రాజకీయ రాసపట్టు లో తెలంగాణ..!

“ఇదిలా ఉండగా అధికారపక్షం కాంగ్రెస్ లో ఐక్యత కానరావడం లేదు.గత ముఖ్యమంత్రులులా క్యాబినెట్ మీద పూర్తి నియంత్రణను ఎందుకో రేవంత్ రెడ్డి సాధించలేకపోతున్నారు. పార్టీకి, ప్రభుత్వం కు మధ్య సమన్వయం పేరుతో అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మరో అధికార కేంద్రంగా కనిపించి రెవంత్ రెడ్డి ని బలహీనపరుస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ వైరుధ్యాన్ని బాగా వినియోగించుకునే స్థితి కనిపిస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి తెలుగు రాష్ట్రం లో రాజకీయంగా తప్పటడుగు వేసి పదేపదే ముఖ్యమంత్రులను తోలుబొమ్మలాటలా మార్చడం వలన విసుగు చెందిన తెలుగు ప్రజలు అనూహ్యం గా ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశంకు ఆత్మగౌరవం నినాదంతో అధికారం కట్టబెట్టారు.అందులో తెలంగాణా ప్రజలు అప్పుడు..”

అధికారపక్షంపై అసమ్మతి, అసంతృప్తి!-పరేశాన్ లో ప్రతిపక్షం!?

– ఎన్.తిర్మల్,
( సీనియర్ జర్నలిస్టు, రచయిత,సామాజిక కార్యకర్త)
 సెల్ : 9441864514,
ఇమెయిల్: thirmal.1960@gmail.com

రాను రాను తెలంగాణా రాజకీయాలు మంచి రసపట్టు లోకి జారుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా మరో రెండు నెలల్లో రెండేళ్ళ కాలపరిమితి ముగుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజల్లో అసంత్రృప్తి గూడు కట్టుకుంటుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిపాలనా ఏకత్వం సాధించడంలో వైఫల్యం అసమ్మతి రూపం లోఅంతర్గతంగా రగులుతుంది.ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత స్థిరత్వం పొందడంలో ఊగిసలాట కనిపిస్తుంది. గత శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అరుపులు,కేకలు చూసి గానీ, కాంగ్రెస్ నాయకులు గతంలో పరిపాలనా దక్షులు అని ప్రజలు వోటు వేయలేదు? పదేళ్ళుగా బిఆర్ఎస్ పరిపాలనలో పెరిగిన కేసీఆర్ కుటుంబ అతి జోక్యం,ఆహాంకారం, అవినీతి కి వ్యతిరేకంగా మాత్రమే కాంగ్రెస్ కు వోటు వేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారంటీలు,ఎడాపెడా చేసిన వాగ్దానాలు అమలుకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడంలేదు.ఒకవేళ రుణమాపీలాంటి వాగ్దానాలు చేసినా అసంపూర్తిగానే పధకం అమలు జరిపారు.మహాలక్మీ పధకం క్రింద మహిళలలకు రూ.25వేలు ఆర్థిక సహాయం, కళాశాల విద్యార్థినీ లకు స్కూటీ లు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 13వేల ఆర్థిక సహాయం,నిరుద్యోగులకు 4వేలనిరుద్యోగ భృతి, ఆటో రిక్షా కార్మికులకు ఆర్థిక సహాయం,పెన్షన్ పెంపుదల,కొత్త పెన్షన్లు మంజూరు లాంటి పథకాలు ఊసే ఎత్తడం లేదు. వీటిగురించి ఏనాయకుడు మాట్లాడడం కూడా లేదు. ఇక ఆరుగ్యారెంటీలు అసాధ్యం అనుకున్నారో, ఏమో?

తాజాగా రేవంత్ రెడ్డి లో కేజ్రీవాల్ పరకాయ ప్రవేశం చేశారు.నాణ్యమైన ఉచిత విద్య అందించడం ద్వారా కేజ్రీవాల్ మూడు సార్లు అధికారంలోకి వచ్చారంటున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు..ఆ విషయం ద్వారా మూడవసారి మాత్రమే ఆయన అదికారం చేపట్టారు. నాల్గవసారి ఆ నినాదం పనిచేయలేదు. ప్రజలు ఎప్పటికప్పుడు నూతనత్వం కోరుకుంటారు. అక్కడదాకా ఎందుకు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మంచి విద్యా సంస్కరణ తెచ్చిన జగన్ మోహన్ రెడ్డి ని ప్రజలు ఓడించారు.తెలంగాణాలో యూరియా కొరతతో రైతులు,ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు అసంత్రృప్తి తో ఉన్నారు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ పార్టీ పధకాలన్నింటా ఏదోఒక లోపం శాపంగా కనిపిస్తుంది. ఇంతవరకు రేవంత్ రెడ్డి సొంత ముద్ర గల పధకం ఒక్కటీ లేదు. ఇదిలా ఉండగా అధికారపక్షం కాంగ్రెస్ లో ఐక్యత కానరావడం లేదు.గత ముఖ్యమంత్రులులా క్యాబినెట్ మీద పూర్తి నియంత్రణను ఎందుకో రేవంత్ రెడ్డి సాధించలేకపోతున్నారు. పార్టీకి, ప్రభుత్వం కు మధ్య సమన్వయం పేరుతో అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మరో అధికార కేంద్రంగా కనిపించి రెవంత్ రెడ్డి ని బలహీనపరుస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ వైరుధ్యాన్ని బాగా వినియోగించుకునే స్థితి కనిపిస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి తెలుగు రాష్ట్రం లో రాజకీయంగా తప్పటడుగు వేసి పదేపదే ముఖ్యమంత్రులను తోలుబొమ్మలాటలా మార్చడం వలన విసుగు చెందిన తెలుగు ప్రజలు అనూహ్యం గా ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశంకు ఆత్మగౌరవం నినాదంతో అధికారం కట్టబెట్టారు.అందులో తెలంగాణా ప్రజలు అప్పుడు ఉన్నారనే విషయం కాంగ్రెస్ పార్టీ మరువరాదు..!

మంత్రిగాకూడా గత అనుభవం లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమన్వయం లో తడబడుతున్న జాడలు,ఎవరిని అంటే ఏం జరుగుతుందోననే భయం ఆయన మాటల్లో కనిపిస్తుంది..! ఆయన నోటినుండి పదేపదే అధిష్టానం అనేమాట రావడం కూడా ప్రజలు జీర్ణం చేసుకునే అవకాశం లేదు .జాతీయ పార్టీగా రేవంత్ రెడ్డి కి అనుసరించడం తప్పని స్థితి.అయితే ఏ ముఖ్యమంత్రి వెళ్ళనన్ని సార్లు రేవంత్ రెడ్డి దిల్లీ యాత్రలు కొనసాగుతున్నాయి. గల్లీ యాత్రల్లో ప్రతిపక్షాల అరెస్టులు,బారికేడ్ల తో చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఒకరకంగా రేవంత్ రెడ్డి గల్లీ యాత్రల కంటే దిల్లీ యాత్రలకే ప్రాదాన్యత ఇస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. వాటిలోనే ఆయన స్వేచ్చను వెతుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి ఇన్ని దిల్లీ యాత్రలు చేసినా కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ వ్యతిరేక పక్షం బిజేపి కనుక అంత స్పందన కనిపించడంలేదు. ఒక్కపైసా అదనంగా విదిల్చిన జాడలేదు .ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ లో అధికార పీఠం ఆశించే వారి అంతర్గత రాజకీయ ఫిర్యాదులు, వ్యవహారాల వలన రేవంత్ రెడ్డి పట్ల సహజ సిద్ధమైన అనుకూలత కనిపించడంలేదు. వెరసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనంగా కనిపించేలా ఆపార్టీ వ్యూహం,ఎత్తుగడలే తయారయ్యాయి.

“రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపడం కంటే రాజకీయ పరమైన ప్రతిదాడి చేయడం వలన బిఆర్ ఎస్ వ్యూహాత్మక తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. దిగువ స్థాయిలో ప్రజా సమస్యలపై క్యాడర్ ను కదిలించడం లో ప్రధాన ప్రతిపక్ష వైఫల్యం కనిపిస్తుంది. బిజేపి కూడా తెలంగాణాలో ఎదిగే అవకాశం కనిపించడంలేదు. కేంద్రంలో బిజేపి బలహీన పడుతున్న స్థితి,ఆపార్టీ అనుసరించే విధానాలు ఇప్పటికే ప్రజలు అనుభవిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం లో బలమైన లౌకిక శక్తులు, చరిత్ర ఉండడం కూడా ఆపార్టీకి అధికార స్థాయి రావడం కష్టమే! ఇప్పటికైనా అధికార పక్షం, ప్రతిపక్షం గత ఎన్నికల ఫలితాలు సమీక్షా వైఫల్యమే, ఆత్మ ప్రక్షాళన జరగకపోవడమే ఆపార్టీలకు శాపంగా పరిణమించనుంది.”

అతిగా మాట్లాడడం వలన ఆపార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను పార్టీ నుండి తొలగించారు. మరోవైపు నల్గొండ జిల్లాకే చెందిన మునుగోడు శాసనసభ్యడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించలేదని పదేపదే ముఖ్యమంత్రి ని దూషిస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. మరోమంత్రి శ్రీహరి పదవి ఇచ్చినా అసంత్రృప్తి గా మాట్లాడారు. ఇక నామినేటెడ్ పదవులు కూడా పనిచేసే కార్యకర్తలకు కాకుండా ఆయా మంత్రుల వెంట ఉండి జనంలో లేని నాయకులకే కట్టబెట్టడం వలన వారుకూడా ప్రభావవంతంగా లేరు..ఇక జిల్లాల్లో శాసనసభ్యులు, మంత్రులు మధ్య సమన్వయం లేక బహిరంగ మాటల సవాళ్ళు,యుద్దాలే నడుస్తున్నాయి.మరోవైపు బి ఆర్ ఎస్ నుండి పార్టీ మారిన పదిమంది శాసనసభ్యులు విషయంలో ముఖ్యమంత్రి రాజకీయంగా మల్లా గుల్లాలు పడుతున్న స్థితి కనిపిస్తుంది. ఇక ఎప్పుడో పిసిసి అద్యక్షుడు ను నియమించినా జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గాల ఏర్పాటులో పార్టీముందుకు పోవడంలేదు. ఒకవైపు ప్రజల అసంతృప్తి, మరోవైపు పార్టీ అసమ్మతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇట్లాంటి సమయంలోనే జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, కాంగ్రెస్ పార్టీ కి సవాలుగా , పరీక్షగా ముందు కు వస్తున్నాయి .ఒక వేళ ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మార్చినా కాంగ్రెస్ కు ఇంతకంటే మెరుగైన స్థితి మాత్రం ఇక చాలా కష్టం. ఉన్ననాయకుల్లో కూడా రేవంత్ రెడ్డి కంటే యువతలో,పార్టీలో ప్రబావం చూపగల బలమైన , సమర్థవంతమైన నాయకులు లేనే లేరు..! ఇప్పటికే వారు పలురకాల ఆరోపణలతో బలహీన పడి ఉన్న స్థితి.

పరేషాన్ లోప్రదాన ప్రతిపక్షం?

అధికారపక్షం వైఫల్యాలు అందిపుచ్చుకునే స్థితిలో ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ లేదు.గత ఎన్నికల ఓటమికే ఆపార్టీ ఇంతవరకు సరైన గుణపాఠం తీసుకోలేదు. కాంగ్రేస్ పార్టీ చేసిన వాగ్దానాలకు ప్రలోభ పడి ప్రజలు వోటేశార నే తప్పుడు భావం తోనే ఉన్నారు తప్ప.తమ తప్పిదాలు కప్పిపుచ్చుకొంటూ, ప్రజలు పైనే ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. పాలనలో అతిగా మారిన కేసీఆర్ కుటుంబ జోక్యం,అధికార అహం , దిగువ స్థాయిలో అప్రజాస్వామిక ధోరణులు , అవినీతి మూలంగా కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారని ఆపార్టీ ఇప్పటికీ గుర్తించడం లేదు..! కుటుంబ సభ్యుల జోక్యం ను పూర్తిగా వదిలించి తనే ముందుకు వస్తే! ఈనాటికీ తెలంగాణా ప్రజల్లో కేసీఆర్ ను జనం పైకి ఎత్తుతారు. ఎందుకంటే ఎవరేమనుకున్నా తెలంగాణా రాజకీయ “ఆత్మ “కేసీఆర్ నే!గత పదేళ్ళ కాలంలో రాజకీయ తప్పిదాలు మినహాయిస్తే! తెలంగాణా రాష్ట్ర పురోగమనం కొరకు కేసీఆర్ చేసిన కృషి చిన్నదేమీ కాదు. విద్యుత్ లో స్వయం సమృద్ధి నుండి రైతు బంధు,దళిత బంధు,కల్యాణలక్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలతోపాటు తెలంగాణా ప్రజలు గర్వించేలా సచివాలయం, తెలంగాణా స్మారక భవనం,అంబేడ్కర్ విగ్రహం తో పాటు తెలంగాణాకు గుండె కాయ లాంటి హైదరాబాద్ అభివృద్ధి లో తనదైన ముద్ర చూపించారు.ఇప్పటికే ఓటమికి కారణం అయిన కుటుంబ జోక్యం ఓటమి తర్వాత కూడా అదే కొనసాగించే పరిస్థితి పార్టీలో ఉంది.కుటుంబజోక్యం ముదిరిపాకానపడి స్వయంగా కేసీఆర్ కూతురు కవిత నే పార్టీ నుండి తొలగించారు.

ఇకపోతే శాసన సభలోపల,బయట కేటీఆర్,హరీష్ రావు తప్ప మరో నాయకుడు ఆపార్టీ నుండి మాట్లాడే పరిస్థితి పార్టీలో లేదు. ఒక్క జగదీష్ రెడ్డి తప్ప!బిఆర్ యస్ దిగువ స్థాయి కేడర్ పరేశాన్ గా ఉంది.కుటుంబ జోక్యం పట్ల ఆత్మవిమర్శ లేకుండా,కుటుంబేతరనేతల రాజకీయ ప్రాదాన్యత పార్టీలో కనిపించకుండా ,కాంగ్రెస్ వైఫల్యం తమకు కలిసి వస్తుంది అనుకుంటే మరోమారు బిఆర్ఎస్ తప్పులో కాలేసినట్టే? కేసీఆర్ వ్యూహత్మక మౌనం కూడా ఆపార్టీకి శాపం అయ్యింది. ఒకరకంగా కేసీఆర్ మాట్లాడకపోవడం,జనంలోకి రాకపోవడం వలన కేటీఆర్,హరీష్ రావు పాత్ర పార్టీలో అతిగా కనిపిస్తుంది.ఇప్పటికీ తెలంగాణా సమాజం కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతుంది కానీ ఆయన కుటుంబానికి కాదు అనే విషయం సుస్పష్టం. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపడం కంటే రాజకీయ పరమైన ప్రతిదాడి చేయడం వలన బిఆర్ ఎస్ వ్యూహాత్మక తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. దిగువ స్థాయిలో ప్రజా సమస్యలపై క్యాడర్ ను కదిలించడం లో ప్రధాన ప్రతిపక్ష వైఫల్యం కనిపిస్తుంది. బిజేపి కూడా తెలంగాణాలో ఎదిగే అవకాశం కనిపించడంలేదు. కేంద్రంలో బిజేపి బలహీన పడుతున్న స్థితి,ఆపార్టీ అనుసరించే విధానాలు ఇప్పటికే ప్రజలు అనుభవిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం లో బలమైన లౌకిక శక్తులు, చరిత్ర ఉండడం కూడా ఆపార్టీకి అధికార స్థాయి రావడం కష్టమే! ఇప్పటికైనా అధికార పక్షం, ప్రతిపక్షం గత ఎన్నికల ఫలితాలు సమీక్షా వైఫల్యమే, ఆత్మ ప్రక్షాళన జరగకపోవడమే ఆపార్టీలకు శాపంగా పరిణమించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *