“రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి మాటల్లో వైరాగ్యం కనిపించేది. బింకంగా కాంగ్రెస్ పార్టీ నే మరో ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటుందని, బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఇలా ఎన్నో జిమ్మిక్కులు పత్రికా పరిభాషలో వినిపించారు. కానీ ఇప్పుడు రేవంత్ లో బాగా ఆత్మవిశ్వాసం పెరిగినట్టుంది. ఏకంగా పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని గాఢంగా కోరుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను పక్కన పెట్టుకునే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, ఈ రెండేళ్ల కాలంలో ఆయనకు పార్టీపై పట్టు, తన ఛరిష్మాపై నమ్మకం ఏర్పడి ఉండాలి . తాను తప్ప పార్టీకి దిక్కులేదన్న ఆత్మవిశ్వాసం కూడా ఆయనలో బలంగా నాటుకొని ఉండవచ్చు.”

కాంగ్రెస్ లో పదవి ఎవరిని ఎప్పుడు ఎందుకు వరిస్తుందో! ఎప్పుడు ఉన్న పదవి ఊడుతుందో తెలియని అయోమయం ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో ఉంది. దానికి మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అతీతం కాదు. చాలా చిత్రంగా తన రెండేళ్ళు పాలనా ముగుస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ళు తానే పవర్ లో ఉంటానని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండేళ్ళ కాలంలో మంత్రులు, శాసనసభ్యులు తిరుగుబాట్లు, వివాదాలు, పరస్పర దూషణలు, అలకలు, సర్ధుబాట్ల పర్వంచూసిన ఎవరికైనా కాంగ్రెస్ పార్టీలో ఇవి ఎప్పుడు ఉండే సహజ పరిణామాలే అనిపిస్తాయి. కొందరైతే ఇవి పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్య సూచికలు గా చెప్పుకొని సంబరపడుతుంటారు.
మరికొందరు రేవంత్ రెడ్డి ఇచ్చిన అతి స్వేచ్ఛను, అసమర్థతగా భావించిన వారున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ లోఅధిష్టానం అధికార పరిధికి ముఖ్యమంత్రి కూడా కట్టుబడివుండటం ఆనవాయితీ! పార్టీలో అన్ని స్థాయిలవారు అధిష్టానం కనుసన్నలలో మెలిగే విధంగా చూడటానికి వివిధ కమిటీలు, ఇన్చార్జి, పరిశీలకులు,ఇత్యాది యంత్రాంగం పనిచేస్తుంటాయి. చిన్న కార్యకర్తనుండి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ యంత్రాంగం అదుపులో పనిచేయాల్సిందే. అయితే, తిరుగుబాటు దశలో నైరాశ్యం కట్టలు తెగినప్పుడు మాత్రం అధిష్టానం,పెద్దలతో సహా ఎవరినీ లెక్కచేయని తత్వం కనిపిస్తుంది. కొన్నిసార్లు మౌనం,మరికొన్ని సార్లు రాయబారాలతో సర్దుబాట్లు ఉంటాయి. ఉదాహరణ కు మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ ను మనం చూడవచ్చు.
క్రమశిక్షణ తప్పి కట్టు తెగిన నేతలు కూడా తిరిగి ప్రధాన స్రవంతిలో చేరిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీ లోనే మనం చూస్తాం.అధిష్టానం పరిశీలకులను దాటి కాంగ్రెస్ పార్టీ లో తామే ముఖ్యమంత్రని ప్రకటించుకోగలిగిన దమ్ము, ధైర్యం ఉన్న కొద్దిమంది కోవలోకి రేవంత్ రెడ్డి చేరారా? అన్న అనుమానం కలుగుతోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన డొల్లగా తేలిపోవాలని కోరుకునే రాజకీయ నేతల్లో ప్రతిపక్షాలలో కంటే కాంగ్రెస్ పార్టీ లోనే అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ముఖతా బాగున్న చాటుమాటుగా అధిష్టానం దగ్గర కు చాడీలు చేరవేసే వారి సంఖ్య తక్కువేం ఉండదు. ముఖ్యమంత్రి తనదంటూ పాలనాశైలి ముద్ర పడకుండా పరిపాలనలో మోకాలు అడ్డే మంత్రులు లేకపోలేదు.
పీఠం దిగితే ఎక్కాలని గోతికాడ నక్కల్లా ఎదురుచూసే నేతలకు కాంగ్రెస్ లో కొదవలేదు. రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి మాటల్లో వైరాగ్యం కనిపించేది. బింకంగా కాంగ్రెస్ పార్టీ నే మరో ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటుందని, బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఇలా ఎన్నో జిమ్మిక్కులు పత్రికా పరిభాషలో వినిపించారు. కానీ ఇప్పుడు రేవంత్ లో బాగా ఆత్మవిశ్వాసం పెరిగినట్టుంది. ఏకంగా పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని గాఢంగా కోరుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను పక్కన పెట్టుకునే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, ఈ రెండేళ్ల కాలంలో ఆయనకు పార్టీపై పట్టు, తన ఛరిష్మాపై నమ్మకం ఏర్పడి ఉండాలి.
తాను తప్ప పార్టీకి దిక్కులేదన్న ఆత్మవిశ్వాసం కూడా ఆయనలో బలంగా నాటుకొని ఉండవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఇదే ఆత్మవిశ్వాసంతో రాష్ట్రాన్ని, పార్టీని, అధిష్టానాన్ని ఒంటిచేత్తో తన కనుసన్నల్లో ఉంచుకోగలిగారు. ఇదిలావుండగా జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో రాజకీయ విశ్వాసం బాగా పెరిగినట్లు కనపడుతున్నది.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ పరిణామాలు సైతం దైర్యం పెంచి ఉండవచ్చు. ఇదే సమయంలో వరుస ఓటములతో జాతీయస్థాయి నాయకత్వం బలహీనపడటం కూడా రేవంత్‌కు కలిసొచ్చిన అంశం. బలహీనంగా ఉన్న అధిష్టానం రేవంత్ ను గట్టిగా శాసించే పరిస్థితి ఉండదు . ముఖ్యమంత్రిగా తనను తొలగిస్తే బీజేపీ లోకి పోతామని ప్రస్థుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య, అధిష్టానం మాట ప్రకారం తనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించకపోతే బిజెపి లో చేరుతామని పీఠం ఆశిస్తున్న డికే శివకుమార్ బెదిరించి నట్లు పత్రికా వార్తలు చూశాము.
“నిప్పులేనిదే పొగరాదుష అనే నానుడి రాజకీయాలకు వర్తిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వెళ్లనన్ని సార్లు దిల్లీ వెళుతున్నారు. హైదరాబాద్ లో కంటే దిల్లీలోనే ఆయన రాజకీయాలకు వ్యూహాత్మకంగా పదును పెడుతున్నట్లు కనిపిస్తున్నది.అటు రాష్ట్ర అభివృద్ధి పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు పార్టీ పటిష్టత పేరుతో అధిష్టానం పెద్దల వద్ద తన మంత్రాంగం నడుపుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి బీజేపీ పరోక్ష మద్దతు ఉందని బీఆర్ ఎస్ నేతలు ఒక పక్క ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అంత దూకుడుగా రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేయడం లేదు.
బహుశా ఆయన తొలినాళ్లలో ఏబీవీపీ నేపథ్యం కారణం కావచ్చు. ఈ పరిస్థితి సైతం తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మ స్థైర్యం పెంపొందించి ఉండవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కర్ణాటక పరిణామాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి తో కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎటు చూసినా కాంగ్రెస్ అధిష్టానం కు ముఖ్యమంత్రులు మార్పు అంత తేలిక కాదు. ఉన్న ముఖ్యమంత్రుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నది కనుక ఈ స్థితిలో రేవంత్ రెడ్డి మాటల్లో ఆత్మ స్థైర్యం తొణికిసలాడుతున్నది. ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలు చేసి ఊపిరాడకుండా చేసి అసలు విషయం ప్రక్కదారి పట్టేలా చేయడం రేవంత్ రెడ్డి సహజ రాజకీయ శైలి! తెలుగుదేశంలో ఉండగా తన గురువు చంద్రబాబు నుంచి బాగా వంటపట్టించుకున్నారు.
చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చినవారే కనుక, ఇక్కడి కుట్ర రాజకీయాలపై ఎప్పటికప్పుడు ఆయన తన శిష్యుడికి మార్గనిర్దేశం చేయకూడదనేంలేదు! ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా అధిష్టానం పైన కూడా రేవంత్ అనుకోని సవాలును విసిరారా? లేక పదేళ్ల వరకు అధికారంలో ఉంటానని చెప్పడం ద్వారా, రెండేళ్లలో రేవంత్ పని అయిపోయిందని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇస్తూ మరోవైపు పార్టీ క్యాడర్‌లో విశ్వాసం నింపేందుకు యత్నిస్తున్నారా? అనేది కీలక ప్రశ్న.
అంతర్గతంగా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకొని అనుకోని అవాంతరాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ నేతల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, వారిని అదుపుచేయడానికి బాణం వదిలి ఉండకూడదనేం లేదు. రెండేళ్ల కాలంలో నెరవేర్చలేక పోయిన హామీలను పదేళ్ల కాలంలో పూర్తి చేస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. పాలనలో తన పదవికి ఉన్న అభద్రతా భావాన్ని బింకమైన ప్రకటనతో తనకు తాను సంతృప్తి పరచుకోకూడదనేం లేదు. రేవంత్ రెడ్డి పదేళ్ళ ముఖ్యమంత్రి ప్రకటన లో ఆంతర్యం ఏమైనా కావచ్చును. కానీ,నేడు ప్రజలకిచ్చే వాగ్దానాలు,హామీలకు వోట్లు రాలే పరిస్థితి పోయింది. వ్యక్తిగతంగా ఈయన వల్ల వ్యక్తిగతంగా కలిగిన లబ్ది ఏమిటన్న ఆలోచన ధోరణి ప్రజల్లో పెరిగింది.
బీహార్ ఎన్నికల ముందు పదివేల రూపాయలు పథకం రూపంలో పంచి గెలిచిన మోదీ మంత్రాంగం కళ్ళారా చూశాము. ఈ దశలో రెండేళ్ళు అసంతృప్తిని కవర్ చేసుకొని ఉన్న మూడేళ్ల కాలం ప్రజల మద్దతు ఆచరణాత్మకంగా కూడా పెట్టుకుంటేనే, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్లో తాను నిలదొక్కుకొని కాంగ్రెస్ ను నిలబెడతారు. ఒక వేళ ప్రజల అసంతృప్తి జ్వాలలకు కాంగ్రెస్ బలయ్యే పక్షంలో తనకున్న ప్రత్యామ్నాయం ద్వారా బీజేపీ పక్షాన కూడా రేవంత్ రెడ్డి కి స్పేస్ ఉండే అవకాశం కాదనలేం! అవసరం అయితే సయోధ్యకు గురువు చంద్రబాబు నాయుడు ఉండనే ఉన్నారు? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా! వయస్సులో చిన్న వాడిగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పదేళ్ళుగా, ఇరవై ఏళ్ళుగా,తీర్చిదిద్దుకునే అవకాశం ఆయన చేతిలోనే ఉంది.పరిపాలనలో తనదైన ముద్ర వేసి తెలంగాణా ప్రజలకిచ్చిన వాగ్దానాలు,ఆశలు, ఆశయాలు అన్నీ పరిపూర్ణం చేయాలని కోరుకుందాం.రెండేళ్ళ పాలనా అనుభవాలు సాకారం చేసుకొని పదేళ్ళ ప్రణాళికకు శ్రీకారం చుట్టాలని ఆశిద్దాం.





