ఐదేళ్లూ ఆడింది ఆట, పాడింది పాట!

ఆర్థిక వ్యవస్థలో ఎన్నికల ఖర్చు కూడా ఒక ఖర్చేనా…?

ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి పండుగ వంటివి. పండగ ఖర్చును చూసి ఎవరూ భయపడరు. ఉన్నవాడు లేని వాడు అంతా తమకు ఉన్న దాంట్లో పండగ చేసుకుంటారు. అలాంటి ప్రజాస్వామ్య పండుగకు ప్రభుత్వం చేసే ఖర్చును బూచీగా చూపించి మోదీ సర్కార్‌ జమిలీ ఎన్నికలను ముందుకు తెచ్చింది. నిజానికి ఖర్చు మాట పైకి చెబున్నది. లోగుట్టు వేరే.  ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎన్నికల ఖర్చు కూడా ఒక ఖర్చేనా అనిపిస్తుంది సామాన్యుడికి సైతం. ఎన్నికల ఖర్చు ఆదా అంటే.. అది ఎన్నికల నిర్వహణ ఖర్చు ఆదానా లేక రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చులు  తగ్గించుకునేందుకా! లోక్‌సభ ఎన్నికలు ఒక సారి, అసెంబ్లీ ఎన్నికలు ఒక సారి వొస్తే..
రెండు సార్లు నేతలు ఓటుకు నోటు ఇవ్వాలి,  ప్రచారానికి భారీగా ఖర్చు పెట్టాలి, మందు ముక్క కు ఖర్చు పెట్టాలి..
అదే ఒకేసారి ఎన్నికలు వొచ్చేస్తే ఖర్చులో ఖర్చు తగ్గిపోతుంది! అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌ సభ ఎన్నికలకు రెండు సార్లు నోటు ఇవ్వాల్సిన పని ఉండదు, ఇక ప్రచార ఖర్చు అయితే మరింతగా తగ్గిపోతుంది! బహుశా నేతలకు ఒకేసారి ఖర్చు చేసి ఐదేళ్ల పాటు ఇష్టానుసారం వ్యవహరించుకోవ డానికే ఈ జమిలి ఎన్నికల ఆలోచన కాబోలు! అయితే ఈ మాత్రం ఆలోచన, ఈ మాత్రం జ్ఞానం అమెరికా వంటి దేశానికి ఎందుకు లేదో మరి. అక్కడి ప్రతి నాలుగేళ్లకూ ఒకసారి ఎన్నికలు పెట్టుకున్నారు.  శతాబ్దాల నుంచి అలాగే కొనసాగిస్తూ ఉన్నారు! మన దగ్గర ప్రధానికి అవకాశం ఐదేళ్లు, ముఖ్యమంత్రికి అవకాశం ఐదేళ్లు.. అన్ని ప్రజాస్వామ్య బద్ధ పదవులకూ ఐదేళ్ల కాలాన్ని ఇచ్చింది భారతరాజ్యాంగం. అమెరికాలో మరీ నాలుగేళ్లే అవకాశం. ఐదేళ్లతో పోలిస్తే నాలుగేళ్లు ఒక ఏడాది ముందుగానే గడిచిపోతాయి. సర్దుకోవడానికి ఏడాది పడుతుంది, చివరి ఏడాది ఎన్నికల ఏడాది. మధ్యలో మిగిలింది రెండేళ్ల సమయమే.. అయితే ఏ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ కూడా నాలుగేళ్లు మరీ తక్కువ కాలం, దాన్ని ఐదేళ్లు చేయాలనో, ఆరేళ్లు చేయాలనో వాదించలేదు! అలా తమ పదవీ కాలాన్ని పెంచుకునే ప్రయత్నాలనూ చేయలేదు!
ఎన్నికల ఖర్చు గురించి తెగ బాధపడిపోతూ ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక దేశం ఒక ఎన్నికలు అంటూ వాదిస్తూ ఉంది. అయితే ఏదైనా  ‘ఒకే’ అనేది భారత్‌కు వర్తింపచేయటం చాలా కష్టం. అసలు కుదరదు. ఎందుకంటే మనది భిన్నత్వం! భిన్నత్వంలో ఏకత్వమే భారత ప్రజాస్వామ్యానికి  ఊపిరి పోస్తూ వచ్చింది. అయితే మరీ ముఖ్యంగా 2014  నుంచి ఒకటే ఒకటే.. అనే మాట బాగా వినిపిస్తూ ఉంది. ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే పౌరసత్వం, ఒకటే ఎన్నిక.. ఇలాంటి వాదనలు ముఖ్యమైన పదవుల్లోని వారి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కక్కటిగా సాధించుకుంటూ ఉన్నారు! మరి ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిగిపోతే ఆ తర్వాత ఐదేళ్లు ఇక ఏం చేసినా అడిగే వారు ఉండరనా! మొన్నటి వరకూ మోదీజీకి చాలా కష్టం ఉండేది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలంటే కర్ణాటక చుట్టూ నెల రోజుల పాటు తిరగాలి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలంటే మహారాష్ట్ర కు తనే సీఎం అభ్యర్థిని అన్నట్టుగా ప్రచారం చేయాలి..
ఇలా దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు వొచ్చినా.. ప్రధానిగా కన్నా.. ఆ  రాష్ట్రానికి  తనే సీఎం క్యాండిడేట్‌ అన్నట్టుగా మోదీ  ప్రచారం చేసి పెట్టే వాళ్లు! మరి ఈ ఇబ్బంది వద్దనే.. ఒక దేశంలో అన్ని రాష్ట్రాలకూ , అన్ని లోక్‌ సభస్థానాలకూ ఎన్నికలు జరిగేస్తే? ఆ తర్వాత మోదీకి ఇలా ముఖ్యమంత్రి అభ్యర్థి తరహాలో ప్రచారం చేయాల్సిన అవసరం తప్పుతుంది! ఇక ఆయన ఎంచక్కా ప్రధానిగా తన పనుల్లో మునిగిపోవొచ్చు. అలాగే యూపీ అసెంబ్లీ ఎన్నికలంటే పెట్రో ధరలను పెంచకుండా కొన్నాళ్లు ఓపిక పట్టే వారు, ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన రోజు నుంచి పోలింగ్‌ ముగిసే రోజు వరకూ ధరల హెచ్చులు ఉండేవి కావు. అలాగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నప్పుడు కొన్ని ప్రజాకర్షక పథకాలు ఉండేవి. ఇక వాటి అవసరం కూడా ఉండదు. ఎలాగూ దేశమంతా ఐదేళ్లకు ఒకసారి అన్ని ఎన్నికలూ అయిపోతాయి కాబట్టి..  ఇక ఆ రెన్నాళ్లూ ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తే చాలు, ఆ తర్వాత ఐదేళ్లూ ఆడిరది  ఆట, పాడిరది పాట! కార్పొరేట్లకు వంత పాడుకోవొచ్చు , సామాన్య ప్రజలు మరో ఐదేళ్ల వరకు సైలెంట్‌గా మూలనపడి ఉంటారు.
-కె.ఎస్‌  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page