మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో ప్ర‌భుత్వం నిర్మించాల‌నుకుంటున్న గాంధీ విగ్రహం పేరుతో మ‌ధు పార్క్ రిట్జ్ గేటెడ్ క‌మ్యూనిటీలోని అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ను కూల‌గొట్టాల‌ని నిర్ణ‌యించ‌డం ఒకటి కాగా రెండ‌వ‌ది ఖ‌మ్మం లోని వెలుగుమ‌ట్ల వినోభా న‌గ‌ర్ లో నిరుపేద‌ల ఇళ్ల‌ను కూల‌గొట్ట‌డం. మ‌ధు పార్క్ రిట్జ్ అపార్ట్ మెంట్ కాంప్లె క్స్ లో 400-500 కుటుంబాలు నివ‌సిస్తున్నారు. వీరిలో అత్య‌ధికులు డిఫెన్స్, రిటైర్డ్ ఉద్యోగులు, సీనియ‌ర్ సిటిజ‌న్లు! నిరుపేద‌ల కోసం పాటుప‌డిన గాంధీజీ ప్రాజెక్టు పేరుతో 400-500 కుటుంబాల‌ను ఏకంగా రోడ్డున ప‌డేసే ప్రక్రియ‌కు తెర‌లేప‌డం, రేవంత్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అనాగ‌రిక చ‌ర్యేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

2007లో ఈ కాంప్లెక్స్ నిర్మించిన‌ప్ప‌డు మూసీ రివ‌ర్ ఫ్రంట్ బ‌ఫ‌ర్‌జోన్ 12 మీట‌ర్లు మాత్ర‌మే ఉండేది . అందువ‌ల్ల దానికి ఇబ్బంది క‌లుగ‌కుండా అప్ప‌టి నిబంధన‌ల‌కు అనుగుణంగా, చ‌ట్ట‌ప‌ర‌మైన అన్నిర‌కాల క్లియ‌రెన్స్ లు తీసుకొని,  నిర్మించిన ఈ అపార్ట్ మెంట్‌ల‌ను త‌మ క‌ష్టార్జితంతో కొనుగోలు చేశామ‌ని ఆపార్ట్ వాసులు స్ప‌ష్టం చేస్తున్నారు.  2012లో మూసీ రివ‌ర్ ఫ్రంట్ బ‌ఫ‌ర్‌జోన్‌ను 50 మీట‌ర్ల‌కు పెంచుతూ తీసుకొచ్చిన చ‌ట్టం మేర‌కు, ఈ అపార్ట్ మెంట్ ఈ బ‌ఫ‌ర్ జోన్ ప‌రిధిలోకి వొస్తుంది క‌నుక కూల‌గొట్టాల్సిందేన‌ని ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ముంద‌డుగు వేస్తోంది. కొత్త చ‌ట్టం అమ‌ల్లోకి తెచ్చిన సంవ‌త్స‌రానికి ఐదేళ్ల ముందే పాత చ‌ట్టానికి అనుగుణంగా చ‌ట్ట‌బ‌ద్ధంగా నిర్మించిన ఈ అపార్ట్ మెంట్‌ల‌ను ఎట్లా కూల్చివే స్తార‌ని అపార్ట్ మెంట్ వాసులు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. కాగా మ‌హాత్మాగాంధీ మ‌న‌వ‌డు తుషార్ గాంధీ ఈ విష‌యంలో క‌లుగ‌జేసుకోవ‌డంతో రేవంత్ ప్ర‌భుత్వం ఇరుకున ప‌డింది. గాంధీ పాటుప‌డిన విధానాల‌కు చెడ్డ‌పేరు తెచ్చే విధంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వానికి హిత‌వు చెప్ప‌డం విశేషం. కేవ‌లం గాంధీ విగ్ర‌హ నిర్మాణంకోసం 400-500 మ‌ధ్య‌త‌ర‌గ‌తి  కుటుంబాల‌ను అదీ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ను వీధుల‌పాల్జేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డంతో, విప‌క్షాల‌కు గొప్ప అస్త్రం దొరికిన‌ట్ల‌యింది.

    కేవ‌లం విగ్ర‌హ నిర్మాణానికే రూ.5వేల కోట్లు ఖ‌ర్చుచేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించ‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వం మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఉసురు పోసుకుంటున్న‌ద‌ని దుమ్మెత్తి పోస్తున్నాయి ప్రజా సంఘాలు ..ప్రతిపక్షాలు  . అయితే ఇక చ‌ట్ట‌ప‌రంగా చూస్తే ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చ‌ట్టం ముందు నిల‌బ‌డ‌ద‌ని కొంద‌రు న్యాయ నిపుణులు చెబుతున్న‌మాట‌. క‌చ్చితంగా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌లు కావ‌డం ఖాయం. చివ‌ర‌కు కోర్టుల్లో ఈ కేసులు ఒక కొలిక్కి వ‌చ్చేస‌రికి ఈ ప్రాజెక్టు ప్ర‌భుత్వానికి ఒక తెల్ల ఏనుగు మాదిరిగా మోయ‌లేని భారంగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అన్నింటికీ మించి రాబోయే జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో దీన్నొక పెద్ద వివాదంగా విప‌క్షాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌క మాన‌వు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఈ గాంధీ ప్రాజెక్టు రేవంత్ ప్ర‌భుత్వ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలే ఎక్కువగా  క‌నిపిస్తున్నాయి.
ఇక ఖ‌మ్మంలోని వెలుగుమ‌ట్ల వినోభా న‌గ‌ర్ లో నిరుపేద‌ల ఇళ్ల‌ను కూల్చివేసే ప్ర‌కియ రాజ‌కీయ ప్ర‌కంప‌ల‌ను రేపుతోంది. ముఖ్యంగా ఇక్క‌డ నివ‌సించే పేద‌ల‌కు ఎటువంటి నోటీసులు ఇవ్వ‌కుండా అధికార్లు ఒక్క‌సారిగా కూల్చివేత‌ల‌కు దిగార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. బీఆర్ ఎస్‌, సీపీఎంలు ప్ర‌భుత్వ చ‌ర్య‌ను తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నాయి. ఇక్క‌డ 18-31 ఎక‌రాల్లో నిర్మించుకున్న‌ 600-1000 నిరుపేద కుటుంబాల ఇళ్ల‌ను రెవెన్యూ అధికార్లు, పోలీసుల స‌హాయంతో కూల‌గొట్టడం ప్రారంభించ‌డంతో వివాదం రేగింది. వీరు ప్ర‌భుత్వ భూముల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకొని ఇళ్లు నిర్మించినందున‌, హైకోర్టు ఆదేశాల మేర‌కే ఈ చ‌ర్య తీసుకున్నామ‌ని అధికార్లు చెబుతున్నారు.  కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు రూ.40వేల నుంచి రూ.1ల‌క్ష వ‌ర‌కు పేద‌ల‌నుంచి వ‌సూలు చేసి భూదాన్ భూముల‌ను అక్ర‌మంగా క‌ట్ట‌బెడుతున్నందువ‌ల్ల, హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో తామీ చ‌ర్య‌కు దిగాల్సి వ‌చ్చింద‌ని అధికార్లు వివ‌రిస్తున్నారు. అయితే విప‌క్షాలు మాత్రం కొంత‌మంది రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌తో కుమ్మ‌క్క‌యిన ప్ర‌భుత్వం ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపిస్తున్నారు.
     వెలుగుమ‌ట్ల వినోభా న‌గ‌ర్ కాల‌నీలోని 18-31ఎక‌రాల భూమిని అధికారిక భూదాన్ భూమిగా గుర్తిస్తున్నారు. ఒక‌ప్పుడు భూస్వాములు ఈ భూముల‌ను  పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టుకునే నిమిత్తం భూదాన్ య‌జ్ఞ బోర్డుకు దానం చేశారు.  నిజానికి 2018లో హైకోర్టు, వెలుగుమ‌ట్ల‌లోని 147, 148, 149 స‌ర్వేనెంబ‌రు భూములకు చెందిన సుమారు 62 ఎక‌రాల్లో భూదాన్ య‌జ్ఞ బోర్డు చేసిన‌ లే అవుట్‌లు చ‌ట్ట‌బ‌ద్ధ‌మేన‌ని పేర్కొంది. 2014లో వంద గ‌జాల‌కు రిటెన్ ప్రొసీడింగ్స్ పొందిన కుటుంబాలు ఇళ్లు నిర్మించుకోవొచ్చున‌ని తీర్పు లో పేర్కొంది. అయితే భూదాన్ బోర్డు చేసిన ఈ కేటాయింపుల‌కు అవ‌స‌ర‌మైన విధివిధానాల‌ను పూర్తిచేయ‌డంలో రెవెన్యూ అధికార్లు విఫ‌లం కావ‌డం ఇక్క‌డ కీల‌కం. ముఖ్యంగా 2014-18 మ‌ధ్య‌కాలంలో బోర్డు అధికారికంగా కేటాయించిన స్థ‌లాల‌కు స‌రిహ‌ద్దుల‌ను నిర్ణయించ‌డంలో రెవెన్యూ అధికార్ల వైఫల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 2018నాటి హైకోర్టు తీర్పు మేరకు వినోభా న‌వోద‌య కాల‌నీని ల‌బ్దిదారులు ఏర్పాటు చేసుకున్నారు.  ఇదిలావుండ‌గా 2026లో ఇచ్చిన హై కోర్టు తీర్పు వీటికి వ‌ర్తించ‌ద‌ని, ప‌బ్లిక్ పార్క్‌లు, స్కూళ్ల‌కు కేటాయించిన ప్ర‌దేశాల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకొని ఇళ్లు నిర్మించుకున్న‌వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని అధికార్లు చెబుతున్నారు.
దలారులు  2018 కోర్టు తీర్పును త‌ప్పుదోవ ప‌ట్టించి డ‌బ్బులు వ‌సూలు చేసి అక్ర‌మంగా స్థ‌లాల‌ను పేద‌ల‌కు అమ్మార‌ని వీటిపైనే తాము చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో అధికారిక‌ ఇళ్ల కేటాయింపు జ‌రిగింది కేవ‌లం 1868 మందికి మాత్ర‌మేన‌ని అధికార్లు వివ‌రిస్తున్నారు. ఇక్క‌డ స‌మ‌స్య ఏంటంటే మ‌ధ్య‌వ‌ర్తులకు కొంత‌మొత్తం చెల్లించి ఇళ్లు నిర్మించుకున్న‌వా రు నిరుపేద‌లు. వీరు 8-10 సంవ‌త్స‌రాల‌నుంచి ఇక్క‌డ నివ‌సిస్తున్నారు. ఇన్నాళ్లుగా ప‌ట్టించుకోంది ఇప్పుడు అధికార్లు ఆక‌స్మికంగా మేల్కొన‌డ‌మేంట‌నేది బాధితుల ప్ర‌శ్న‌. ఇందులో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు లాభం చేకూర్చే దుర్మార్గపు ఆలోచ‌న ఉన్న‌ద‌ని వారు ఆరోపిస్తున్నారు.
పై రెండు సంఘ‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ చ‌ర్య‌వ‌ల్ల ప్ర‌ధానంగా న‌ష్ట‌పోతున్న‌ది, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, నిరుపేద ప్ర‌జ‌లు మాత్ర‌మే. ధ‌న‌వంతుల జోలికి ప్ర‌భుత్వం ఎట్లాగూ వెళ్ల‌దు. మ‌ధు పార్క్ రిట్జ్ అపార్ట్ మెంట్ విష‌యంలో ప్ర‌భుత్వ త‌ప్పిదం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. భూదాన్ భూముల విష‌యంలో పేద‌ల‌ను మోసం చేసిన ద‌లారుల‌ను ప‌ట్టుకొని శిక్షించ‌డం మాని, వీరి ఇళ్ల‌ను ఉన్న‌ఫ‌ళంగా కూల్చేయ‌డాన్ని ప్ర‌జా ప్ర‌భుత్వం, ఇందిర‌మ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న ప్ర‌భుత్వానికి ఎంత‌మాత్రం త‌గ‌దు. ఈ రెండు సంఘ‌ట‌న‌ల్లో మొద‌టిది చ‌ట్ట‌ప‌రంగా ప్ర‌భుత్వ త‌ప్పిదం కాగా, రెండ‌వ‌ది నైతికంగా ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *