నేలకొరిగిన “మహా వృక్షం”

ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12: ‌మొక్కలే శ్వాసగా…మొక్కలే జీవితంగా..మొక్కలే ప్రాణంగా బతికిన ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య శనివారం ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్‌ ‌మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేసిన ఆయన రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. రామయ్య సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా ఇద్దరు కుమారులు ఇప్పటికే వివిధ కారణాలతో చనిపోయారు. రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి జనం భారీగా తరలి వచ్చారు.

బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపీ సంతోష్‌, ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సహా పలువురు రాజకీయ నేతలు రామయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. 1937, జూలై 1న దరిపెల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు రామయ్య జన్మించారు. ఆయన ఇంటి పేరు దరిపల్లి రామయ్య అయినప్పటికీ వనజీవిగా మార్చుకున్నారు. ఆయనను చెట్ల రామయ్య అని కూడా పిలుస్తారు. 50 ఏండ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండే వారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది.

అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నది.రామయ్యకు భార్య జానమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. నాలుగు దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వొచ్చారు. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టారు. ఒకామె పేరు చందనపుష్ప, ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కుబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు. కోటికిపైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇం‌డియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005లో సెంటర్‌ఫర్‌ ‌డియా సర్వీసెస్‌ ‌సంస్థ నుంచి మనమిత్ర అవార్డులో ఇచ్చింది. యూనివర్సల్‌ ‌గ్లోబల్‌ ‌పీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ‌ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి మన సేవా అవార్డు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page