తెలంగాణ రాష్ట్రంలో విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. విద్యా ప్రమాణాలు సైతం రోజు రోజుకి పడిపోతున్నాయి. విద్యకు, విలువల బోధనకు చిరునామాగా ఉండాల్సిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు ఆత్మహత్యలకు అవాంచనీయ సంఘటనలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఒకప్పుడు విద్యారులను విలువలతో కూడిన విద్యకై గురుకులాల్లో చదివించే వారు కానీ నేడు విలువల మాట దేవుడెరుగు కానీ, విద్యార్థులు విగత జీవులుగా మారి బయటకు వస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేకపోలేదు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలలో మార్పు అనివార్యమని, ప్రజలు భావించి, కోరుకున్న మార్పులకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మార్పును తీసుకువచ్చారు. ప్రభుత్వాలు మారినప్పటికీ, ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల బతుకులు మారడం లేదు. తల్లి తండ్రులు తమ పిల్లల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి అని చదువు కోసం ప్రభుత్వ విద్యాలయాలకు పంపిస్తుంటుంటే అసలు వారికి జీవితాలే లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ విద్యాలయాల్లో జరుగుతున్నవి ఆత్మ హత్యలు కావు ముమ్మాటికి ప్రభుత్వ తీరు కారణంగా జరుగుతున్న హత్యలుగానే తెలంగాణ మేధావి వర్గం భావిస్తున్నది.
ప్రయోగశాలల్లో రసాయనాలతో సమస్యలకు పరిష్కారాలు కనుగొనాల్సిన విద్యార్థులు విషం బాటిల్లను పట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో డాక్టర్లుగా మారి స్టెతస్కోప్లను మెడలో ధరించాల్సిన వీరు ఉరితాల్లను ముద్దాడుతున్నారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడి మన భోజనశాలల్లో నిత్యం కనిపిస్తూ ఉంటుంది అయితే అదే అన్నాన్ని తిని స్మశానం బాట పట్టాలని ఆ బ్రహ్మదేవుడే వారి తలరాతను రాసాడేమో గాని కల్తీ అయిన అన్నం తిని విద్యార్థులు జీవచ్ఛావాలుగా మారుతున్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్న రాష్ట్రంలో 20 మందికి పైగా విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న, 40 మందికి పైగా విద్యార్థులు మరణించినా, 30 పర్యాయలకు పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగిన, దాదాపుగా 800 మందికి పైగా ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యం పాలవుతున్న ప్రభుత్వం స్పందించక పోవటం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న వారి తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉంది, అందుకోసం ఈ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగానే తెలంగాణ పౌర సమాజం భావిస్తున్నది.
రాబోయే తరాల కోసం చెరువుల పరిరక్షణ అనే సదుద్దేశంతో హైడ్రా అనే ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ప్రణాళిక పరంగా ముఖ్యమంత్రి చెరువుల పరిరక్షణకై ఏ విధంగా పాటుపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం మరి అదేవిధంగా విద్యార్థులు పిట్టల్ల రాలిపోతున్న కనీసం స్పందించడం లేదు, కాస్మాటిక్ చార్జీలు పెంచాం, విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వ విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పైన గాని ఫుడ్ పాయిజన్ ఘటనల పైన గాని, ఇతర అవాంఛనీయ సంఘటనలపై ఎందుకు స్పందించడం లేదు. కాస్మటిక్ ఛార్జీలు పెంచాం అనగానే, విద్యా కమిషన్ ఏర్పాటు చేయగానే పూల బొకేలతో ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యేల బృందం ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలని, విద్యార్థుల ఆత్మహత్యల ఆక్రందనలని ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకువెళ్లడం లేదు అనేది తెలంగాణ పౌర సమాజం ముందున్నటువంటి ఒక అంతుచిక్కన టువంటి ప్రశ్న, అసలు యిన్ని ఫుడ్ పాయిజన్ సంఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రభుత్వంగాని, వివిధ కులాల వారిగా కేటాయించినటువంటి సంక్షేమ శాఖల మంత్రులు గాని, ప్రభుత్వ అధికార యంత్రాంగం గాని ఎందుకు నేటి వరకు ఎటువంటి రివ్యూ మీటింగ్ సైతం నిర్వహించలేకపోయింది, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి ఈ సంఘటనలను తీసుకుపోకపోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఇంతటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నప్పటికీ విద్యా శాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఆలోచన ముఖ్యమంత్రి ఎందుకు చేయడం లేదు, దీని వెనక గురుకులాలను మూసివేసి ప్రభుత్వ వసతి గృహాలను సైతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలోని వసతి గృహాలను సైతం నిర్వీర్యం చేసి, వీటిని ప్రైవేటుపరం చేయాలనే కుట్రలు ఏమైనా చేస్తున్నారా అనే సందేహం తెలంగాణ సమాజంకు కలుగుతున్నది.
ప్రభుత్వమే ఇంతటి నిర్లక్ష్యపు వైఖరితో ఉన్న కారణంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయ వసతి గృహాల్లో సైతం ఆహారంలో పురుగులు వస్తున్నాయని పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ, అక్కడ స్థానికంగా క్రీయా శీలకంగా పని చేస్తున్న విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తే ఆయా విద్యార్థులకు ఆయా విశ్వవిద్యాలయ అధికారులు హెచ్చరిక మెమోలు జారీ చేస్తూ ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయం యొక్క వసతి గృహం నచ్చితే తినండి లేదంటే లేదు, లేదు అంటే వసతిగృహాలను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వము ఆలోచనలు చేస్తున్నదని చాలా గర్వంగా చెబుతున్నారు, అయితే ప్రభుత్వ తీరు ఇంతటి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వ విశ్వవిద్యాలయ అధికారుల తీరు కూడా ఈ రకంగా ఉండటం సర్వసాధారణమే అనిపిస్తుంది. అయితే ఒకపక్క రాష్ట్రంలో రోజుకో ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రభుత్వ వసతిగృహంలోనూ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలోనూ ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఆహార భద్రత అధికారుల తీరు మరియు చర్యలు మాత్రం అగమ్య గోచరంగా ఉంటున్నాయి. పదేపదే బావర్చి రెస్టారెంట్ బిర్యాని లోను బొద్దింక వచ్చిందని, చైతన్య ఫుడ్ కోర్ట్ చికెన్ రైస్‌లో వెంట్రుకలు వచ్చాయని, శాగ్ హౌస్ మటన్ బిర్యానీలో పురుగులు వచ్చాయని తనిఖీలు చేస్తూ ఉంటారు, కేవలం ఆయా ప్రైవేట్ రెస్టారెంట్లలో మాత్రం తనిఖీలు చేయడం వెనక ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వ విద్యాలయాల్లోని ఆహార నాణ్యతను పర్యవేక్షించక పోవటం వెనుక ఉన్న మతలభేమిటి? అనే సందేహాలు అనేకంగా ఉన్నాయి. ఆయా రెస్టారెంట్ల వారు బెదిరిపోయి ముడుపులు చెల్లిస్తున్నారని అక్కడే పదేపదే తనిఖీలు చేస్తున్నారా లేదా ప్రభుత్వ విద్యాలయాలు..ప్రభుత్వ వసతి గృహాల వారు ఏమి ఇవ్వలేరని నిర్లక్ష్యం చేస్తున్నారా అనే సందేహాలు అంతుచిక్కని ప్రశ్నలు గానే మిగిలి ఉన్నాయి. వీటికి రాష్ట్ర ఆహార భద్రత అధికారులు తమ చర్యలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విపరీతమైన పరిస్థితులను కొన్ని పత్రికలు సమాజం ముందించిన కారణంగా హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ మధ్యకాలంలోనే మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేక మళ్లీ అదే ఫుడ్ పాయిజన్ సంఘటన పునరావృతమైంది. అయితే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సైతం వసతి గృహాల్లో ఆహారం కల్తీ విషయంలో చర్యలు తీసుకుంటామని చెబుతూనే, ఆహార కల్తీ విషయంలో కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి శోభనివ్వదు అనేది గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి సైతం తమ చుట్టూ ఉన్న అధికారులు చెప్పింది నమ్మి కొంతమంది కావాలని చేస్తున్నారని వాస్తవాలను వక్రీకరిస్తే అధికార యంత్రాంగం సైతం ముఖ్యమంత్రి మాటలను అదనుగా తీసుకొని అవే తప్పులను పునరావృతం చేసే అవకాశం లేకపోలేదు. కావున ముఖ్యమంత్రి తెలంగాణ విద్యార్థి సమాజానికి భరోసానిచ్చే విధంగా ఆహార కల్తీ విషయంలో అదేవిధంగా వసతి గృహాల్లో జరుగుతున్న ఆత్మహత్యల విషయంలో కఠిన చర్యలు ఉంటాయని బహిరంగంగా ప్రకటించి వెంటనే విద్యాశాఖ మంత్రిని సైతం నియమించి, జిల్లాల వారిగా కలెక్టర్ల పర్యవేక్షణలో వివిధ కులాల వారిగా, వారి సంక్షేమ శాఖల మంత్రులచే గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వసతి గృహాల స్థితిగతులపై సమీక్ష నిర్వహించి, ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు గాని మరే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి సమాజం డిమాండ్ చేస్తున్నది.
-జవ్వాజి దిలీప్ సాహు
పరిశోధక విద్యార్థి,
7801009838.