పంట న‌ష్ట నివార‌ణ‌కు రూట్ మ్యాప్‌

– ధాన్యం న‌ష్ట‌పోకుండా అమ‌ల్లోకి సైలో వ్య‌వ‌స్థ‌
– ముఖ్య‌మైన పంట ఉత్ప‌త్తులు నిల్వ‌చేసుకునే అవ‌కాశం
– ఆహార భ‌ద్ర‌త‌కు ఇది కీల‌కం
– మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: చేతికొచ్చిన పంట భద్రతకోసం ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని  నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా రైతుకు భరోసా కల్పించడంతోపాటు ఆహార భద్రతను పెంపొందించడం సులభతరమౌతుందన్నారు. సచివాలయంలో పౌర సరఫరాల, భారత ఆహార సంస్థ అధికారులతో గురువారం ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. యావత్  దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్న నేప‌థ్యంలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చేతికందిన ధాన్యం నష్టపోకుండా ఉండేందుకు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైలో వ్యవస్థను అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సైలో పద్దతిలో బియ్యం, మొక్క జొన్న, సోయాబీన్ వంటి పంటలను కుడా నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు. మనుషుల జోక్యం లేకుండానే సైలో పద్దతిలో ఉండే ఇంటిగ్రేటెడ్ క్లీనర్లు,డ్రైయర్లతో రెండేళ్ల వరకు ధాన్యాన్ని నిల్వ‌ ఉంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు పంపడంతో మిల్లింగ్ లో జరుగుతున్న జాప్యంతో ధాన్యం చేడిపోయి నష్టం వాటిల్లుతుందని,మిల్లులలో శాస్త్రీయ పద్దతిలో నిల్వ చేసే అవకాశం లేక పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి భరోసా ఇవ్వడంతో పాటు ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం శాస్త్రీయమైన సైలో పద్ధతిని అమలులోకి తేవాలి అనే ఆలోచనకు శ్రీకారం చుట్టామన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు సమయంలో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైలో పద్దతిలో ఉండే డ్రైయర్ల ద్వారా తేమను తొలగించడంతో పాటు ధాన్యాన్ని దీర్ఘకాలంపాటు పరిరక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. అంతే గాకుండా పాత బియ్యానికి మార్కెట్ లో అధిక ధర లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ప్రభావం దేశ వ్యాప్తంగా చూపుతున్న‌దన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన పేదలకు ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ,సన్నాలకు 500 బోనస్ వంటి సంస్కరణలతో దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందన్నారు. ఆ క్రమంలోనే చేతికొచ్చిన పంట పాడవకుండా ఉండేందుకు ప్రభుత్వం అమలులోకి తేవాలనుకుంటున్న సైలో ప్రాజెక్టుతో పెద్ద ఎత్తున ప్రయోజనం ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రధానంగా కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకు నెట్టేసి మిల్లింగ్ అయిన బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడంతో కొనుగోలుకు మిల్లింగ్ కు మధ్య‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5,000 కోట్లు నష్ట పోతున్న‌దని…సైలో పద్ధతిని అమలులోకి తెస్తే రూ.5,000 కోట్ల భారాన్ని అధిగమించడంతో పాటు రూ.1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పద్ధతిని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని మంత్రి వివ‌రించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page