*బాధ్యతాయుత వోటింగ్ తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
*తెలంగాణలో వోటర్లు 3.39 కోట్లకు చేరారు: సీఈవో సి. సుదర్శన్ రెడ్డి
బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది థీమ్ “నా భారత్ – నా ఓటు” పౌరులే భారత ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువని స్పష్టంగా తెలియజేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం స్థాపనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘానికి కల్పించిన స్వతంత్రత, నిష్పక్షపాతత్వమే స్వేచ్ఛాయుత, న్యాయసమ్మత ఎన్నికలకు పునాది అని గవర్నర్ అన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, అర్హులైన ఓటర్లకు హోమ్ ఓటింగ్, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఎన్నికలు మరింత సమగ్రంగా మారాయని ప్రశంసించారు. జూబ్లీహిల్స్ (61) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను డ్రోన్ నిఘా, పోలీసు సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించిన తీరును అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుధర్శన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాల్లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందుకోసం 35,895 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటర్లలో 1.68 కోట్ల మంది పురుషులు, 1.70 కోట్ల మంది మహిళలు, 2,890 మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారని, గత జాతీయ ఓటర్ల దినోత్సవం నుంచి ఇప్పటివరకు సుమారు 3.93 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరినట్లు వెల్లడించారు.
యువ ఓటర్లు, సీనియర్ సిటిజన్ల నమోదు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఓటరు జాబితా సవరణ లక్ష్యం నిజమైన ఓటర్ల తొలగింపు కాదని, ద్వంద్వ, అనర్హ నమోదుల తొలగింపేనని స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులకు గౌరవ వేతనం పెంపు, ఏడాదికి నాలుగు అర్హత తేదీలు, ఈసినెట్ (ECINET) ద్వారా ఆన్‌లైన్ సేవలు వంటి ఎన్నికల సంఘ సంస్కరణలను వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీమతి ఐ. రాణి కుముదిని, అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ , జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్, డిప్యూటీ సీఈవో హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.





