స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు జరుపాలని సోమవారం జరిగిన క్యాబ్‌నెట్ సమావేశంలో నిర్ణయించింది. అయితే ఈ ఎన్నికల్లో బీసీలకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానంచేసి గవర్నర్ ఆమోదానికి పంపినప్పటికీ దానిపైన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగడం, కొందరు దీనిపై హైకోర్టుకు వెళ్ళడం, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై జారీచేసిన ఆర్డినెన్స్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం పెద్ద గందరగోళానికి దారితీసింది.
ఈ వివాదం ఇప్పుడప్పుడే తేలేట్లులేదు. అప్పటివరకు పంచాయితీ ఎన్నికలను వాయిదా వేయడం సాధ్యం కాదు. ఇప్పటికే పంచాయితీల్లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా ఆలస్యం చేసే పక్షంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు మూడువేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడనుంది. ఇప్పటికే పంచాయితీల్లో నిధులు లేక గ్రామాభివృద్ది కుంటుపడుతున్నది. స్థానికంగా చేపట్టాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.
తమ గ్రామాలను అభివృద్ధి పర్చుకునే క్రమంలో గత సర్పంచ్‌లు అప్పులుచేసి పనులు చేపట్టారు. వారు చేసిన పనులకు సంబందించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో, అప్పుల బాధ పడలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటే, మరి కొందరు తమ మహిళలపై ఉన్న బంగారాన్ని, ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడమన్నది అత్యంత అవసరం. దీంతో వొచ్చేనెల రెండవ వారంలో ఎన్నికలు జరుపాలని క్యాబినెట్ అభిప్రాయపడింది.
అయితే ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్‌లకు చట్టబద్దత ఏర్పడకపోవడంతో, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో కనీసం తమ పార్టీ పరంగానైనా 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను అమలు పర్చాలని క్యాబినెట్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో బీసీ ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యం లో అవసరమైతే 42 కు మించి 60 శాతం వరకు కూడా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి పంచాయితీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేవే అయినా, రాష్ట్రంలోని అన్ని పార్టీల పక్షాన అభ్యర్ధులు పోటీ చేయడమన్నది సాధారణంగా జరుగుతున్న విషయం.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్ళు కావస్తున్నది. దీంతో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 15లోపు పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యంగా డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను అవిష్కరించిన అనంతరం పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వొచ్చే అవకాశముంది.





