కెసిఆర్‌ చుట్టే తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయమంతా కెసిఆర్‌ చుట్టే పరిభ్రమిస్తున్నది . గడచిన రెండు సంవత్సరాలుగా ఆయన తన వ్యవసాయ క్షేత్రానికే  పరిమితమైనప్పటికీ రాజకీయనాయకులు నోట్లో నిత్యం ఆయన నామస్మరణే వినిపిస్తున్నది . ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ అయితే ఆయన పేరు ఎత్తని రోజంటూ లేదు. ఎక్కడ సభ, సమావేశాలు జరిగినా కెసిఆర్‌ పేరు ఎత్తకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెల్లారడంలేదు. తాజా శాసనసభ సమావేశాల తేదీలు ప్రకటించిన తర్వాత యావత్‌ మీడియా కూడా ఆయన గురించిన విషయాల పైనే చర్చోపచర్చలు సాగించాయి. ఈ సారైనా కెసిఆర్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా లేదా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారపక్షంతో పాటు, స్వపక్ష నేతలకు కూడా నిజంగానే కెసిఆర్‌ ఈసారైనా అసెంబ్లీకి హాజరు అవుతారా లేదా అన్న సంశయం ఉండింది . కాని, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కెసిఆర్‌ హాజరవడమన్నది ఓ మహత్కార్యంగా మారింది. ఎర్రవెల్లి నుండి నందినగర్‌ నివాసానికి కెసిఆర్‌ బయలుదేరినప్పటినుండి క్షణక్షణం మీడియా కెమెరాలు ఆయన వెంటే తిరుగుతూ రావడం చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో ఆయనకున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

అక్కడి నుండి దాదాపు తొమ్మిది నెలల తర్వాత అసెంబ్లీ ముందు ఆగిన కెసిఆర్‌ కారు చుట్టూ వీడియో, కెమరా జర్నలిస్టులు చేసిన హడావుడి  అంతా ఇంతా కాదు. కెసిఆర్‌ అసెంబ్లీకి చేరుకోవడంతో ఇక సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగుతాయని అందరూ భావించారు. కాని, అందరి ఆలోచనలు తలకిందులయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో ఆయన ముచ్చటగా మూడు నిమిషాలకు మించి తన స్థానంలో కూర్చోకపోవడం ప్రధానంగా అధికార పార్టీకి తీవ్ర నిరాశ కలిగించింది. అందులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశ నిరాశ అయింది. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్‌ అసెంబ్లీకి వొస్తే, ఆయన పాలనాతీరును ఆయన సమక్షంలోనే కడిగి పారేయాలని సిఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్న విషయం తెలియంది కాదు. చాలా కాలంగా ఆయన కెసిఆర్‌ను అసెంబ్లీకి రావాలంటూ ఆహ్వానిస్తూనే ఉన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన నీటి పధకాలు ముఖ్యంగా కాళేశ్వరాన్ని తీసుకుని నిండు సభలో దోషిగా నిలబెట్టాలనుకున్న ఆయన ఆశయం నెరవేరకుండా పోయింది. ఒక విధంగా తాను అనుకున్న అవకాశం వొచ్చినట్లే వొచ్చి చెయ్యి జారిపోయినట్లైంది.

 ఊహాతీతంగా కెసిఆర్‌ మూడు నిమిషాల్లోనే అక్కడి నుండి నిష్క్రమించడంతో అధికారపార్టీతోపాటు బీజేపీ కూడా నిరుత్సాహపడింది  . కెసిఆర్‌ ఉన్న ఆ కొద్దిపాటి సమయంలోనే మరో అనూహ్య సంఘటన పలువురిని ఆశ్చర్యపర్చింది. సిఎం హోదాలో సాక్షాత్తు రేవంత్‌రెడ్డి కెసిఆర్‌ కూర్చున్న చోటికి వొచ్చి ఆయనకు నమస్కరించి, యోగక్షేమాలు అడగటం ఒక విచిత్ర సంఘటనే. అంతకు క్రితం రోజు వరకు కెసిఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన రేవంత్‌రెడ్డి  ఆలా పలుకరించడాన్ని సభామర్యాదగా చెప్పుకున్నప్పటికీ, కెసిఆర్‌ విషయంలో ముఖ్యమంత్రి వాడిన పదజాలంపట్ల పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా ఎంతటి శత్రువునైనా ఏ వ్యక్తీ చావు కోరుకోరని, అలాంటిది ముఖ్యమంత్రి మెడకు బండకట్టుకుని నీళ్ళలో మునిగి చావమని, తాను అధికారంలోకి రాగానే తొంటి విరిగిందంటూ శాపనార్థాలు పెట్టిన వ్యక్తి అసెంబ్లీలో పలకరించినంత మాత్రాన మాటలు మాసిపోవు .. వాటన్నిటి దృష్ట్యానే అసెంబ్లీ ప్రారంభమైన మూడునాలుగు నిమిషాలకు కెసిఆర్‌ అక్కడినుండి వెళ్ళిపోయి ఉంటారంటున్నారు. అయితే నీటి ప్రాజెక్టులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను అసెంబ్లీ తిరిగి ప్రారంభమయ్యే జనవరి ఒకటిన చేపట్టనుంది. ఆ రోజున కెసిఆర్‌ సభలో ఉంటారా లేదా అన్నది కూడా ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. మొత్తానికి కెసిఆర్‌ అసెంబ్లీకి వొచ్చినా, రాకున్నా ప్రజల్లో నిత్యం స్మరణీయ వ్యక్తిగా మిగిలిపోతున్నారు. దానికి తగినట్లు అధికారపార్టీ నిత్యం చేస్తున్న ఆరోపణలు కూడా కెసిఆర్‌ పేరు ప్రజల్లో నానడానికి కారణమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page