1950 దశకంలో బొంబయి నగరంతో కలసిన మహారాష్ట్రను కోరుతూ ఏర్పడ్డ సంయుక్త మహారాష్ట్ర సమితికి చెందిన అనేక నాయకులు అంబేడ్కర్ తో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. వారిలో శంకర్రావ్ మోరే, కేశవ్ సీతారాం ఠాక్రే, , పాండురంగ్ సదాశివ్ సానే, ఎస్.ఎం.జోషి, రామ్ మనోహర్ లోహియా తో బాటు ప్రహ్లాద్ కేశవ్ అత్రే కూడ ఉన్నారు. పీకే అత్రే వంటి ప్రముఖ మరాఠీ మేధావులు, ప్రజా ప్రతినిధులు తన రాజకీయ సంస్థ ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’లో చేరాలని అంబేడ్కర్ గారి కోరిక. 1953 చివరి రోజుల్లో అంబేడ్కర్ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది, రెండు నెలలకు పైగా ఆయన బొంబాయిలోని హాస్పిటల్ మిరాబిల్లేలో చికిత్స పొందాడు. జ్వరంతో వున్నప్పటికీ, 1954 జనవరి 4 ఆదివారం బొంబాయిలోని ప్రసిద్ధ స్టూడియోలో అత్రే పిక్చర్స్ మరాఠీ సమర్పణ ‘మహాత్మా ఫూలే’ చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభోత్సవాన్ని గావించారు. ఈ చిత్రం 1955 డిసెంబరు 21న ప్రదానం చేసిన 2 వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో మరాఠీలో ఉత్తమ చిత్రంగా మొదటి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి సిల్వర్ మెడల్ ను గెలుచుకుంది.
కాకతీయ కలగూర గంప-12
తెలంగాణ పాత ముచ్చట్లు
‘ఆచార్య అత్రే’ గా ప్రసిద్ధి చెందిన ప్రహ్లాద్ కేశవ్ అత్రే (1898 – 1969) ప్రముఖ మరాఠీ రచయిత,కవి, విద్యావేత్త. ‘మరాఠా’ అనే ప్రసిద్ధ మరాఠీ భాషా వార్తా పత్రిక సంపాదకుడు మరియు గొప్ప వక్త. ఈయన వ్యవస్థాపక-సంపాదకుడుగా వున్న ‘మరాఠా’ దిన పత్రిక మరియు ‘నవయుగ్’ అనే వారపత్రికలు చాలా సంవత్సరాలు పెద్ద సర్క్యులేషన్తో నడిచాయి. అత్రే నాటక, సినీ రంగాలలో కూడ రచయిత గా, దర్శకుడిగా కూడ రాణించారు. ఆయన రాసిన 7 నాటకాలు హాస్య భరితమే కాకుండా ఆలోచనలను రేకెత్తించేవిగా వుండేవి. ఆయన తీసిన మరాఠీ చిత్రం “శ్యామ్ చీ ఆయి” 1954 లో ఉత్తమ చలనచిత్రం గా ఎన్నికైంది. అయన పూణే యూనివర్సిటీ నుండి బీ ఏ పూర్తయినాక లండన్ యూనివర్సిటీ నుండి టీచర్స్ డిప్లమా చేసి పాఠశాల ఉపాధ్యాయుడిగా తొలుత కొన్ని ఏండ్లు పనిచేశారు. ఇక బొంబయి రాష్ట్రాన్ని విభజించినపుడు ‘బొంబయి’ (నేటి ముంబయి) నగరాన్ని కేంద్ర పాలిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకిస్తూ ఏర్పడ్డ ‘సంయుక్త మహరాష్ట్ర సమితి’ లో ఆవిర్భావ సభ్యుడు. ఆ సందర్భంగా ఆయన చేసిన హాస్య విమర్శనాస్త్రాలు మరాఠా జనులను అమితంగా ఆకట్టుకునేవి.ఈ విధంగా అయన పలు రంగాలలో నిష్ణాతుడైన ఒక మేధావి.

పీ వీ గారు జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థిగా 1939 లో మొదటిసారిగా నాగపూర్ చేరారు. ఎందువల్ల నాగపూర్ పోవలసి వచ్చిందో తెలుసుకుందాం.1938 ప్రాంతాల్లో ఉస్మానియా యూనివర్సిటీ కేంపస్ లో కొంత మంది విద్యార్థులు కాలేజీ ప్రార్థన సమయంలో “వందే మాతరం” దేశ భక్తి గీతాన్ని పాడేవారు. ఆ విషయం అధికారుల దృష్టికి రాగానే కేంపస్ లో ‘వందే మాతరం’ గీతాన్ని పాడటాన్ని నిషేధిస్తూ 28 నవంబర్, 1938 నాడు ఉత్తరువులు జారీ చేశాడు నిజాం నవాబ్. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ఉద్యమించారు. వీరికి సంఘీభావం ప్రకటిస్తూ అలనాటి నిజాం రాష్ట్ర ఇతర ప్రాంత (వరంగల్, గుల్బర్గా, ఔరంగాబాద్) విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఉద్యమించారు. ఉద్యమించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ఠులతో (350 మంది) బాటు ఇతర ప్రాంత విద్యార్థులను కూడా పాఠశాలల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విధంగా వరంగల్ లో చదువుతున్న 39 మంది విద్యార్థులను కూడా తొలగిస్తే, వారిలో పీ వీ నరసింహా రావు, పాములపర్తి సదాశివరావు ప్రభృతులున్నారు. ఈ విద్యార్థులకు మద్రాసు యూనివర్సిటీవారు గానీ, ఆంధ్రా యూనివర్సిటీవారు గానీ చేర్చుకునే అవకాశం కల్గించలేదు. ‘యూనివర్సిటీని గుర్తించం; కాబట్టి చేర్చుకోం’ అన్నారు. అప్పటి నాగ్ పూర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కేదార్ గారు, ఆ యూనివర్సిటీ సెనేట్ లో ఉస్మానియా యూనివర్సిటీని గుర్తింపు చేయించి ఉస్మానియా విద్యార్థులకు అడ్మిషన్ కల్పించినారు. ఈ విధంగా బహిష్కృతులైన విద్యార్థుల్లో చాలా మంది నాగపూర్ యూనివర్సిటీలో చేరారు. వారిలో జూనియర్ ఇంటర్మీడియేట్ చదువుతున్న పీవీ కూడా ఒకరు.

మొదటిసారిగా నాగ్ పూర్ చేరిన పీవీకి వింత ప్రపంచం, క్రొత్త వాతావరణం కనబడింది. ఈ నూతన జీవన శైలికీ, తానిప్పటి వరకు మెలిగిన నైజాం రాష్ట్ర ప్రజా జీవనానికీ గల వ్యత్యాసం పీవీ ని అబ్బుర పరచడమే కాకుండా ఆయనలో ఆలోచనా శక్తిని ఇనుమడింప జేసింది. అక్కడి స్వేచ్చా వాతావరణాన్ని – ముఖ్యంగా బురఖా లేని స్త్రీలు వీధుల్లో తిరగడం, విద్యార్థినులు సైకిళ్ళ పైన కాలేజీలకు రావడం, విద్యార్థులతో సమంగా ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చూసి ఆనందించాడు.వైవిధ్యంతో కూడిన ఈ క్రొత్త స్వేచ్చాయుత వాతావరణంతో పీవీ ఎంతో ఉత్తేజం పొందాడు. ఆ కౌమార ప్రాయ పీవీ జాతీయ విలోకనలో విస్తృతి పెరిగింది. ఆ నూతన సమాజాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మరాఠీ భాషను నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మరాఠీ నాటకాలను, సినిమాలను పరిశీలనాత్మకంగా చూచేవాడు. అసలే మంచి సినిమాలపై మక్కువ గల పీవీ అక్కడి మరాఠీ సినిమాలను చూసి వాటి స్థాయి తెలుగు సినిమాల కంటే ఎంతో ఆధిక్యమని గ్రహించాడు. అక్కడి నటీనటులను అభిమానించాడు. ‘ప్రహ్లాద్ కేశవ్ అత్రే’ అనే గొప్ప రచయిత అలనాటి నాటకాలలో, సినిమాలలో తన రచనల ద్వారా గుప్పించిన హాస్యం పీవీ కి అమితంగా నచ్చింది. తరవాత మనం పీవీ లో గాంచిన హాస్య సంభాషణా చాతుర్యం అత్రే ద్వారా సంక్రమించిందేమో? ఈ విధంగా పీ వీ గారికి మేధావి ‘అత్రే’ గారు అమితంగా నచ్చారు.
పీ వీ గారు అత్రే గారి కంటే చాలా (దాదాపు పాతికేళ్ల) చిన్నవాడు. ఇక బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు అత్రే గారి కంటే ఏడేండ్లు మాత్రమే పెద్ద. ఈ ఇద్దరి మధ్య గొప్ప స్నేహానుబంధం ఉండేది. 1950 దశకంలో బొంబయి నగరంతో కలసిన మహారాష్ట్రను కోరుతూ ఏర్పడ్డ సంయుక్త మహారాష్ట్ర సమితికి చెందిన అనేక నాయకులు అంబేడ్కర్ తో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. వారిలో శంకర్రావ్ మోరే, కేశవ్ సీతారాం ఠాక్రే, , పాండురంగ్ సదాశివ్ సానే, ఎస్.ఎం.జోషి, రామ్ మనోహర్ లోహియా తో బాటు ప్రహ్లాద్ కేశవ్ అత్రే కూడ ఉన్నారు. పీకే అత్రే వంటి ప్రముఖ మరాఠీ మేధావులు, ప్రజా ప్రతినిధులు తన రాజకీయ సంస్థ ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’లో చేరాలని అంబేడ్కర్ గారి కోరిక. 1953 చివరి రోజుల్లో అంబేడ్కర్ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది, రెండు నెలలకు పైగా ఆయన బొంబాయిలోని హాస్పిటల్ మిరాబిల్లేలో చికిత్స పొందాడు. జ్వరంతో వున్నప్పటికీ, 1954 జనవరి 4 ఆదివారం బొంబాయిలోని ప్రసిద్ధ స్టూడియోలో అత్రే పిక్చర్స్ మరాఠీ సమర్పణ ‘మహాత్మా ఫూలే’ చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభోత్సవాన్ని గావించారు. ఈ చిత్రం 1955 డిసెంబరు 21న ప్రదానం చేసిన 2 వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో మరాఠీలో ఉత్తమ చిత్రంగా మొదటి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి సిల్వర్ మెడల్ ను గెలుచుకుంది. అంబేడ్కర్ గారి మరణం తర్వాత ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆచార్య అత్రే అన్న గొప్ప సందేశం “భారత దేశం లో ఇలాంటి అంబేడ్కర్ యుగం శతాబ్దాలలో జరగదు. సముద్రపు అలల వలె తుఫానును అధిగమించే స్వభావం ఆయనది.” పై ముగ్గురు మహనీయులకు మా నమస్సుమాంజలులు
-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
-పాములపర్తి నిరంజన్ రావు