రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడంలో అత్యంత కీలక పాత్ర ఆరు గ్యారంటీలది. రైతులు, మహిళలు, యువత సహా వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలతో రూపొందించిన ఈ గ్యారంటీల్లో అధికారంలోకి వొచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. అలా ఆరు గ్యారంటీలే ఆలంబనగా ఆత్మవిశ్వాసంతో రేవంత్ సర్కార్ కదం తొక్కుతోంది. వంద రోజుల్లో వీటిని అమలు చేస్తామని చెప్పి తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వొచ్చింది. వొచ్చిన వెంటనే ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ హామీల అమలును ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ 6గ్యారంటీలుగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిర ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత, యువ వికాసం వంటి పథకాలను ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పథకాల అమలు తీరు ఎలా ఉందని పరిశీలిస్తే అంతటా సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది. అనేక ప్రచారాలు, ఒత్తిళ్ల మధ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఏడాది పాటు ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలను పూర్తిచేయడమనేది పెద్ద విషయమే.
అయితే ఈ ఏడాదిలో ఆయన ఏం సాధించారో చూడటం కూడా అవసరమే. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిలా రేవంత్ రెడ్డి జీన్స్‌లో కాంగ్రెస్ రక్తమున్న నాయకుడు కూడా కాదు. భారతీయ జనతా పార్టీ మూలాలతో, తెలుగుదేశం పార్టీ శిక్షణలో రాటుదేలి ఎదిగిన నాయకుడు! అలాంటి రేవంత్ రెడ్డి కొన్ని తరాలుగా కాంగ్రెసు పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులం దరినీ బైపాస్ చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగలిగారంటే.. అది కేవలం ఆయన కష్టార్జితం. శ్రమఫలం. రేవంత్ రెడ్డి దూకుడు, కష్టనష్టాలకు వెరవని తత్వం ఇవన్నీ కలిపి ఆయనను రేసులో ముందంజలో ఉంచి ముఖ్యమంత్రి అయ్యేలా చేశాయి. సీఎం పదవికి తాను ఎంపిక కావడానికి దారి తీసిన కారణాలు, పార్టీ అధిష్ఠానాన్ని ఇంప్రెస్ చేసిన అర్హతలు ఏవైనా కావొచ్చు గాక.. ఎన్నయినా ఉండవచ్చు గాక.. పదవిలో కలకాలం కొనసాగడానికి అవి చాలవు అనే సంగతి రేవంత్ కు చాలా బాగా తెలుసు. అందుకే సీఎం అయ్యేదాకా ఒక తీరు .. అయిన తర్వాత మరో తీరు అన్నట్టుగా ఆయన తన పనితీరును నిర్దేశించుకున్నారు. ఆరు గ్యారంటీలు అనే జనాకర్షక హామీలతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి.. పగ్గాలు చేపట్టిన వెంటనే రెండిరటినీ నెరవేర్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఆరోగ్యశ్రీ బీమా లిమిట్‌ను పది లక్షల రూపాయలకు పెంచారు. సర్వత్రా జనామోదం పొందిన నిర్ణయాలు అవి.
ముఖ్యమంత్రి పదవిలోకి వొచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు, దూకుడు విషయంలో సహచరులు నోరెత్తలేక మౌనంగా ఉండి పోయే పరిస్థితిని సృష్టించాలని రేవంత్‌రెడ్డి ముందుగానే ఒక స్థిరాభిప్రాయానికి వొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన పనితీరు దానికి తగ్గట్టుగానే ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. పార్టీలో సీనియర్ సహచరులలో అసంతృప్తి రాకుండా తనకు చేతనైన చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎన్నికల ఫలితాల సమయంలోనే డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూర్చుండబెట్టారు. అప్పటి వరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసంగా ఉన్న భవంతిని, తన జమానాలో డిప్యూటీ అయిన భట్టికి కేటాయించారు. అంతేకాదు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముఖ్యమంత్రితో సమానంగా భట్టివిక్రమార్కకు ప్రాధాన్యం ఇస్తూ వొచ్చారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ఫోటోల విషయంలో కూడా ముఖ్యమంత్రితో సమానంగా భక్తి విక్రమార్క ఫోటోలు కూడా పెట్టిస్తూ ఆయనను సంతృప్తి పరిచారు.
పరిపాలన పరంగా తన ముద్ర చూపించుకోవడం లక్ష్యంగా, తాను మాత్రమే చేయగలిగిన శైలి పనులు ఇవి అనిపించేంత దూకుడుగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. తెలంగాణ చరిత్రలోనే హైడ్రా కూల్చివేతలు ప్రత్యేక అధ్యాయం! నీటి వనరులను, సరస్సులు, కాలువలను కాపాడడానికి చాలా మొండి ధైర్యంతో హైడ్రా ఆలోచనకు రేవంత్ రూపకల్పన చేశారని చెప్పాలి. అన్ని రకాలుగానూ.. ఇంతటి వైభవోపేతమైన భాగ్యనగరం.. వర్షాకాలంలో దుర్భర జీవితానికి ఆలవాలం అవుతున్నదంటే.. నీటివనరులు శాశ్వత దురాక్రమణలకు గురై ఉండడమే అనే కఠోరసత్యాన్ని సీరియస్‌గా పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి వనరుల ఆక్రమణల విషయంలో ఎంతటి వారి ఆస్తులైనా సరే, ఎంత విలువైన నిర్మాణాలు అయినా సరే.. వెనక్కు తగ్గేది లేదని.. సమూలంగా నేలమట్టం చేసేయడమే అని ఆయన పలు సందర్భాల్లో నిరూపించుకుని ముందుకు సాగారు.
అలాగని, రేవంత్ రెడ్డి పరిపాలనలో లోపాలు లేవని చెప్పలేం. సకాలంలో రైతుబంధు నిధులు ఇవ్వకపోగా రుణమాఫీ చేస్తానని ప్రకటించిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. హైడ్రా కూల్చివేతల విషయంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మూసీ నది ప్రక్షాళన విషయంలో పేదల ఇళ్లు కూల్చి వేయడం అనేది పెద్ద రాద్దాంతంగా మారిపోయింది. మూసీ నదిని ప్రక్షాళన చేయడం ఆ ప్రాంతం మొత్తానికి పూర్వవైభవం తీసుకురావడం అనేది అతి పెద్ద బృహత్కార్యం. ఇలాంటి కార్యాన్ని తలపెట్టినప్పుడు అవాంతరాలు రావడం సహజం. రాజకీయ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రజలకు మంచి చేస్తున్నానా లేదా, అలాగే తన నిర్ణయం వలన ఎన్ని పేద కుటుంబాలు పూర్తిగా ఛిద్రమవుతాయి అందుకు తన ప్రభుత్వం చూపగలిగిన పరిష్కారం ఏమిటి? ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
పేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారి ఉపాధులు ఏమాత్రం దెబ్బ తినకుండా వారు అదనపు ఇబ్బందులు పడకుండా తన ఆత్మ సాక్షికి తెలిసేలాగా పరిష్కారాలను చూపగలిగారా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఇంకా పూర్తిగా దృష్టి సారించినట్లుగా అనిపించడం లేదు. మరోవైపు, సీఎం మార్పు బూచీనా చూపిస్తే రేవంత్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, ఆయనలో ఒకరకమైన భయాన్ని రేకెత్తించడానికి ప్రతిపక్షాలు తమ శక్తివంచన లేకుండా పనిచేస్తూనే ఉన్నాయి. కేటీఆర్, కిషన్ రెడ్డి వంటి విపక్ష నాయకులు ఇప్పటికి కొన్ని వందల సార్లు.. రేవంత్ రెడ్డి పదవి త్వరలోనే పోతుందని చెబుతూ వచ్చారు. కానీ వారి అలాంటి మైండ్ గేమ్‌కు రేవంత్ ఏ మాత్రం లొంగలేదు. మరింత దూకుడుగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఘనంగా అడుగులు వేస్తున్నారు. అవినీతి మరకలు తనకు అంటకుండా చూసుకుంటున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియడం గొప్ప అనే సిద్దాంతాన్ని ఆయన కూడా పాటిస్తున్నారు. ప్రజాందోళనల్ని ఆయన గౌరవిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఇది చాలా ముఖ్యమైన లక్షణంగా ఉండాలి.
చాలా మంది ప్రజాందోళనల్ని గుర్తించకుండా, గౌరవించకుండా.. తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి అలాంటి తప్పులు అంతగా చేయడం లేదు. ఒక పార్టీ అధికారంలోకి వొస్తే.. తొలి ఏడాదిలోనే మేనిఫెస్టో మొత్తం పూర్తిచేసేస్తుందని, చేసేయాలని ఎవ్వరూ ఆశించరు. కానీ హామీల గురించి ప్రతిపక్షాలు ప్రతినిత్యం గోలచేస్తూనే ఉన్నాయి. రేవంత్ అన్ని హామీలకు డెడ్‌లైన్లు సహా ఒక కార్యచరణ ప్రణాళిక ప్రకటిస్తే.. ప్రతిపక్షాల నోర్లకు తాళాలు పడతాయండంలో సందేహం లేదు.
-ఎమ్.ఎమ్