స్వేచ్ఛకు పట్టం కట్టింది… సమానత్వానికి సమున్నత పీఠం వేసింది.. సౌభ్రాతృత్వానికి బ్రహ్మరథం పట్టింది. మన భారత రాజ్యాంగం. 389 సభ్యుల ఆలోచనల సమాహారంగా ప్రాణంపోసుకుంది. అందులో పదిహేనుమంది మహిళామణులు పాలుపంచుకోవడం మరపురాని ఘట్టం. వారి గురించి ఒక్కసారి..
కమలా చౌదరి: భారత స్త్రీలు నిత్య జీవితంలో ఎదుర్కొనే అంశాలపై అనేక రచనలు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేశారు.
మాలతీ చౌదరి: గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ ప్రభావం మాలతి మీద అపారం. అణగారిన వర్గాలకు సేవ చేయడానికి ఒరిస్సాకు చేరుకున్నారు. సుచేతా కృపలానీ: భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
లీలా రాయ్: స్ఫూర్తిదాయక మహిళ.. భారత స్వాతంత్య్రోద్యమంలో, ఇతర సామాజిక, రాజకీయ పోరాటాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రేరేపించారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్: స్వాతంత్య్ర పోరాటంలో మహిళలు అనగానే.. తెలుగువారికి వెంటనే గుర్తుకొచ్చే పేరు దుర్గాబాయి దేశ్‌ముఖ్. తెలుగు యువతులకు విద్యతోపాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఆంధ్ర మహిళా సభను స్థాపించారు.
హంసా జీవరాజ్ మెహతా: 1947 ఆగస్టు 15.. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన సమావేశంలో రాజ్యాంగ సభకు జాతీయ పతాకాన్ని అందించిన వ్యక్తిగా హంసా జీవరాజ్ మెహతా చరిత్రలో నిలిచిపోయారు. అమ్ము స్వామినాథన్: వుమెన్స్ ఇండియా అసోసియేషన్.. బాల్య వివాహాలు, దేవదాసీ వ్యవస్థ లాంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా కృషిచేశారు.
దాక్షాయణీ వేలాయుధన్: దళిత హక్కుల నాయకురాలు దాక్షాయణి కేరళలోని కొచ్చిన్ సమీపంలో ఉన్న బోల్గట్టి దీవిలో జన్మించారు. దళితులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు దాక్షాయణి డాక్టర్ అంబేద్కర్‌కు బాసటగా నిలిచారు. అంటరానితనం, రిజర్వేషన్లు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు మొదల్కెన విషయాల గురించి విలువైన సూచనలు చేశారు.
సరోజినీ నాయుడు: స్వాతంత్య్ర సమర యోధురాలు, కవయిత్రి సరోజినీ నాయుడు. ఆమె హైదరాబాద్‌లో జన్మించారు. లండన్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర పోరాటంలో తన పాత్ర పోషించారు.
విజయలక్ష్మీ పండిట్: భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. దౌత్యవేత్తగా మారిపోయారు. ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
పూర్ణిమా బెనర్జీ: గాంధీజీ పిలుపు మేరకు వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు.
రాజకుమారి అమృత్ కౌర్ : కపుర్తలా రాజ కుటుంబానికి చెందిన రాజకుమారి అమృత్ కౌర్ స్వతంత్ర భారత తొలి ఆరోగ్య శాఖ మంత్రి.
బేగం ఐజాజ్ రసూల్: బ్రిటిష్ ఇండియాలో అన్-రిజర్వ్‌డ్ స్థానం నుంచి ఎన్నికైన అతికొద్ది మహిళా శాసనసభ్యుల్లో ఒకరు. జమీందారీ విధానం లాంటి భూస్వామ్య లక్షణాలను వ్యతిరేకించారు. రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం కలిగిన ఏకైక ముస్లిం మహిళ..
రేణుకా రాయ్: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ పిలుపు అందుకుని ఆయన ఆశ్రమంలో చేరిపోయారు. మహాత్ముని సారథ్యంలో జరిగిన సత్యాగ్రహాల్లో భాగమయ్యారు.
అనీ మాస్కరీన్: కేరళ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళ. రాజకీయాల్లో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమైన విషయమంటూ మాస్కరీన్ లేవనెత్తిన చర్చ అందర్నీ ఆలోచింపపేసింది.
-ఎన్.జె.