తెలంగాణ పట్టెడ కోయ సాహిత్యం

పెళ్ళికోసం ఇంటిని నాలుగుగదులుగా విభాగం చేస్తారు. అనగొంది (వూజగది) పెల్ గొంది (పెళ్లిగది) వంటగది మరియు అరుగు. అనగొందిలోకి ఇంటి ఆడపడుచులను అనుమతించరు. వూర్తిగా నిషేదం అంటారు వరలక్ష్మి.

image.png

కుంజ వరలక్ష్మి సాంస్కృతిక పరిశోధకురాలు. ‘తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన కళాకారులు డాక్యుమెంటేషన్’ ప్రాజెక్టు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ప్రాజెక్ట్ ఫెలోగా అనేక గిరిజనగ్రామాలు తిరిగారు. తన అస్తిత్వమైన పట్టెడ కోయసంస్కృతిని తనే చాటుకోవాలని ‘పట్టెడ కోయ సంస్కృతి సంప్రదాయాలపై అధ్యయనం’ అంశంగా ఆచార్య బట్టు రమేష్ పర్యవేక్షణలో 2021 – 2024 లో ఎంఫిల్ చేశారు. గిరిజనుల మౌఖికసాహిత్యం ఒకతరం నుంచి మరొకతరానికి గేయాలు కథలు, సామెతలు జాతీయాలు పొడుపుకథలు వంటి అనేకరూపాల్లో దాని చెలిమిలో ఊరుతుంటాయి. వాటి అందచందాలు, విశిష్టత గిరిజనేతర సమాజాలకు తెలియవలసిన అవసరం ఉంది. అక్షరగ్రంథం లేని కొండకోనల్లో గిరిజనులు అల్లే నోటిమాట సాహిత్యమై పరిమళాలని విశ్వవ్యాప్తం చేస్తుంది. అలా అవ్వాలంటే పరిశోధనలు చాలా సాయపడతాయి. కనుక విశ్వవిద్యాలయాలలో గిరిజన మౌఖిక సాహిత్యంమీద విస్తృతమైన పరిశోధనలు జరగాలి, వాటన్నిటిని నిక్షిప్తం చేయాలి, అంతేకాకుండా ఆయా పరిశోధనా గ్రంథాలను వెలుగులోకి తీసుకరావాలి.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 35 గిరిజన తెగలున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో 12 తెగలున్నాయి. వారందరి వేషభాషలు, సంస్కృతి సంప్రదాయాలు, జీవనవిధానం ఆచార వ్యవహరాలు వైవిధ్య భరితంగా ఉంటాయి. కుంజ వరలక్ష్మి తన పరిశోధనను ఈ కోణంలోనే మొదలుపెట్టి తగినపద్దతులను అనుసరించారు. ఎంపిక చేసుకున్న ఉమ్మడి ఖమ్మంజిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్నగ్రామాల్లో పరిశోధనాంశాలకి సంబంధించిన ప్రశ్నావళితో అక్కడివారిని కలిసి వారితో మమేకమై కావల్సిన మౌఖిక విజ్ఞానాన్ని సంస్కృతిని సాహిత్యాన్ని తెలుసుకోగలిగారు.

ఈ సిద్ధాంత వ్యాసాన్ని నాలుగు అధ్యయనాలలో రూపొందించుకొని పరిశీలన చేశారు. మొదటి రెండు అధ్యాయాలలో భారతదేశం జాతులు ఉపజాతుల పరిచయం, పట్టెడ కోయ సామాజికనిర్మాణం, నిర్వచనం, వర్గీకరణ వ్యాప్తిని తెలియజేశారు. మూడవ అధ్యాయంలో పట్టెడ కోయ జీవనవిధానం నాలుగో అధ్యాయంలో పట్టెడ కోయ మౌఖిక సాహిత్యం ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు కోయల సాంఘికాచారాలను చెప్పారు. పట్టెడ కోయ మౌఖిక సాహిత్యం చుట్టూ పరచుకున్న సామాజిక ఆర్థిక సంస్కృతిక విశేషాలను మనకు అందించే ప్రయత్నం చేశారు. జానపద సాహిత్యం తీరుగానే పట్టెడ కోయ మౌఖిక సాహిత్యం దాదాపుగా అవే లక్షణాలను కలిగి ఉన్నాయి అంటారు వరలక్ష్మి.

ఈ గ్రంథంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లి సమయంలో ఇంటికి రెండుకేజీల బియ్యం రెండుసీసాల చొప్పున ఇప్పసారా పంచుతారు. ఆరోజుల్లో అందరూ అక్కడే భోజనాలు చేస్తారు. పెళ్ళికోసం ఇంటిని నాలుగుగదులుగా విభాగం చేస్తారు. అనగొంది (వూజగది) పెల్ గొంది (పెళ్లిగది) వంటగది మరియు అరుగు. అనగొందిలోకి ఇంటి ఆడపడుచులను అనుమతించరు. వూర్తిగా నిషేదం అంటారు వరలక్ష్మి. కోయల్లో మేకలకు కోళ్ళకు పందులకు పశువులకు కూడా వేరువేరుగా ఇంటికి దగ్గరలో గుడిసెలు నిర్మిస్తారు. ఇంటిపందిరి వేసేటప్పుడు ఒకపాట పాడుకుంటారు. “రేలా రేలా రేలా రేలా రేరేలా రేలా/ తూర్పు కూపు దాయారు/ తూర్పు తంబం తత్తారు/ మద్దిని కోసి తత్తారు/ బనుంకోసి తత్తారు.” ఈ విధంగా కోయ సంప్రదాయబద్దంగా తమ ఇండ్లను నిర్మించుకుంటారు.

కోయల్లో పచ్చపండగను సెప్టెంబర్ అక్టోబర్లలో జరుపుకొంటారు. వారంరోజులు ముందుగా ఏ రోజు చేయాలో గ్రామపెద్దలు నిర్ణయిస్తారు. ఆకుకూరలు కూరగాయాలు గోంగూర సామ బీరకాయలు సొరకాయలు మొదలైవి ముందుగా వంటకు వస్తాయి. ఇవి కోయడానికి పండగలు చేస్తారు. పండుగ చేయకుండా కోసినట్లయితే ఆవులను మేకలను పులి తింటుంది అని వారినమ్మకం. స్త్రీలు పండుగకు ముందు ఇంటిని శుభ్రంగా ఎర్రమట్టితో అలుకుతారు గిరిజనగూడాల్లో పూజారి అన్నీ శుద్ధిచేసి ఇచ్చిన పసుపు కుంకమాదులతో వారిఇంటిని అలంకరిస్తారు.

ఆ సంవత్సరం మొదటగా పండిన ఆకుకూరలు కూరగాయల కోసమే ఈ పండగ నిర్వహిస్తామని అంటారు.
భూమి పండగ అనేది కోయజాతికి ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీనిని జూన్ నెలలో నిర్వహిస్తారు.  దీనికి వారిభాషలోన ‘విజ్ఞు పండుగ’ అంటారు. ఈ పండగ చేసిన తరువాత భూమిమీద విత్తనాలు చల్లుతారు. ప్రతిగ్రామంలో మూడునుండి ఐదురోజుల పాటునిర్వహిస్తారు. పండగ అనంతరం ఎవరి పొలాలకు వారువెళ్లి ఒకకోడిని బలిచ్చి భూమినిదున్ని విత్తనాలు చల్లుతారు అప్పుడు ఒకపాట పాడుతారు. “రేలా రేలా రేరేలా రేలా రేలా/ ఓ చందమామయ్యో పోద్దయ్య యోల్లాడు వేట/ ఓ చందమామయ్యో శరభయ్య దుప్పిని తూనకాల్/ పోచందామామయ్యో దేశయ్య యోళ్ళాడు వేటాడు” ఈవిధంగా భూమిపండగను తమపంటలు బాగా పండాలని దేవతలను భూమితల్లిని కొలుచుకుంటూ చేసుకుంటారు.

కోయ తెగ విజ్ఞానం పట్టెడ కోయసంస్కృతి, సాహిత్యం జీవననది వంటిది. ఎన్నితరాలైనా ఇంకిపోని మౌఖికసంపద వారిసొంతం నిజానికి వాటిని సృష్టం చేసేది ఆదివాసీలే అయినా ఆ సంస్కృతిలోని మాధుర్యం సొందర్యం ప్రతి ఒక్కరు ఆస్వాదించదగ్గది. ఆదివాసి గిరిజనసమాజంలో అనేక సంస్కృతి సంప్రదాయాలు సాహిత్యం ప్రత్యేక అలవాట్టు అచారాలు గల పట్టెడ కోయ బిడ్డల జీవన సౌందర్యాన్ని ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేసిన కుంజ వరలక్ష్మికి శుభాకాంక్షలు. ఈ గ్రంధాన్ని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ముద్రించినందుకు అభినందనలు.

-శోభ రమేష్,
కాకతీయ విశ్వవిద్యాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *