లోనే బిజెపిలో తమ పార్టీ విలీన ఆలోచన మొదలైందని, దాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించడంవల్లే బిఆర్‌ఎస్ నుండి తనను దూరంచేసే కుట్ర మొదలైనట్లు కవిత లేఖానంతరం జరిగిన పరిణామాలపై గత రెండురోజులుగా మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో పేర్కొన్న తీరు తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాన్‌గా మారింది. అయితే నిజంగానే బిఆర్‌ఎస్ బిజెపిలో విలీనం అవుతుందా లేదా అన్న విషయాన్ని పక్కకుపెడితే బిఆర్‌ఎస్ పార్టీ మరోపార్టీలో విలీనమన్న అంశం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందే పుట్టిన ప్రచారం .
ప్రత్యేక తెలంగాణరాష్ట్రం కోసం 2001లో టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. అప్పటినుండి పద్నాలుగు ఏళ్ళపాటు ఉద్యమాన్ని తీవ్రతరంగా కొనసాగించింది. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధినేతల నుండి తెలంగాణకు మద్దతుగా లేఖలను సేకరించింది. అయినా నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. తాము రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా ఆ క్రెడిట్ ఉద్యమపార్టీ టిఆర్‌ఎస్‌కు పోతుందన్న అభిప్రాయం కాంగ్రెస్‌కు ఉన్నట్లు అయితే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికైనా తాను సిద్దమేనని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నాడు ప్రకటించారు. అయితే రెండు తెలుగురాష్ట్రాల్లో తామే తిరిగి అధికారంలోకి వొస్తామని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం కెసిఆర్ మాటను పెద్దగా పట్టించుకోలేదు. కాని, కొత్త రాష్ట్రంలో మొదటిసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అధికారంలోకి వొచ్చింది మొదలు కెసిఆర్ విలీనం మాట నిలుపుకోవాలంటూ కాంగ్రెస్ వెంటపడింది. దాంతోపాటు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న మాటకూడా తప్పాడంటూ కాంగ్రెస్ దుయ్యబడుతూ వొచ్చింది. తానిచ్చిన ఆఫర్‌పై కాంగ్రెస్ వెంటనే స్పందించకపోవడం ఒకటైతే, షరతులతో కూడిన తెలంగాణ ఇవ్వడం వల్ల ఈ ప్రాంత హక్కులను కాపాడగలిగే సమర్థ నాయకత్వం అవసరమంటూ ఆ రెండు అంశాలను టిఆర్‌ఎస్ దాటవేసింది.
దశాబ్ధకాలం అధికారంలో కొనసాగిన టిఆర్‌ఎస్ అనంతరకాలంలో బిఆర్‌ఎస్‌గామారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. అయితే బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై బిజెపి, కాంగ్రెస్‌పార్టీలు మూకుమ్మడిగా దాడిచేయడం, కవిత దిల్లీ లిక్కర్ స్క్యామ్ తదితర ఆరోపణలతో అపార్టీ అధికారానికి దూరమైంది. పార్టీనేతలు కూడా పలువురు దూరమయ్యారు . ఇప్పుడు అదే వరుసలో కవిత చేరింది. పార్టీ రజతోత్సవసభపైన తన అభిప్రాయాలను తండ్రి కెసిఆర్‌తో పంచుకునేక్రమంలో రాసిన లేఖ బహిర్ఘతం అవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. కెసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాలే ఇందుకు కారకులుగా ఆరోపిస్తున్న కవిత వరుసగా రెండురోజులుగా మీడియాతో జరుపుతున్న చిట్‌చాట్‌లో పరోక్షంగా తన అన్న కెటిఆర్‌ను టార్గెట్ చేయడం గమనార్హం. ఇదే క్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ విలీనాంశం పెద్ద చర్చకు దారితీసింది. కేవలం పార్టీ ముఖ్యనాయకుల మధ్య జరుగాల్సిన చర్చ బజారునపడడంతో బిఆర్‌ఎస్ పార్టీ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇరవై అయిదు సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాలను శాసించిన బిఆర్‌ఎస్, పద్నాలుగు సంత్సవరాల నిర్విరామ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించింది.
పదేండ్ల పాటు ప్రభుత్వాన్ని ఏలిన ఈ పార్టీ కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే మరో పార్టీలో విలీనం కావాల్సినంతగా దిగజారటమేంటన్నది తెలంగాణ ప్రజలకు అంతుపట్టకుంది. అది కూడా అధికారంలో కొనసాగుతున్నంతకాలం ద్వేశిస్తూ వచ్చిన బిజెపిలో పార్టీని కలపడమేంటని పార్టీ శ్రేణులుకూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే దీన్ని బిజెపి వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాల్సిన అవసరం తమకులేదని, ఆలేఖకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. బిజెపి శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ రఘనందన్‌రావు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయడమేకాదు, అధికారంలోకి వొస్తుందని, ఇక బిఆర్‌ఎస్ విఆర్‌ఎస్ తీసుకోవాల్సిందేనన్నారు.
ఆ పార్టీకి చెందిన మరో ఎంపి ఈటల రాజేందర్ ఆ ఆలోచనతో బిఆర్‌ఎస్ ఉండవొచ్చుగాని తమకా ఆలోచనలేదన్నారు. కాగా కవిత కాంగ్రెస్‌లో చేరుతుందని వొస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎంపి చామల కిరణ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత అవసరం తమకులేదని, తమ పార్టీకి బలమైన నాయకత్వం ఉందంటున్నారు. ఇంతకాలంగా బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనంటూ తాము చేసిన వాదనలో వాస్తవమున్నదన్న విషయం కవిత లేఖ ద్వారా స్పష్టమైందన్నారు. దీంతో కెసిఆర్ నిజస్వరూపం బయటపడిందని ఆపార్టీ విప్ బీర్ల అయిలయ్య అంటున్నారు. అసలు బిబెపిలో ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నారన్న విషయాన్ని ఆ పార్టీ బహిర్ఘతం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్ సీనియర్‌నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తమపార్టీ మరే ఇతర పార్టీలో విలీనం కాదుకదా ఆ పార్టీలతో కనీసం పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా తమకు లేదని స్పష్టం చేశారు.
