ఖమ్మంలో పోస్టర్ ఆవిష్కరించిన కవిత
ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 2: బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 17న రైలు రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని బీసీ రిజర్వేషన్లు ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ జిల్లా ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొనాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్‌రావుదే అని కవిత స్పష్టం చేశారు. రైలు రోకోకు సంబంధించిన పోస్టర్‌ను కవిత విడుదల చేశారు. వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం-బనకచర్ల విషయంలో జిల్లాలోని ముగ్గురు మంత్రులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మరణం బీఆర్‌ఎస్ పార్టీతోపాటు ఖమ్మం జిల్లాకు తీరని లోటన్నారు. మదన్‌లాల్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మదన్‌లాల్ కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు.