అరుంధతీ రాయ్ రెండవ నవల ‘Mother Mary Comes to Me’ వారం క్రితం చాలా నిరాడంబరంగా కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితుల సమక్షంలో జరిగిందిట.
మొదటి నవల, ‘The God of Small things’ వచ్చిన ముప్ఫై సంవత్సరాల తర్వాత. మొదటి నవలకు గొప్పపేరు, అదే మోతాదులో అప్రతిష్ట రెండూ ఆమెను సెలబ్రిటీని చేసాయి. మహరాష్ట్రలో, కర్ణాటకలో ఆ పుస్తకాన్ని నిషేధించలేదు కానీ ఆ నవల అమ్మటానికి పుస్తకాల షాపులు భయపడేంత వ్యతిరేకతను ఆకర్షించిన పుస్తకం అది. కానీ, ఆమె రాజకీయ భావాలతో ఏకీభవించనివారు కూడా అది సాహితీపరంగా చాలా చక్కటి రచన అన్నారు. ఎవరు ఏమి అన్నా ఆ పుస్తకం చాలా ప్రసిద్ధి కలిగిన బుకర్ ప్రైజ్ గెలుచుకుంది, మరికొన్ని అవార్డులు రివార్డులు కూడా. చాలామంది ఇష్టపడి కొన్నారు. చదివారు. చేతికి తీసుకున్నాక కింద పెట్టకుండా చదివించే భాష, కథనం, శైలి, కథ కూడా.
కవలలుగా కలిసి పుట్టి ఏడెనిమిదేళ్ళ వయసులోనే ఒకళ్ళనుంచి ఒకరు దాదాపూ శాశ్వతంగానా అన్నట్టు విడదీయబడి, చెరొకచోట పెరగటానికి పంపబడిన పిల్లల కథగానే చాలామంది చదివారు దాన్ని, నేపథ్యంలో స్థానిక రాజకీయాలు, అందులో పాత్రలు అవలంబించిన మతం గురించిన తీవ్రమైన వ్యాఖ్యలు, స్త్రీ పురుషుల లైంగిక స్వేచ్ఛలను కుటుంబం, సంఘం ఆమోదించే విషయంలో భేదాలు, కుటుంస్థాయిలో చర్చించిన పితృస్వామ్య అరాచకాలు- ఇలా ఎన్నో ఉన్నా. కలిసి పుట్టి, మమేకంగా పెరుగుతున్న కవలలు, ప్రాణ స్నేహితులు, ఒకరికొకరు ఏకైక తోడు, అల్లరిలో తోడుదొంగలు అయిన ఇద్దరు చిన్నపిల్లలను వాళ్ళు తెలిసి చేయని నేరానికి శాశ్వతంగా ఒకరినుంచి ఒకరిని చీల్చివేస్తే ఆ ఎడబాటు శోకపు బరువును మోస్తూ, మిగతా జీవితమంతా వంగిపోయి, దాదాపు ఆత్మ వదిలేసిపోయిన ఖాళీ శరీరాల్లా బ్రతుకీడ్చవలసి వచ్చిన ఆ ఇద్దరు అనాథల కథగానే చదివాను నేను కూడా.
ముఖ్యంగా ఆ పిల్లవాడు జీవచ్ఛవమై కనిపిస్తాడు ముప్ఫై ఏళ్ళ తర్వాత, పాఠకులకూ, వాడే లోకంలా బ్రతికిన వాడి చెల్లెలికి. తిరిగి వాడు నవలలో కనపడే దృశ్యాన్ని, ఆ నవల చదివిన ఎవరూ మర్చిపోయి ఉండరు. రచన ప్రతిభ అది. ఆవిడ వ్రాసిన వ్యాసాలు, ఆమె పాల్గొన్న ఉద్యమాలూ అన్నీ follow అవుతూనే ఉన్నా, వాటితో నా ఏకీభావం, వ్యతిరేకతా పక్కకు పెట్టేసి కేవలం ఆమె ఈ రెండవ నవల విడుదల చుట్టూ జరుగుతున్న మాటలగూర్చే మాట్లాడుతున్నాను.
ఇప్పుడు ఇంతకీ ఈ నవల వచ్చీరాకముందే మొదటిదానికంటే ఎక్కువ విమర్శలను పోగేసుకున్నది. ఈ పుస్తకం కవర్ మీద ఇది మెమ్వార్ అని లేదు, ఆటోబయోగ్రఫికల్ అనీ లేదు, లాంచ్ చేసినప్పుడు రచయిత ఈ పుస్తకం మా అమ్మ గురించే అని చెప్పడం తప్ప. పుస్తకం లాంచ్ చేస్తూ ప్రతి మీటింగ్ లో అంతో కొంతో ఈ కథను, వాళ్ళ అమ్మ కథను ఎందుకు వ్రాయవలసొచ్చిందో చెప్తూనే ఉంది. ఆమెను మొదటి నవలకు హృదయానికి హత్తుకున్నవాళ్ళు కూడా ఇప్పుడు ఇలా ఈమె వాళ్ళ అమ్మ , మేనమామ పోయిన తరువాత వాళ్ళు ప్రధానపాత్రలుగా ఈ కథ చెప్పటం సరికాదు కదా అంటున్నారు. ఎంతోమందిని తనవాళ్ళను ఇలా వారివారి వ్యక్తిత్వ లోపాలతో బట్టబయలు చేసి చూపించటం, ఇందులో ఎంత నిజం? ఇది ఎంతవరకూ సమంజసం? అని కొందరి ప్రశ్న.
నిజానికి, తన మొదటినవలలోనే ఎనభైశాతం కథ స్వీయజీవిత కథే అని పాఠకులకు గుర్తులు చెప్పే విషయాలు చాలినన్ని ఉన్నాయి. అందులో అమ్మ, మేనమామ, కృూరుడైన తాత అందరూ ఉన్నారు, తను చెప్పదలుచుకున్న నేరెటివ్ కి అవసరమైనంతగా. కొత్తగా మళ్ళీ అవే పాత్రలను లాక్కొచ్చి, వాళ్ళుపోయిన తర్వాత, ఈ కథ రాసి ఈమె చేసేది ప్రేతద్రోహమా? (పితృ కాదు) లేక ఈసారి వాళ్ళ కథ అని చెపుతూ తన కథనే మరి కాస్త చెప్తోందా, తనకే పునశ్చరణ చేసుకుంటోందా? వాస్తవానికి పై రెండురకాల కథలలో ఒకటుంటే రెండవది లేకుండా కథ ఏముంది? ఎలా నడుస్తుంది? కొందరికి ఈ కవర్ పేజీయే కల్లోలకారణం అవుతోంది. Self indulging? తన అందమైన చిన్నప్పటి ఫోటోనే పెట్టి, నోట్లో సిగరెట్ (బీడీ అంటున్నారు కొందరు) తో సహా? అయినా, కవర్ దాటి లోపలికి వెళ్ళి చదవకుండా చర్చలెందుకు? పుస్తకం లాంచ్ సందర్భంగా రెండు మూడుచోట్ల ఆమె మాట్లాడుతూ మాట్లాడిన మాటలు కూడా ఈసారి ఆమె వల్నరబిలిటీని కొంచెం బయటే వేస్తున్నాయి.
“బోటాక్స్ ల వెనక నా వయసు ముడతలు దాచుకోవటం ఇష్టం లేదు” అని ఒడ్డుకోవటం, చాలా చిన్న విషయమైనా ఆమె స్టేచర్ కి అనవసరం అనుకుంటున్నాను. నిజానికీ ఇప్పుడు కూడా అందంగా ఉంది ఆమె. మొదటి నవలలోని అక్షరాల అందమూ, వాటిల్లో తన అప్పటి నిజాయితీ, ధైర్యం, సత్యం (ఆటోబయోగ్రఫికల్ ఫిక్షన్లో సత్యం ఎంత ఉండచ్చనేది పెద్దప్రశ్న) అనేవన్నీ నవల చదివి తెలుసుకోవలసిందే. విషయంలో కాదు factuality ఉండవలసింది. ఆటోప్సీ రిపోర్ట్ కాదు నవలా పాఠకులు కోరవలసింది. జీవం ఉన్నకథను కదా కోరుకుంటారు చదవాలని. అరుంధతీరాయ్ ఆ విషయంలో నిరాశ మిగల్చదనే అనుకుందాం తన రీడర్స్ కి. కాకపోతే, ప్రపంచంలో అన్నింటికంటే కష్టం ఎంత సత్యానికి నిబద్ధులై రాసే రచయితకైనా, ఎవర్ని గురించైనా నిజం చెప్పటం కష్టం కాదు తన కథలో, తనదాకా వస్తేనే…
పద్మజ సూరపరాజు




