ప్రదర్శనాత్మక దేశభక్తి అనేది ఎక్కువగా దేశభక్తిని బాహ్యంగా ప్రదర్శించడంలో కేంద్రీకృతమై ఉంటుంది. మరోవైపు, బాధ్యతాయుత దేశభక్తి అనేది దేశ పాలనాభివృద్ధికి సహాయపడే చర్యలపై దృష్టి పెడుతుంది. ఏ కారణమో కానీ, భిన్నాభిప్రాయం తెలపడమన్నది అతి ఉన్నతమైన దేశభక్తి రూపమని కొన్ని తర్కబద్ధమైన గొంతులు పేర్కొంటాయి. అంటే, దేశభక్తి అనేది జాతీయ గీతం పఠించడం, జెండా ఎగరేయడం లేదా వాహనాలపై రెపరెప లాడించడం కన్నా చాలా లోతైన అంశమన్నమాట. ఇటీవల పహల్గామ్ లో పాక్ మద్దతుతో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు వారి కుటుంబాల ఎదుటే హతమవగా, ఈ దారుణ కృత్యానికి ప్రతీకారంగా, ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక చర్య తరువాత ఇప్పుడు పరిస్థితి కొంత శాంతించింది. మొత్తానికి, మీడియా ..ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలు సృష్టింఛిన హైప్ నుంచి మనం కొంతవరకు బయట పడుతున్నాం.
అమెరికా అధ్యక్షుడు తాను ఈ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేసానని పదేపదే చెప్పుకోవడం ఆయన పై అనుమానాలు కూడా కలిగే పరిస్థితికి దారితీసింది. అయితే ఈ కాల్పుల విరమణ డ్రామా ఇరు దేశాలూ సంపూర్ణ యుద్ధానికి సిద్ధంగా లేవన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది. అందుకే ఇరు దేశాలూ గౌరవంగా వెనక్కి తగ్గేందుకు మార్గాలు వెతికాయి. అయినప్పటికీ, ఇరుదేశాల నాయకత్వాలు తమ దేశాల్లో విజయాలు సాధించామంటూ ప్రచారం చేస్తూ, తమ సైనిక బలగాల వీరత్వాన్ని, ధైర్యాన్ని, నైపుణ్యాన్నీ కొనియాడుతున్నాయి. అంతే కాదు, ఇప్పుడు రాజకీయ పార్టీలూ, ఈ యుద్ధ ప్రతిస్పందనపై తమ తమ రాజకీయ లాభాల కోసం రంగంలోకి దిగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు కాల్పుల విరమణ సమయాన్ని, అమెరికా పాత్రను ప్రశ్నిస్తున్నారు. కొందరు దీనిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) “ఆపరేషన్ సిందూర్” విజయాన్ని ప్రజలకు తెలియజేయాలని దేశవ్యాప్తంగా “తిరంగా యాత్ర” ప్రారంభించగా, కాంగ్రెస్ పార్టీ “జైహింద్ యాత్ర” చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై పారదర్శకత మొదలైన వాటిపై సమాధానాల కోసం ప్రయత్నం చేస్తామని అంటోంది.
రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఎన్ని విన్యాసాలు చేసినా, ఇప్పుడు మనం లోతుగా దాగిన వాస్తవాలను వెలికితీసే సమయం వొచ్చేసింది… ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లనిపించినా కానీ, ముఖాముఖి ప్రశ్న అడగాల్సిన సమయం వొచ్చేసిందనుకోవాలి. అసలు “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించాల్సిన పరిస్థితి ఎందుకు వొచ్చిందన్నది ప్రశ్న! ఇలా అడగడం ఎక్కడైనా దూషించుకోదగిన చర్యగా భావించకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ మద్దతుతో జరిగిన నరహత్యలకు ప్రతీకారంగా తీసుకున్న చర్యగా ఇది అనివార్యమైందని అంగీకరించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఎవరెంత ఎంత భిన్నంగా ఆలోచించినా సరే పరిస్థితి ఇదే. ప్రభుత్వాన్ని, సైన్యాన్నీ ముందుగా ప్రశంసించక తప్పదు. ఎందుకంటే ఇలాంటి చర్యలతో భవిష్యత్తులో జరిగే ఉగ్రవాద చర్యలపై కఠినంగా స్పందిస్తామని ప్రపంచానికి (ముఖ్యంగా పాకిస్తాన్‌కి) సంకేతం ఈ విధంగా ఇచ్చారు. ఇది చాలా అభినందనీయమైన విషయం.
కానీ, పహల్గామ్‌లో దాడి ఎలా జరిగింది? అక్కడ భద్రత ఎందుకు లేకపోయింది? బైసారన్ వంటి ప్రదేశాన్ని ఎవరు నిర్లక్ష్యం చేశారు? భద్రతా లోపానికి బాధ్యులైన వారిపై ఏమైనా చర్య తీసుకున్నారా? (ప్రభుత్వమే ఆల్ పార్టీ మీటింగ్‌లో భద్రతా లోపం ఉందని అంగీకరించింది). అందుకు బాధ్యత ఎవరిదీ? “ఆపరేషన్ సిందూర్” ద్వారా ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయడం, 100 మంది ఉగ్రవాదులను చంపినట్టుగా ప్రభుత్వం చెప్పినా, పహల్గామ్ దాడిలో పాల్గొన్న నలుగురు నేరస్తులు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. వాళ్లు ఎక్కడ? వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నం ఎందుకు జరగలేదు? కాల్పుల విరమణకు ముందే పాకిస్తాన్ వాళ్లను అప్పగించాలంటూ భారత్ డిమాండ్ ఎందుకు చేయలేదు?
ఈ ప్రశ్నలకు దేశం ఎప్పుడైనా సమాధానాలు పొందుతుందా? లేక ప్రస్తుతం తామెరిగిన విజయంతో తృప్తిపడి, ప్రదర్శనాత్మక దేశభక్తిలో మునిగిపోయిపోతుందా? భిన్నాభిప్రాయాన్ని వ్యతిరేకంగా చూసే రాజకీయ వ్యవస్థ నుంచి సమాధానాలు ఆశించడం అత్యాశే ..! సైనిక విజయాన్ని జరుపుకోవడం ప్రదర్శనాత్మక దేశభక్తి. కానీ, పహల్గామ్ దాడిలో మరణించిన స్త్రీల “సిందూరం” కోల్పోయేలా చేసిన పొరపాట్లకు బాధ్యత వహించడం, “ఆపరేషన్ సిందూర్” వంటి చర్యల పట్ల సమగ్ర ఆత్మపరిశీలన చేయడం.. ఇదే నిజమైన బాధ్యతాయుత దేశభక్తి. ఇది గ్రహించి ఇకనైనా పరిపక్వతను ప్రదర్శిస్తారని ఆశించవొచ్చా?