“అభద్రతాభావంతో ఉన్న నాయకులు మాత్రమే ఎప్పటికప్పుడు తమ నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా అనుయాయులకు తమ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోతామన్న భయం వారిని ఎప్పుడూ వెన్నాడుతుండటమే ఇందుకు కారణం. అందువల్లనే తమలోని ఈ అభద్రతాభావాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఎవరో ప్రేరేపిస్తున్నారన్న రీతిలో వీరి ప్రవర్తన ఉంటుంది. పహల్గామ్ దుర్ఘటన జరిగి రెండు నెలలు కావొస్తున్నది ..ముష్కరుల జాడ తెలుసుకోలేక పోతున్నాయి నిగాహ్ వర్గాలు ..ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు ..అగ్ర రాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తలను నిలువరించడం లో తన ప్రమేయం పై వ్యాఖ్యలు ..ఆ వ్యాఖ్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం స్పందించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించడం ..వీటిపై మీడియా కథనాలు చితి మీద చలి కాచుకున్న చందంగా ఉన్నది.
“నేనీ యుద్ధాన్ని ఆపేశాను. పాకిస్తాన్ గొప్ప దేశం. నరేంద్రమోదీ అద్భుతమైన వ్యక్తి. నేనాయనతో గత రాత్రి ఫోన్లో మాట్లాడాను. మేం భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకుంటున్నాం. కానీ నేను పాకిస్తాన్‌తో భారత్ యుద్ధాన్ని ఆపేశాను”. ఇదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసుకున్న ప్రచారం. మరోపక్క నరేంద్రమోదీ అటువంటిదేమీ లేదని చెబుతున్నా అమెరికా అధ్యక్షుడి వైఖరిలో ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం.యుద్ధం ఆపడంలో అమెరికా ప్రమేయం ఏమీలేదని ప్రధాని నరేంద్రమోదీ విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన కొద్ది గంటల తర్వాత డోనాల్డ్ ట్రంప్, “ఈ రెండు ఆసియా దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశాను” అని మళ్లీ నొక్కి చెప్పడం ద్వారా తన వైఖరిలో ఏవిధమైన మార్పు లేదని చెప్పడానికే యత్నించారు.
తర్వాత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిశ్రీ విలేకర్లతో మాట్లాడుతూ, యుద్ధాన్ని ఆపాలంటూ పాకిస్తాన్ ముందుగా ప్రతిపాదించించడంతో సిందూర్ ఆపరేషన్‌ను నిలిపేశామని, స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ వ్యవహారశైలిలో ఎటువంటి మార్పు లేదు. మనదేశ మీడియా కూడా ఈ రెండు పరస్పర విరుద్ధ వాదనలను తమకు నచ్చిన రీతిలో ప్రచారం చేసింది. ఉదాహరణకు ఒక జాతీయ మీడియా , “ప్రపంచంలో పెద్ద అణ్వస్త్ర దేశాలు యుద్ధాన్ని విరమించాలని నిర్ణయించాయి. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు” అని ట్రంప్ అన్నట్టు కథనాన్ని ప్రచురిస్తే, మరో జాతీయ మీడియా మాత్రం “భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ సంభాషణ ద్వారా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించలేదని ఒకవైపు స్పష్టం చేసినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు మాత్రం తన మధ్యవర్తిత్వం వల్లనే యుద్ధం ముగిసిందని చెప్పారని” వార్తను ప్రచురించింది.
భారత మీడియాలో ఎవరు అసలు నిజాన్ని తొక్కిపట్టాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇది కేవలం ప్రచారం మాత్రం కాదు. కావాలనే అసలు నిజాల్ని భూస్థాపితం చేసే యత్నంగా కనిపించింది. మరోరకంగా చెప్పాలంటే అసలు నిజాన్ని మీడియా మరింత దూరంగా లాక్కెళ్లిపోయింది. మీడియాలో వార్త కింద ఏది ప్రచారం జరిగిందనేది పక్కన పెడితే, కాల్పుల విరమణకు “నేనే కారణం” అని ఇద్దరు నాయకులు చెబుతున్న తీరు, హంతకుడి బుల్లెట్ నుంచి ఆ దేవుడే నన్ను కాపాడాడు అని ఎవరైనా చెప్పుకుంటే, మరి ఆ దేవుడు ఎవరై ఉంటాడు? బహుశా ఈ శతాబ్దంలోనే అహంభావి అధ్యక్షుడా లేక తానొక దైవకార్యాన్ని పూర్తి చేయడానికి భూమ్మీదికి వొచ్చానని భావించే మరో నాయకుడా?
నిజం చెప్పాలంటే అమెరికా ఎన్నడూ తన దౌత్యం విషయంలో నిజాయతీగా వ్యవహరించిన చరిత్ర లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం ఇజ్రాయిల్, ఇరాన్‌ను శిక్షిస్తున్న మాదిరిగా, పాకిస్తాన్‌ను శిక్షించడానికి దైవం కల్పించిన అత్యద్భుతమైన అవకాశాన్ని భారత్ కోల్పోయింది. భారత ప్రధాని ఎంతగా చెబుతున్నప్పటికీ “యుద్ధాన్ని నేనే ఆపాను” అనే పాటను ట్రంప్ మానకపోవడం మనదేశంలోని మీడియా మరియు సోషల్ మీడియాల భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టయింది. ఇప్పటివరకు భారత్‌ను తన అత్యంత సన్నిహిత దేశంగా, ప్రజాస్వామ్య విలువలను పరస్పరం పంచుకుంటున్న దేశంగా చెబుతూ వొస్తున్న అగ్రరాజ్య వ్యవహారశైలిని నమ్మకద్రోహంగా ఇవి పరిగణించాయి. దీనికితోడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో జరుపుతున్న విందు దౌత్యం ట్రంప్ చపలచిత్త వైఖరికి ప్రబల నిదర్శనం. అసలు ఇందులో ప్రొటొకాల్ పాటింపు ఎక్కడైనా కనిపిస్తున్నదా? అసిమ్ మునీర్ కు ప్రైవేటు విందు ఏర్పాటు చేయడమే కాక, కాల్పుల విరమణ ప్రస్తావనను ట్రంప్ మళ్లీ తీసుకురావడం భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశం.
భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ వ్యవహారశైలి దేశవాసుల్లో వ్యాకులతకు కారణమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ దీన్ని నివృత్తి చేయాలి. ముఖ్యంగా భారత్-పాక్‌లను ప్రపంచం ఒకే గాడిన కట్టేవిధంగా వ్యవహరించడం ప్రభుత్వ మద్దతుదార్లను తీవ్రంగా కలచివేసిందన్నది మాత్రం వాస్తవం. అంతేకాదు అఖిలపక్ష ప్రతినిధులను 33 దేశాలకు పంపడం ద్వారా ఎంతగా దౌత్యం నెరపినప్పటికీ, చాలా దేశాలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, మనదేశానికి అనుకూలంగా మలచలేకపోమాయమన్న అభిప్రాయం దేశవాసుల్లో నెలకొన్నది. ఇక మునీర్‌తో విందు దౌత్యం నెరపడం, యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ మళ్లీ పాతపాటే పడటం భారత్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ముఖ్యంగా ఇకముందు అనుసరించే అమెరికా వ్యూహానికి అనుగుణంగా పాక్‌తో పెంచుకుంటున్న సంబంధాలు భారత్‌కు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానివి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో, వీటినుంచి గట్టెక్కడానికి మళ్లీ పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఏర్పడింది. ఫలితంగా తిరిగి పాకిస్తాన్‌కు అమెరికా నుంచి సైనిక, ఆర్థిక పరమైన మద్దతు లభించడం ఖాయం. పాకిస్తాన్ బుద్ధి తెలిసిందే కదా! అమెరికా అందించిన దన్నుతో మళ్లీ మనదేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోయక మానదు. అసీం మునీర్‌కు ప్రైవేట్ విందు ద్వారా ట్రంప్ ఇచ్చిన సందేశం సూక్ష్మంగా వున్నప్పటికీ చాలా స్పష్టంగా వుంది. ఈవిధంగా తాజాగా రూపొందుతున్న ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త నియమాల ఆధారిత క్రమంలోకి భారత్ ఇంకా పూర్తిగా ఇమడలేదు!! ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అనుసరిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అనుకూల వివాదాస్పద వైఖరి భారత్‌ను మరింత సందిగ్ధంలోకి నెడుతోంది. చారిత్రక అలీన విధానం, ముక్కలు చెక్కలుగా వున్న పశ్చిమ దేశాల నేతృత్వంలోని సంకీర్ణాలతో కూడిన ప్రపంచ క్రమం నేపథ్యంలో, భారత్ తనకు అనుకూల వేదికలు, సంకీర్ణాల ఎంపిక విషయంలో అత్యంత జాగరూకంగా వ్యవహరించక తప్పదు. గతంలోని అమెరికా అధ్యక్షుల మాదిరిగా ట్రంప్ మనదేశం అనుసరిస్తున్న గిరి గీసుకున్న విదేశాంగ విధానాన్ని ఇక ఎంతోకాలం సహించకపోవచ్చు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిణామాలు ఇప్పడు వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌కే అనుకూలంగా పరిణమించే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో అమెరికాతో మనదేశం అనుసరించే దౌత్యనీతి నాలుగు వ్యూహాత్మక రోడ్ల కూడలిలో చిక్కుకున్నదని చెప్పక తప్పదు.