సమగ్ర కార్యాచరణతో సరస్వతి పుష్కరాలు విజయవంతం

  • పుష్కరాల నిర్వహణతో  ప్రభుత్వానికి కీర్తిప్ర‌తిష్ట‌లు
  • 30 లక్షల మంది భక్తుల పుణ్య‌స్నానాలు
  • వొచ్చే గోదావరి పుష్కరాలను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి 
  • ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు

 జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని,  మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడంతో సరస్వతి పుష్కరాలు (Saraswathi Pushkaralu ) విజయవంతమ‌య్యాయని  ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్టపడ్డారని తెలిపారు. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలవుతుందని నిరూపించారని, పుష్కరాలతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని  సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.   నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని,  ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.

శాసనమండలి  ఎన్నికల కోడ్ అమల్లో ఉండ‌డంతో పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింద‌ని, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను పూర్తి చేశారని అభినందించారు. సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి  కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారని తెలిపారు.  కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన  అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా  కష్టపడ్డారని,  పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి  హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.

ఈ పుష్కరాల (Saraswathi Pushkaralu 2025) ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వొచ్చిందని,  ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది మ‌హిళ‌లు  పుష్కరాలకు విచ్చేశారని అన్నారు. 12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు. కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని,  చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు. మీడియా మిత్రుల సహకారం గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని,  ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

నాలుగు లైన్ల రహదారి కోసం కృషి…

కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.  అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా… కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు  లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు.  అలాగే వడదెబ్బకు గురై మరణించిన  పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించిన యంత్రాంగం యొక్క కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు.  ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో  మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్  ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పుష్కరాలు విజయవంతంగా కావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యంత్రాంగమంతా ఒకతాటిపై నిలబడి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.  సమగ్ర ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రతి ఒక్కరిని అభినందించారు.  కాళేశ్వరం చిన్న గ్రామమైనప్పటికీ 30 లక్షలు కంటే ఎక్కువ మంది భక్తులు భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.  ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ 12 రోజులు రేయింబవళ్ళు విధులు నిర్వహించారని అన్నారు. పుష్కరాలు ముందు పుష్కరాలు తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యమని ఆయన తెలిపారు.  విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా 24*7 నిరంతరం విద్యుత్ అందించారని అభినందించారు.  .

సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్,  మెడికల్ సిబ్బంది వడదెబ్బ నుండి భక్తులను కాపాడారని తెలిపారు. పోలీస్ శాఖ వాహన రద్దీ పెరుగుతున్న క్రమంలో రాత్రికి రాత్తే పార్కింగ్ ఏర్పాటు చేసి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించారని తెలిపారు.  ఆర్డబ్ల్యూఎస్ నిరంతరాయ మంచినీరు సరఫరా,  మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి  ఆదేశాల మేరకు కార్యాచరణలతో ముందుకు వెళ్ళామని సీఎస్,  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ తదితరులు సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.  హైదరాబాద్ నుంచి ప్రతిరోజు పర్యవేక్షణ చేశారని వారి సూచనలు  విజయవంతానికి ఎంతగానో దోహదపడ్డాయని  తెలిపారు. అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన  జిల్లా  అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.ఈ కార్యక్రమంలో టేక్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ కిరణ్ కరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం    రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం   విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *