– బీఆర్ ఎస్‌కు ప్రజలు పట్టం కడతారు
– అఖిలేష్ యాదవ్ ఆశాభావం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని, నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్ఎస్ కి ప్రజలు తిరిగి అవకాశాన్ని ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే, ప్రజలు తప్పకుండా అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లిన అఖిలేష్ కేటీఆర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఒక్కోసారి ప్రజలు మన పనితీరును, విధానాలను పునఃసమీక్షించుకునే అవకాశాన్ని ఓటమి ద్వారా కల్పిస్తారని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరిస్తూ.. గతంలో మేం కూడా చాలా తక్కువ సీట్లు గెలిచాం. కానీ ప్రజలు మా వెంటే నిలిచారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టి 37 మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరూ ఊహించలేరు. ప్రజల వెంట ఉంటే వారే తమకు అవకాశాన్ని ఇస్తారన్నారు. కచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు. దేశంలో ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని, వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ప్రతికూలత పోవాలని, అభివృద్ధి, సానుకూల దృక్పథంతో కూడిన ప్రగతిశీల రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. తాము అదే విజన్‌తో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టిన అఖిలేష్ తీరు తమకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. అదే స్ఫూర్తితో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ తో సమావేశం అవుతారని తెలిపారు. ఈరోజు తనతోపాటు పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి మా ఆతిథ్యం స్వీకరించినందుకు అఖిలేష్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





